19, అక్టోబర్ 2022, బుధవారం

బాధ పడుతుంటే కలిగేది కారుణ్యం

 Ganapathi Tatwamu -- 2 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu


సనాతన ధర్మం లో మీరు ఏ దేవతను పూజ చేయండి,పూజలో చిట్టచివర అడిగేవి మాత్రం రెండే వుంటాయి,మీరు శివ స్వరూపం గా చేయండి, విష్ణు స్వరూపం గా చేయండి, మీరు ఏమి అడుగుతారంటే బుద్ధిని ప్రచోదనం చేయమని అడుగుతారు. "ఏకదంతాయ  విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నః దంతి ప్రచోదయాత్". "తన్నః రుద్ర ప్రచోదయాత్". "తన్నః విష్ణు ప్రచోదయాత్" మీరు ఏ రూపంలో ఈశ్వరుడిని పూజించారో ఆ రూపం అనుగ్రహించవలసినది ఒక్కటే. మా బుద్ధులను ప్రేరేపించుగాక. ఏమిటి బుద్ధి ప్రేరేపించటం? మనస్సు చెప్పిన ప్రతిదానికీ నేను వశుడను కాకుండెదను గాక. నా బుద్ధి బలంగా వుండి అది శాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని నిర్ణయం చేసుకొని అది నా జీవితమును తరింపజేయు గాక." తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యా కార్యం వ్యవస్థితౌ".ఒక కార్యాన్ని ఎలా చేయాలి ఎందుకు చెయ్యలి అన్న దానికి ప్రమాణం నేను చెప్పింది కాదు,మీరు చెప్పింది కాదు, ఎవరు చెప్పింది కాదు,శాస్త్రం చెప్పింది ఒక్కటే. శాస్త్రం మీద మీకు గురి కుదరాలి అంటే గురువాక్యం నందు శ్రద్ధ ఏర్పడటం వినా మార్గం లేదు. అందుకే శంకర భగవత్పాదులు శ్రద్ధ అన్న దానికి వ్యాఖ్యానం చేస్తూ,భాష్యం చేస్తూ ఒక మాట అంటారు,"శాస్త్రస్య,గురువాక్యస్య,సత్యబుధ్యావధారణ. శాస్త్రం,గురువు ఈ రెండు చెప్పినవి ఏవి ఉన్నాయో ,వారిద్దరు చెప్పినవి సత్యం. అది నన్ను ఈ సంసార సాగరము నుండి ఉద్ధరిస్తుంది అన్న విశ్వాసము,పూనిక, దాని మీద నువ్వు గట్టిగా నిలబడ గలిగితే దానికి శ్రద్ధ అని పేరు.ఆ శ్రద్ధ మీకు వుంటే సమస్త ప్రయోజనములు వచ్చేస్తాయి.అసలు అది లేదనుకోండి.మరి ఎందుకు చేస్తున్నావు అని అడిగారనుకోండి? చెయ్యమన్నారండి,చెయ్యకపోతే ఇబ్బంది అన్నారండి,అన్నారనుకోండి.ఇప్పుడు శాస్రాన్ని మీరు పాటిస్తున్నారు, కానీ పరిపూర్ణమైన అవగాహన లేదు.అవగాహన లేని పని ఏది వుందో దానిని కేవలం తంతు అని పిలుస్తుంది శాస్రం. తంతు అంటే కర్మేoద్రియముల స్థాయికి మాత్రమే దిగి నిలబడుతుంది."ఓం నిధనపతయే నమః"అన్నాననుకోండి,ఓ మారేడు దళం వేయి,అప్పుడు నోరు ఏమి అంటుందంటే "ఓం నిధనపతయే నమః"  ఈ చెయ్యి ఏమి అంటుందంటే ఓ మారేడు దళమును అక్కడ వెయ్యి.నిధనపతయే నమః అని మీకు అవగాహనకి వచ్చిందనుకోండి.లేదు షోడశనామ స్తోత్రం చేస్తున్నారు గణపతిమీద."సుముఖశ్చైకదంతస్య  కపిలో గజకర్ణికః , లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిప, ధూమకేతుర్గణాధ్యక్షః  ఫాలచంద్రో  గజాననః , వక్రతుండ శ్శూర్పకర్ణ హేరంభో స్కంధపూర్వజః, షోడసైతాని నామాని యః పఠే చ్రుణయాదపి”, మీరు చదువుతున్నారు. ఏదో ఓ నామం  దగ్గర మీ మనస్సు ఆగిపోయింది. అబ్బ. ఏమి నామం .ఎంత గొప్పది.మహానుభావుడు ఎంత శక్తి మంతుడో కదా. అందుకు కదా ఈ నామం వచ్చింది అని.మీ మనస్సు ప్రీతి పొంది, ప్రీతి పొందగానే తరువాతి నామం స్ఫురణలోకి రాదు. రాకపోతే ఏమి అవుతుందంటే మీకు తెలియదని కాదు,మీకు ధారణలో లేదని కాదు.అక్కడ ప్రీతి ఆవిష్కృతమై పోయింది. ఆవిష్కృతమవటంలో ఏమవుతుందంటే "సుముఖశ్చైకదంతస్య కపిలో గజకర్ణికః , లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిప,ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో" అబ్బ ఏమి నామం, ఏమి నామం  శమంతకోపాఖ్యానం అంతా అక్కడే కదా వుంది, గజాననః రాదు ఇంక , ఫాలచంద్రో, ఫాలచంద్రో  అంటూ  ఉంటారు.  అసలు  శాస్త్రం  అంది, ఎవడికి నామం దగ్గర ఆగిపోయిందో వాడు పూజ చేశాడు.ఎందుకంటే ఇప్పుడు మనస్సు నిలబడింది.  మనస్సు నిలబడి ఆ మనస్సు చెందిన ప్రీతి చేత కర్మేద్రియములు పూజ యందు అన్వయమైతే  దానికి  పూజ అని పేరు.తప్ప అసలు మనస్సు అక్కడ లేదు.మనస్సు అక్కడ ఉండటానికి కారణమేమిటి. మీకు, ఆ మూర్తికి  మధ్య వున్న అనుబంధమేమిటో  మీకు  తెలియాలి. తెలిస్తే మీకు ఒక ప్రీతి ఉంటుంది.వీడు నా కొడుకు, నా కొడుకు కనబడగానే నాలో ప్రీతి కలుగుతుంది.ఎందుకు? మా ఇద్దరి మధ్య వున్న అనుబంధమేమిటో  తెలుసు. వాడు మూడో నెలలోనో, ఆరో నెలలోనో వుండగానే ఎవరో పట్టుకు పోయారనుకోండి. వాడికి పాతిక ఏండ్లు వచ్చాయి. వాడు వచ్చి నా ఎదురుగా కూర్చున్నాడు.నాకేమన్నా ప్రీతి కలుగుతుందా? వాడు నా కొడుకని నాకు తెలిస్తే కదూ?ఎవరో వచ్చి వాడు మీ కొడుకే నండీ,మూడో నెలలో పట్టుకుపోయామని చెప్పారనుకోండీ,అప్పుడు,నాన్నా!అని వెళ్ళి కౌగలించుకొంటాను.ప్రీతి పొంగింది.ప్రీతి పొందటానికి హేతువు అనుబంధం. ఈ అనుబంధం మీకు,ఈశ్వరునికి వుందని మీరు గ్రహిస్తే కదూ అసలు,ఆ అనుబంధం మీకు,ఈశ్వరునికి వుందని గ్రహింపుకి వచ్చారనుకోండి, మీరు పొంగిపోతారు, ఆయన పొంగిపోతాడు, చంద్రుని చూసి సముద్రం పొంగినట్లు. సముద్రుడిని చూసి చంద్రుడు పొంగినట్లు. ఉభయులు పొంగిపోతారు. కాబట్టి ప్రీతి ఆవిష్కృతం కావాలి.ప్రీతి ఆవిష్కృతమగు  మాటనే  భక్తి అని  పిలుస్తారు. ఆ ప్రీతి  కేవలం  భావన అని  మీరు గుర్తు పెట్టుకోవాలి. ప్రేమ యొక్క మరొక పేరే భక్తి. ఎందుకంటే  భక్తి అన్న మాట  ప్రేమ యొక్క మరొక పేరు. ప్రేమలో  ప్రతిఫలాన్వేషణ వుండదు.ప్రతిఫలాన్వేషణ వున్నదో అది కామం. అది ప్రేమ కాదు.శిష్యుల యెడ వుండేది వాత్సల్యం.ఎవరైనా బాధ పడుతుంటే కలిగేది కారుణ్యం.

కామెంట్‌లు లేవు: