19, అక్టోబర్ 2022, బుధవారం

మనసు పరమాత్మయందు నిలపాలి.

 ధ్యానంలో కూర్చున్న వాడి మనసు ప్రశాంతంగా ఉండాలి. ఎటువంటి భయము, భీతి, ఆందోళన ఉండకూడదు. మనసును బ్రహ్మయందు అంటే పరమాత్మయందు నిలపాలి. 


అలా చేయాలంటే మనసును సంయమింప చేయాలి. నిలకడగా ఉంచాలి. పరమాత్మను తప్ప వేరే ఏ విషయాన్ని గురించి ఆలోచించకూడదు. ఈ ధ్యానం అంతా నాకు పరమగతి కలగడం కోసమే చేస్తున్నాను అనే ధృఢమైన నమ్మకంతో, విశ్వాసంతో చేయాలి.


ప్రశాంతాత్మా అంటే మనసును, చిత్తాన్ని ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఎటువంటి ఆలోచనలు ఆందోళనలు ఉండకూడదు. చాలా ప్రశాంతంగా ఉండాలి. అంటే మనము ధ్యానంలో కూర్చోగానే ఇదివరకు చూచినవి, విన్నవి, తాకినవి, జరిగినవి విషయాలు అన్నీ గుర్తుకు వస్తాయి. 


ఎక్కడెక్కడో ఎప్పుడో జరిగిన విషయాలు అన్నీ అప్పుడే గుర్తుకొస్తాయి. వాటి వలన బాధ, భయము, సంతోషము కలుగుతాయి. అటువంటి గతకాలపు ఆలోచనలు మనసులోకి రాకుండా అరి కట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి.


విగతభీ అంటే భయం ఉండకూడదు. గతించిన విషయాలు గుర్తుకొస్తాయి అన్ని పైన చెప్పుకున్నాము కదా. అలాగే రాబోయే విషయాల గురించి, జరగబోయే విషయాల గురించి కూడా ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనల వల్ల భయం కూడా కలిగే అవకాశం ఉంది. 


అంతేకాదు, ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో, ఏమన్నా అంటారేమో అన్న భయం ఉంటుంది. దేనికీ భయపడకూడదు. మనసులో గుబులు ఉండకూడదు. ఈ టైములో ఆ పని చేద్దామనుకున్నాను. కాని చేయలేకపోయాను. ఇక్కడ కూర్చున్నాను. అక్కడ నేను లేకపోతే ఏం జరుగుతుందో ఏమో అనే చింత విడిచిపెట్టాలి. 


బయట ఏం జరిగినా నిశ్చలంగా ఉండాలి. అన్నీ భగవంతునికి అర్పించి మనసును నిర్మలంగా నిశ్చలంగా ఉంచుకోవాలి. ఇది కష్టమే అయినా అభ్యాసంతో సులభమే అవుతుంది.


తరువాతది బ్రహ్మచర్యం పాటించాలి. అంటే మనసు కామ వాంఛల వైపు వెళ్లకూడదు. స్త్రీసంబంధమైన ఆలోచనలు రాకూడదు. స్త్రీలు ధ్యానంలో కూర్చుంటే పురుష సంబంధమైన ఆలోచనలు రాకూడదు. అటువంటి సంకల్పాలు కూడా రాకూడదు. అసలు సాంసారిక సంబంధమైన ఆలోచనలే మనసులోకి రానీయకూడదు. 


ఇది అందరూ ఆచరించవలసిన విషయం. బ్రహ్మచర్యం అంటే కేవలం శరీరమే కాదు, మనసులో కూడా అటువంటి ఆలోచనలు

రాకూడదు. మాటలు కూడా అటువంటి మాటలు మాట్లాడకూడదు. అప్పుడే మనసు పరిశుద్ధంగా ఉంటుంది. ఇది బ్రహ్మచర్యమునకు మనం లౌకికంగా చెప్పుకునే అర్ధం.


🙏 కృష్ణం వందే జగద్గురూమ్ 🙏

కామెంట్‌లు లేవు: