8, అక్టోబర్ 2022, శనివారం

మనస్సు మారకూడదు

 *మనిషిని మనీషిగా మార్చే పాఠం*


కొన్ని సార్లు మనం ఎదుటి వారికి వారి మంచి కోరి చెప్పే మాటలు ఎటువంటి మార్పు తేలేనప్పుడు ఒక్కసారి వ్యతిరేకంగా మాట్లాడి చూడండి. మార్పు ఖచ్చితంగా వస్తుంది. మన ఉద్దేశ్యం అర్థం చేసుకున్నవారు మనల్ని మంచిగా చూస్తారు. కొందరు అపార్థం చేసుకున్నంత మాత్రాన పోయేది ఏమి లేదు. మనసుకు కాస్త బాధ కలిగిన మన వాళ్లు సంతోషంగా ఉంటే అదే చాలు .

   

బ్రతికి ఉన్నప్పుడు ఎవరినైతే ఏడిపిస్తారో వాళ్ళు మనం చచ్చాక నవ్వుకుంటారు . మనం బ్రతికి ఉన్నప్పుడు ఎవరినైతే నవ్విస్తామో వాళ్ళు మనం చచ్చాక మన కోసం ఏడుస్తారు, రూపాయి అయినా రూపం అయినా ఎక్కువ రోజులుండవు కానీ మనిషి యొక్క మంచితనం ఎప్పటికి గుర్తుండిపోతుంది . భౌతికంగా కనిపించే అందాన్ని చూసుకొని మురిసి పోవడానికి అదేమీ శాశ్వతంగా ఉండదు, మనసును అందంగా ఉంచుకుంటే పది మందికి గుర్తుండి పోతాము.


మానవ జీవితం చాలా చిన్నది ఎవరినో ద్వేషిస్తూ కాలాన్ని వృధా చేయకుండా  క్షమించడం నేర్చుకోవాలి, అప్పుడే సంతోషంగా గడపగలం. మనిషిలో అహం తగ్గిన రోజు ఆప్యాయత ఏంటో అర్థమవుతుంది, గర్వం పోయిన రోజు ఎదుటివారిని ఎలా గౌరవించాలో  తెలుస్తుంది . నేనే గొప్ప నాకేంటి అనుకుంటే చివరికి ఒక్కరిగానే ఉండిపోవాల్సివస్తుంది. 


గౌరవమర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటూ ఆనందంగా ఇతరులతో కలిసి జీవించడమే మంచి జీవితం. అది ఇంతపెద్ద పని అయినా సరే చేయగలిగిన సత్తా మనలో ఉన్నా చేయలేనేమోనన్న భయం మనలో వెంటాడుతూ ఉంటుంది. భయం శక్తివంతమైనదే కాని నమ్మకం అంతకన్నా శక్తివంతమైనది, నమ్మకంతో ముందుకు వెళ్లగలిగితే విజయం ఎప్పుడూ మనతోనే ఉంటుంది.


ఎప్పుడు కలిశారు అన్నది కాదు ముఖ్యం, ఆ పరిచయం ఎలాంటిది అన్నది కాదు ముఖ్యం, మనం పిలిచే  పిలుపు మన ప్రవర్తన ఎదుటి వారి హృదయానికి హత్తుకునేలా ఉంటే చాలు మనకు తెలియకుండానే మన జీవితంలో ముఖ్యమైన ఆప్తులుగా మారిపొతారు. ప్రపంచంలో ఏ తప్పు చేయని వ్యక్తి ఉండకపోవచ్చు, ఓ వ్యక్తి తప్పు చేసినప్పుడు అతను ఉన్న మానసిక శారీరక స్థితిని విశ్లేషించుకుంటే అతని వ్యక్తిత్వం తెలుస్తుంది, వ్యక్తి వ్యక్తిత్వం సరైనది. ఒకటికి రెండు సార్లు ఆలోచించాక ఆ బంధాన్ని అంటి పెట్టుకునే అవసరం లేదు.


మనకు  జీవితంలో మంచి స్నేహితులు అదృష్టం కొద్దీ  పరిచయం అవుతారు, మనల్ని ప్రతి క్షణం సరి చేస్తూ కాపాడుతూ ఉంటారు, మన క్షేమం మనకంటే ఎక్కువ వారే కోరుకుంటారు, ఇలాంటి మిత్రులను చివరి శ్వాస వరకు కాపాడుకోవాలి, అలా ప్రేమించగలిగే మిత్రులు ఒక్కరు అయినా సరే, వారు ఎక్కడ ఉన్నా సరే వారిని హృదయంలో పెట్టుకుని కాపాడుకోవాలి, అలాంటి స్నేహితులు మనకున్నారు అంటే వారిముందు భేషజాలు లేకుండా స్వచ్చంగా ఉండాలి, అప్పుడే జీవితాంతం సంతోషంగా ఉంటాం. 


ప్రేమ ఉన్నచోట అహం ఉండకూడదన్నట్టు.  స్నేహం ఉన్నచోట విలువలు అడ్డు రాకూడదు. బంధం ఉన్నచోట ధనం బేధం ఉండ కూడదు. బాధ్యత ఉన్నచోట బరువు అనిపించ కూడదు.  ఎంత కష్టం వచ్చిన నీలో నువ్వే ఓదార్చుకోవటం నేర్చుకోవాలి, కష్టాలను చూసి సమాజం నవ్వుతుంది తప్ప నా అని దగ్గరకు తీయదు, మనం మంచిగా ఉంటే చెడగొట్టడం, చెడిపోతే హేళన చేయటం ఈ సమాజం నైజం, మంచితనం అనేది ఒక మహా వృక్షం లాంటిది ఎవరెంత నరికినా అది మళ్ళీ మళ్ళీ చిగురిస్తూనే ఉంటుంది గుండె లోలోతుల్లో నుండి జీవం పోసుకుంటూనే ఉంటుంది.


మిమ్ముల్ని అర్థం చేసుకున్న వారికి మీరేమిటో చెప్పాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని అర్థం చేసుకోని వారికి మీ గురించి చెప్పవలసిన అవసరం అంతకంటే లేదు, జీవితమే ఒక పయనం ఆ పయనంలో కలిసే ప్రయాణీకులు ఎందరో కానీ ఏదీ ఎప్పుడు ఎవరికి ఎవరూ శాశ్వతం కాదు . కేవలం నీ వ్యక్తిత్వమే శాశ్వతం , నీ నడవడికే శాశ్వతం, ఇందులో గెలిచేది నువ్వే ! ఓడేది కూడా నీవ్వే . మిత్రమా ! గెలుపుకి పొంగిపోకుండా ఓటమికి కృంగి పోకుండా ధర్మ బద్ధంగా ప్రతిఫలాపేక్షలేకుండా తోటి వారికి సాయపడుతూ సాగిపోవడమే జీవితం అదే నీ కర్తవ్యం . 


ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి, మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి , చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి, గెలుపును ఎలా పట్టుకోవాలో తెలిసిన వారికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వారే గొప్ప.


జననం నుంచి మరణం వరకు సాగే పయనంలో మనల్ని కలిసేవారెందరో, నీకోసం నిలిచే వారెందరో వారి కోసం బాధ్యతతో బతకడమే విజయం. నమ్మకం అనేది ఏర్పరచుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు కానీ ! కోల్పోవడానికి ఒక క్షణం చాలు అందుకే నమ్మిన వారిని మోసం చేయకూడదు .


అబద్దాలు చెప్తే ఒకరి మీద నిందలు వేస్తే ఈ క్షణం నీలాంటి పదిమందికి నువ్వు కరెక్ట్ అనిపించవచ్చు కానీ కాలం వ్యతిరేకంగా మారే రోజు వస్తుంది . ఆ రోజు నువ్వు వందలాది మందిలో దోషిగా నిలబడాల్సిందే .


చేసే ప్రతీ పాపం అప్పు లాంటిదే . ఏదో రోజు వడ్డీతో సహా తీర్చాల్సిందే. చేసే ప్రతి పుణ్యం పొదుపు ఖాతాలో వేసినట్టే. ఆపద సమయంలో అదుకుంటుంది, కాస్త ఓర్పు సహనంతో ఉండి చూడు,  జీవితం నీకు చాలా పాఠాలను నేర్పుతుంది.  ఓర్పు ఓటమెరగదు,  సహనంతో సాధ్యం కానిది లేదు ఈ రెండు ఉన్న వాళ్ళు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు ఇదే ఇదే నిజమైన జీవిత సత్యం నేస్తమా ! …


ఎవరు ఎదుటివారి నాశనాన్ని కోరుకుంటారో వారికి కూడా అటువంటి నాశనమే జరుగుతుంది. అందుకే ఒకరికి మంచి చేయాలన్న ఆలోచన కలిగి ఉండాలి . అప్పుడే అందరికి మంచి జరుగుతుంది , అందరు బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి. ఈ రోజుల్లో మనిషి చేపలా ఈదగలుగుతున్నాడు , చిరుతలా పరుగెత్తుతున్నాడు , కానీ ! మనిషిలాగ బ్రతకడమే మరిచిపోతున్నాడు. 


ఇతరులను అర్థం చేసుకున్న వారు జ్ఞాని. తనను తాను అర్థం చేసుకున్నవారు వివేకి, ఎదుటి వారికి చెడుచేయాలని అనుకునే నీ గుణమే సగం సమస్యలకు కారణం. 


పుట్టుక ఎక్కడో చావు ఎక్కడో బ్రతుకు పయనం ఇంకెక్కడికో అయితే పయనించే దారిలో దొరికే స్నేహం, విశ్వాసం, ప్రేమ మాత్రం మనసుకు చాలా దగ్గరవుతుంటాయి, ఆ దగ్గరైన బంధాలు శాశ్వతంగా మన గుండె మూలల్లో తుదిశ్వాస వరకు జ్ఞాపకాల పొరల్లో నిలిచిపోతాయి.

        

ప్రేమ అంటుందట నీకేమైనా జరిగితే నేను బ్రతకను అని  కానీ ! స్నేహం మాత్రం నేను బ్రతికి ఉన్నంత వరకూ నీకేమి జరగనివ్వను అంటూ ఎప్పటికీ నీడలా తోడుంటుంది .


మన సంస్కారం చెప్తుంది కుటుంబం ఎలాంటిదో , మనం మాట్లాడే మాటలు చెప్తాయి స్వభావం ఎలాంటిదో , మనం చూసే చూపు చెప్తుంది ఉద్దేశం ఏమిటో, మనం చేసే వాదన చెప్తుంది  జ్ఞానం ఎంతుందో , మన వినయం చెప్తుంది నేర్పిన విద్య ఎలాంటిదో, నోరు జారిన మాట చేయి జారిన అవకాశం ఎగిరి పోయిన పక్షి గడిచి పోయిన కాలం తిరిగి లభించడం కష్టం.

 

నిన్ను ఇష్టపడే వాళ్ళను వాడుకోవద్దు. నీ అవసరం తీరినాక ఆడుకోవద్దు. మనం ఒకరికి మేలు చేసి ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవద్దు , కానీ! ఒకరు మనకు మేలుచేస్తే మాత్రం ఎప్పుడూ మర్చిపోవద్దు. బంధాన్ని కాపాడు కోవడానికి తల వంచాల్సి వస్తే వంచేయి కానీ ! ప్రతిసారి నువ్వే తల వంచాల్సి వస్తే ఆ బంధాన్ని వదిలివేయి . మనం అన్నీ కోల్పోయినా ఆత్మ విశ్వాసాన్ని కోల్పోకూడదు , అదొక్కటి ఉంటే చాలు మనం కోల్పోయిన వాటన్నింటిని తిరిగి దక్కించుకోవచ్చు. 


రోజుకో రకంగా మన వేషదారణ మారవచ్చు కానీ రోజుకో రకంగా మన మనస్సు మారకూడదు . నా దృష్టిలో డబ్బు కన్నా గొప్ప ఆస్తి ఏదైనా ఉంది అంటే అది బంధుత్వం మాత్రమే , కుటుంబం అయినా ప్రేమ అయినా స్నేహితుడు అయినా మనం నిజాయితీగా కాపాడుకోగలిగితే బంధుత్వం కన్నా గొప్ప ఆస్తి ఏది ఉండదు .


సేకరణ

కామెంట్‌లు లేవు: