19, అక్టోబర్ 2022, బుధవారం

Srimadhandhra Bhagavatham

 Srimadhandhra Bhagavatham -- 28 by Pujya Guruvulu "Pravachana Chakravarthy" , "Vachaspathy" Brahmasri Chaganti Koteswara Rao Garu


జయవిజయులకు సనకసనందనాదుల శాపము.


శ్రీ మహావిష్ణువు దగ్గర జయ విజయులని ఇద్దరు పార్షదులు ఉన్నారు. వైకుంఠములో వారిద్దరూ ద్వారం దగ్గర నిలబడతారు. వైకుంఠమునకు ఏడు ద్వారములు ఉంటాయి. ఏడవద్వారం దాటి లోపలి వెళితే స్వామి దర్శనము అవుతుంది. జయవిజయులు ఏడవద్వారమునకు అటూ ఇటూ నిలబడి ఉన్నారు. సనకసనందనాదులు స్వామి దర్శనార్ధమై అక్కడికి వచ్చారు. వాళ్ళు మహా జ్ఞానులు. నిరంతరము భగవంతుని పాదములయందు భక్తితో ఉండే స్వరూపము ఉన్నవారు. వారు ఏడవద్వారం దగ్గరకు వెళ్ళి నిలబడ్డారు. జయవిజయులు వారిని ‘లోపలికి వెళ్ళడానికి వీలు లేదు’ అని అడ్డుపెట్టారు.


సనకసనందనాదులు ‘ఇది వైకుంఠము. ఇక్కడ మాత్సర్యము ఉండదు. ఇక్కడ ఎవరికీ కూడా ఒకరి మీద ఒకరికి మత్సరము ఉండదు. లోపలికి వెళ్ళి ఈశ్వరుని దర్శించుకునేందుకు అభ్యంతరము ఎందుకు? మమ్మల్ని ఎందుకు ఆపినట్లు? లోపల ఉన్న స్వామి భక్త పరాధీనుడు. భక్తులయిన వారు వస్తే చాలు ఆయనే ఆర్తితో ఎదురువచ్చే స్వభావము ఉన్నవాడు. ఆయన లోపల ఉంటే వెళ్ళడానికి మేము వస్తే మా హృదయములో ఆయనను దర్శనము చేయాలన్న కాంక్ష తప్ప వేరొకటి లేకుండా ఉంటే మధ్యలో అడ్డుపెట్టడము మీకు మించిన స్వాతంత్ర్యము. ఏది ఎక్కడ ఉండకూడదో దానిని మీరు చూడడము మొదలు పెట్టారు. అది ఎక్కడ పుష్కలముగా దొరుకుతుందో ఆ భూలోకమునకు పొండి’ అన్నారు. అనేటప్పటికి జయవిజయులిద్దరూ సనకసనందనాదుల కాళ్ళ మీద పడి పెద్ద ఏడుపు మొదలు పెట్టారు.


శ్రీమన్నారాయణుడు బయటకు వచ్చాడు. ఆయన శరీరము మీద నల్లని పుట్టుమచ్చ ఒకటి ఉంటుంది. ఆ పుట్టుమచ్చను శ్రీవత్సము అని పిలుస్తారు. ఆ పుట్టుమచ్చను చూసి, ఆయన స్వరూపమును చూసి సనక సనందనాదులు పొంగిపోయారు. ‘మా అదృష్టం పండి ఇంతకాలం తర్వాత నీ స్వరూపమును దర్శనం చేయగలిగాము. మా భాగ్యం పండింది’ అని ఆయన పాదముల మీద పడి నమస్కారం చేసి ‘పుష్పములోకి మకరందము కోసము గండుతుమ్మెద ఎలా చేరుతుందో నిరంతరము నీ పాదములయందు అటువంటి భక్తి మాకు ప్రసాదించవలసింది’ అని ప్రార్థించారు.

శ్రీమన్నారాయణుడు – ‘మీ స్తోత్రమునకు నేను చాలా సంతోషించాను. ఇక్కడ ఏదో చిన్న అల్లరి జరిగినట్లు నాకు అనిపించింది. ఏమయింది?’ అని అడిగితే – ‘స్వామీ మేము తప్పే చేశామో! ఒప్పే చేశామో! మాకు తెలియదు. కానీ మేము లోపలకి వస్తున్నప్పుడు ఏడవద్వారం దగ్గర ఈ పార్షదులు మమ్ములను అడ్డుపెట్టారు. మత్సరములు ఉండడానికి అవకాశం లేని వైకుంఠమునందు నీ దర్శనమునకు మమ్మల్ని పంపలేదు, వారు మాయందు విముఖులయి ఉన్న వారిని భూలోకమునందు జన్మించమని శపించాము. నీవు ఎలా చెపితే అలా ప్రవర్తిస్తాము. ఒకవేళ మావలన అపరాధము అంటే మన్నించవలసినది’ అన్నారు.


శ్రీహరి – ‘నా పాదములు మీవంటి బ్రహ్మజ్ఞానులు నమ్మి అర్చించిన పాదములు. ఇంతమంది చేత ఆరాధింపబడుతున్నాయి. మీవంటి వారిచేత పూజించబడి మిమ్మల్ని రక్షించుటకు పూనికతో తిరిగి మీకు దర్శనం ఇస్తాను. నిత్యాపాయినియై నిరంతరము లక్ష్మి నావెంట వస్తోంది. నేను భక్త పరాధీనుడను. భక్తులయిన వారు పిలిస్తే పరుగెత్తుకు వెళ్ళడం నా ధర్మం. ఒకవేళ అలా పరుగెత్తుకు వెళ్ళి వాళ్ళని రక్షించడములో అడ్డువస్తే నా చేతిని నేను నరికేస్తాను’ అని ఎంతో పెద్దమాట అన్నాడు ! ఆ చేయి లోకములనన్నిటిని రక్షించే చేయి. మీరు నిరంతరము నన్ను తప్ప వేరొకరిని కొలవని వారు, ఎప్పుడూ నా పాదముల యందు మనస్సు పెట్టుకున్నవారు, చతుర్ముఖ బ్రహ్మ అంతటివారు సంసారమునందు ప్రవర్తించి సృష్టి చేయమంటే చేయకుండా కేవలము నా పాదపంజరము నందు భక్తితో నిలబడిన మిమ్ములను జ్జయ విజయులు అడ్డుపెట్టి మహాపచారం చేశారు. వీళ్ళు చేసిన అపచారం వలన నా కీర్తి నశిస్తుంది.’ ఇక్కడ శ్రీ మహావిష్ణువు ఒక అద్భుతమయిన విషయమును ప్రతిపాదన చేశారు.


‘నేను ఎందుకు మీరు ఇచ్చిన శాపమును అంగీకరిస్తున్నానో తెలుసా! వీరికి యుక్తాయుక్త విచక్షణ లేదు. వీళ్ళకి ఈ అధికారం నేను ఇచ్చాను. ఏడవ ప్రాకార ద్వారము వద్ద ఉండి వచ్చిన వాళ్ళని లోపలి పంపించండని చెప్పాను. లోపలికి ఎవరు వెళ్ళాలి, ఎవరిని తొందరగా ప్రవేశపెట్టాలని అంతరము తెలుసుకొని ముందు వాళ్ళకి నమస్కారం చేసి, లోపలి ప్రవేశ పెట్టగలిగిన సంస్కారం ఉన్నవాడు అక్కడ ఉండాలి. వీళ్ళు అలా ఉండలేదు. పరమ భాగవతులయిన వారికి కలిగిన మనఃక్లేశము పట్టి కుడిపేస్తుంది. మీలాంటి వారిని కాపాడడానికి నేను లోపల ఉన్నాను. మీరు నావద్దకు రాకుండా వీళ్ళు అడ్డుపడ్డారు. తన శరీరమునందు పుట్టిన కుష్ఠు తనని పాడు చేసినట్లు నేను వీళ్ళకి పదవి ఇస్తే ఆ పదవిని అడ్డు పెట్టుకుని ఈ జయవిజయులు నాకే తప్పు పేరు తీసుకుని వస్తున్నారు. మీవంటి వారికే వైకుంఠమునందు ప్రవేశము నిరాకరింపబడితే భక్త కోటి నన్ను ఎలా విశ్వసిస్తుంది? లోకము పాడయిపోతుంది. నేను భక్త పరాధీనుడను. నాకు దుష్ట పేరు తెచ్చారు. వాళ్ళను మీరు శపించడం కాదు నేను చెపుతున్నాను.’

‘వీళ్ళు ఉత్తర క్షణం భూలోకమునకు వెళ్ళి రాక్షసయోనియందు జన్మించి ఉగ్రమయిన రాక్షసులై అపారమయిన లోభత్వమును పొందుతారు’ అన్నాడు.


జయవిజయులిద్దరు శ్రీమన్నారాయణుడి పాదముల మీద పడి ‘స్వామీ! లోపల ఉన్నవాడి హృదయమును అర్థం చేసుకోవడములో పొరపాటు జరిగింది. మమ్ములను క్షమించు. మళ్ళీ మాకు ఎప్పుడు వైకుంఠమునకు ఆగమనం’ అని అడిగారు. స్వామి ‘మీరు మూడుజన్మలు గొప్ప రాక్షసులు అవుతారు. మిమ్మల్ని దునుమాడవలసిన అవసరం కూడా నాదే. నేనే మీ కోసం అవతారం స్వీకరించి వచ్చి మిమ్మల్ని నిర్మూలించి తెచ్చి నా వాళ్ళుగా చేసుకుంటాను’ అని ప్రతిజ్ఞ చేశాడు. అందులో కూడా రక్షణ!


04. యజ్ఞ వరాహ మూర్తి


వారిలో ఒకడయిన హిరణ్యాక్షుడు పశ్చిమ సముద్రము అడుగున ఉన్న వరుణుడిని యుద్ధమునకు రమ్మనమని పిలుస్తున్నాడు. ఆ సమయమునకే యజ్ఞవరాహమూర్తి జన్మించాడు. వరుణుడు– ‘సముద్ర జలముల మీదకు ఒక కొత్త భూతం వచ్చింది. నీవు దానితో యుద్ధం చెయ్యి’ అన్నాడు. అప్పటికి యజ్ఞవరాహమూర్తి వచ్చారు. సాధారణముగా యజ్ఞవరాహ మూర్తిని ఎక్కడయినా ఏదయినా ఫోటో చూసినప్పుడు ఒక పంది స్వరూపమును వేసి దాని మూపు మీద రెండుకోరల మధ్య భూమిని ఎత్తుతున్నట్లుగా వేస్తారు. పరమాత్మ అలా ఉండడు. యజ్ఞవరాహ మూర్తి వర్ణన విన్నా, ఆవిర్భావమును గూర్చి విన్నా, చదివినా, ఉత్తర క్షణంలో కొన్ని కోట్ల జన్మల పాపము దగ్ధమయిపోయి కృష్ణభక్తి కలుగుతుంది. అటువంటి స్వరూపముతో ఆయన దర్శనం ఇచ్చి పెద్ద హుంకారం చేశాడు. ఆ హుంకారం విని ఋషులు ఒక్కసారి ఆశ్చర్యపోయారు. ఎక్కడిది ఆ హుంకారం? అనుకుని స్వామి వంక చూశారు. ఆయన గుర్ గుర్ అని శబ్దం చేస్తున్నాడు. వ్యాసులవారు అలాగే వర్ణించారు. పెద్ద శబ్దం చేస్తూ అడుగు తీసి అడుగు వేస్తూ నడుస్తోంది ఆ యజ్ఞవరాహం. ఆయననను స్తోత్రం చేయాలి. ఋషులందరూ నిలబడి ఋగ్వేదములోంచి, యజుర్వేదము లోంచి, సామవేదంలోంచి సూక్తములను వల్లిస్తూ యజ్ఞవరాహమునకు నమస్కారం చేస్తున్నారు.

యజ్ఞవరాహం సముద్రములోకి ప్రవేశించి తన నాసికతో, మూపుతో సముద్ర అడుగు భాగమును కెలకడము ప్రారంభించింది. ముఖం అంతా నీటితో నిండిపోతోంది. యజ్ఞంలో వాడే నెయ్యి ఆయన కన్ను. ఒక్కసారి తన ముఖమును పైకెత్తి కనురెప్పలను ఒకసారి చిట్లించి మెడను అటూ ఇటూ విసురుతోంది.


విసిరినప్పుడు జూలులోంచి నీళ్ళు లేచి పడుతున్నాయి. మహర్షులు, చతుర్ముఖ బ్రహ్మ అందరూ వెళ్ళి ఆయననుండి పడిన నీటికోసమని దానిక్రింద తలపెట్టారు. ఈ కంటితో చూడరాని పరమాత్మ ఇవ్వాళ యజ్ఞవరాహముగా వచ్చి నీటితో తడుస్తున్నారు. ఆయన వెతికి భూమిని పట్టుకుని దానిని మూపు మీదకు ఎత్తుకుని రెండు దంష్ట్రల మధ్య ఇరికించి, పైకి ఎత్తి చూపించారు. అలా చూపించేసరికి దానిని చూసి ఋషులందరూ స్తోత్రం చేశారు.


https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage


instagram.com/pravachana_chakravarthy

 Srimadhandhra Bhagavatham -- 27 by Pujya Guruvulu "Pravachana Chakravarthy" , "Vachaspathy" Brahmasri Chaganti Koteswara Rao Garu


భాగవతం – తృతీయ స్కంధము


కశ్యప ప్రజాపతికి పదమూడుమంది భార్యలు. ఆయన తన భార్యలతో ధర్మ బద్ధమయిన జీవితం కొనసాగిస్తున్నాడు. ఒకరోజు సాయంకాలం అగ్నికార్యం చేసుకుంటున్నాడు. అసుర సంధ్యాసమయం ప్రారంభం అయింది. మహానుభావుడు సాక్షాత్తుగా రాశీ భూతమయిన తపశ్శక్తి. ఆయన దగ్గరికి ‘దితి’ వచ్చి – 'నామీద మన్మథుడు బాణ ప్రయోగం చేశాడు. ఆ బాణ ప్రయోగపు తాకిడికి తట్టుకోలేక నిలువెల్లా కదిలిపోతున్నాను. నీవు నా భర్తవి. నన్ను అనుగ్రహించి నాలో కలిగిన ఈ కామావేశమునకు ఉపశాంతిని కలిగించు’ అని చెపుతూ ఆవిడ ‘నేను ఇలా అడగడం వెనకాల ఒక రహస్యం ఉన్నది’ అంది. కశ్యపుడు ‘అదేమిటో చెప్పమ' ని అడిగాడు.

ఆవిడ ‘నీకు పదముగ్గురు భార్యలు ఉన్నారు. మేమందరం ఏకగర్భ సంజాతులము అయిన మమ్ములను ప్రజాపతి నీకిచ్చి వివాహం చేశాడు. అందులో పన్నెండుమందికి సంతానం కలిగారు. ఇంకా నాకు సంతానం కలుగలేదు. సాధారణముగా భార్యాభర్తల అనుబంధంలో ఒక గొప్ప సిద్ధాంతం ఉన్నది. ‘ఆత్మావై పుత్రనామాసి’ – భర్త భార్యకు అపురూపముగా ఇచ్చే కానుక తానే తన భార్య కడుపున మళ్ళా ఉదయిస్తాడు. ధర్మపత్ని విషయంలో అది ధర్మం. ఒక దీపమును పట్టుకు వెళ్ళి ఇంకొక దీపమును వెలిగిస్తాము. రెండు జ్యోతులు వెలుగుతున్నట్లు కనపడుతుంది. కానీ వత్తులు పొడుగు పొట్టి ఉండవచ్చు. ప్రమిదల రంగులలో తేడా ఉండవచ్చు. దీపశిఖ మాత్రం సమాన ధర్మమును కలిగి ఉంటుంది. దీపం చివర వెలుగుతున్న జ్యోతి మాత్రం ఒకటే. రెండు దీపముల జ్యోతికి తేడా ఉండదు. తండ్రికి, కుమారుడికీ భేదం లేకపోయినా రెండుగా కనపడేటట్లు చేయగలిగిన శక్తి ఈ ప్రపంచంలో ధర్మపత్ని ఒక్కతే. ఆవిడ మాత్రమే ఈ అధికారమును పొంది ఉంటుంది. ఆయన తేజస్సును తాను గ్రహించి తన భర్తను కొడుకుగా ప్రపంచమునందు నడిచేటట్లు చేయగలదు. నీ తేజస్సును నాయందు ప్రవేశపెట్టమని అడుగుతున్నాను. ధర్మమునకు లోపము లేదు. నాకు సంతానమును కటాక్షించు’ అంది. ఆవిడ ఎంతో ధర్మబద్ధముగా అడిగింది. ఆయన – ‘దితీ! నీవంటి భార్య దొరకడం నాకు చాలా సంతోషం. ఒక్కమాట చెపుతాను విను. ఇది ఉగ్రవేళ అసురసంధ్యా కాలములో పరమశివుడు వృషభవాహనమును అధిరోహించి భూమండలం మీద తిరుగుతాడు. ఆయన వెనక భూత గణములు వెడుతూ ఉంటాయి. వాళ్ళు చాలా ఉగ్రమూర్తులై ఉంటారు. వాళ్లకి ఆ సమయములో శివుడి పట్ల ఎవరయినా అపచారముగా ప్రవర్తిస్తే శంకరుడు ఊరుకోవచ్చునేమో, ఆయన చుట్టూ ఉన్న గణములు అంగీకరించవు. చాలా తీవ్రమయిన ఫలితమును ఇచ్చేస్తారు. కొంతసేపు తాళవలసినది. ఒక్క ముహూర్త కాలము వేచి ఉండు. నీకు కలిగిన కోరికను భర్తగా నేను తీరుస్తాను’ అన్నాడు.

దితికి అటువంటి బుద్ధి కలిగింది. భాగవతంలో ధర్మ భ్రష్టత్వము ఎక్కడ వస్తుందో గమనించాలి. ఆవిడ ఒక వెలయాలు ప్రవర్తించినట్లు కశ్యప ప్రజాపతి పంచెపట్టి లాగింది. ఆయన ఈశ్వరునికి నమస్కారం చేసి, తాను ధర్మపత్ని పట్ల ఇంతకన్నా వేరుగా ప్రవర్తించకూడదు అనుకుని, ఆవిడ కోరుకున్న సుఖమును ఆవిడకు కటాక్షించి స్నానం ఆచమనం చేసి తన కార్యమునందు నిమగ్నుడయిపోయాడు.

కొంతసేపు అయిపోయిన తరువాత దితికి అనుమానం వచ్చింది. చేయరాని పని చేశాను. దీని ఫలితము ఉగ్రముగా ఉంటుందేమోనని పరమశివుడికి, రుద్ర గణములకు క్షమాపణ చెప్పింది. అప్పటికి జరగవలసిన అపకారం జరిగిపోయింది. దితి చేసిన అకార్యమును భూత గణములలో భద్రాభద్రులు అనే వారు చూసి ఉగ్రమయిన ఫలితమును ఇచ్చేశారు.

పిమ్మట దితి కశ్యప ప్రజాపతి దగ్గరకు వెళ్ళి ‘నా కడుపున పుట్టే బిడ్డలు ప్రమాదము తీసుకురారు కదా’ అని అడిగింది. కశ్యప ప్రజాపతి ‘నేను వద్దని చెప్పాను. నీవు వినలేదు. నీ కడుపున పుట్టబోయే ఇద్దరు బిడ్డలు కూడా లోకకంటకులు అవుతారు. వాళ్ళు పుట్టగానే ఆకాశం నెత్తురు వర్షిస్తుంది. నక్కలు కూస్తాయి. వాళ్ళు కొన్నివేల స్త్రీల కళ్ళమ్మట నీళ్ళు కార్పిస్తారు. ఋషులను, బాలురను, బ్రాహ్మణులను, బ్రహ్మచారులను, వేదములను, దేవతలను అవమాన పరుస్తారు. చిట్టచివరికి వాళ్ళు శ్రీహరి చేతిలో అంతమును పొందుతారు’ అని చెప్పాడు.

ఈ మాటలను విని దితి బావురుమని ఏడ్చింది. ‘చివరకు నాకు ఇంత అపఖ్యాతా? దీనికి నీవారణోపాయం లేదా’ అని అడిగింది. కశ్యపప్రజాపతి ‘దీనికి పశ్చాత్తాపమే నివారణోపాయం. నీవు చాలా పశ్చాత్తాపం పడుతున్నావు. నీవు చేసిన దోషం పోదు. కానీ నీవు మహా భక్తుడయిన మనవడిని పొందుతావు. హిరణ్యాక్ష హిరణ్యకశిపులలో ఒకనికి మహాభక్తుడయిన కుమారుడు పుడతాడు. నీ పశ్చాత్తాపము వలన ఒక మహాపురుషుడు, ఒక మహాభక్తుడు జన్మిస్తాడు. మనవడు అటువంటి వాడు పుడతాడు. కానీ అసురసంధ్య వేళలో నీవు చేసిన దుష్కృత్యము వలన కొడుకులు మాత్రం దుర్మార్గులు పుట్టి శ్రీహరిచేతిలో మరణిస్తారు’ అని చెప్పాడు.

భాగవతం కాలస్వరూపం ఎలా ఉంటుందో, ప్రమాదములు ఎక్కడ నుండి వస్తాయో బోధ చేస్తుంది. దితి మహా పతివ్రత. ఆమె అసలు పిల్లలను కనడము మానివేసి కడుపులోనే ఉంచేసింది. వాళ్ళు బయటకు వస్తే చంపేస్తారేమోనని నూరు సంవత్సరములు గర్భమునందు ఉంచేసింది. ఆ గర్భమునుంచి తేజస్సు బయలుదేరి లోకములను కప్పేస్తోంది. అందరూ వెళ్ళి మొరపెట్టుకున్నారు. దితి గర్భము నుండి వస్తున్న తేజస్సు లోకములను ఆక్రమిస్తోంది. ఆవిడ బిడ్డలను కనేటట్టు చూడమని కశ్యప ప్రజాపతిని ప్రార్థించారు. కశ్యపప్రజాపతి దితితో – ‘నీవు చేస్తున్న పని సృష్టి విరుద్ధం. నీ బిడ్డలను కనవలసింది’ అని చెప్పాడు. దితికి హిరణ్యాక్ష హిరణ్యకశిపులు జన్మించారు.

ఆ పుట్టేవాళ్ళు ఎలా ఉంటారో కశ్యపప్రజాపతికి ముందరే తెలుసు. వాళ్లకి ఆ పేర్లు కశ్యప ప్రజాపతే పెట్టారు. ‘హిరణ్య’ ముందు పెట్టి ఒకనికి ‘అక్షి’, రెండవ వానికి ‘కశ్యప’ అని చేర్చి, ఒకనికి ‘హిరణ్యాక్షుడు’, రెండవ వానికి ‘హిరణ్యకశిపుడు’ అని పేర్లు పెట్టారు. ఒకడు కనబడ్డదానినల్లా తీసుకువెళ్ళి దాచేస్తాడు. ఒకడికి ఎంతసేపూ తానే గొప్పవాడినని, తానే భోగం అనుభవించాలని భావిస్తూ చివరకు యజ్ఞములు, యాగములు కూడా తనపేరు మీదనే చేయించుకుంటాడు. ఇద్దరూ అహంకార మమకారములే! ఈవిధముగా హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు ఇద్దరు దితి గర్భమునుండి జన్మించారు.

హిరణ్యాక్షుడు పుట్టీ పుట్టడం తోటే దుర్నిమిత్తములు అన్నీ కనబడ్డాయి. వాడు ఆకాశమంత ఎత్తు పెరిగిపోయాడు. వాడికి పుట్టినప్పటి నుంచి యుద్ధం చేయాలనే కోరికే! యుద్ధం కోసం అనేకమంది దగ్గరకు వెళ్ళాడు. చిట్టచివర సముద్రము లోపల ఉన్న వరుణుడి దగ్గరకి వెళ్ళాడు. వెళ్ళి 'నీవు ఎక్కడో సముద్రములో ఉంటావు. నా భుజముల తీట తీరాలి. నువ్వు వచ్చి నాతో యుద్ధం చెయ్యి’ అన్నాడు. వరుణుడు ‘నాకు నీతో యుద్ధం ఎందుకు? నీకోసం వచ్చేవాడు ఒకాయన ఉన్నాడు. నీవు ఎవరి చేతిలో చావాలని నిర్ణయం అయిందో వాడు వచ్చే సమయం అయిపోయింది. నీవు ఒక పర్యాయం సముద్రము మీదకు వెళ్ళు. ఆయన కనపడతాడు. ఆయనతో యుద్ధం చెయ్యి’ అన్నాడు. ఈ విషయం వరుణుడు ఎలా చెప్పగలిగాడు? అంటే దీనికి వెనుక ఇంకొక ఆఖ్యానం కలుస్తుంది. భద్రాభద్రులు అనే రుద్ర గణములు చూసి దితి యందు ఉగ్రమయిన బిడ్డలు పుట్టాలని ఎప్పుడయితే నిర్ణయం జరిగినప్పుడు ఒక సంఘటన జరిగింది. పురాణము అంతా శివ కేశవుల అభేదముగా నడుస్తుంది.


https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage


instagram.com/pravachana_chakravarthy

 Srimadhandhra Bhagavatham -- 30 by Pujya Guruvulu "Pravachana Chakravarthy" , "Vachaspathy" Brahmasri Chaganti Koteswara Rao Garu


దేవహూతి కర్దమ ప్రజాపతిని సేవిస్తోంది. ఆయన తపస్సు చేస్తున్నాడు. నియమములు పాటిస్తున్నాడు. భర్త ఏమి చేస్తున్నాడో భార్య కూడా అదే చేస్తోంది. ఆయనకు బాహ్యస్మృతి లేదు. ఒకప్పుడు దేవహూతి చూడడానికి ఎంతో అందముగా ఉండేది. ఇప్పుడు శుష్కించి పోయింది. ఆమె పార్వతీదేవి పరమశివుని సేవించినట్లు కర్దముని సేవించింది. కొంతకాలానికి ఒకరోజు కర్దముడు తపస్సులోంచి ఎందుకో ఒకసారి దేవహూతి వంక చూసి ఆశ్చర్యపోయాడు. నేను ఒకనాడు ఈమె సౌందర్యమును వర్ణన చేసాను. నాకోసం తపించడములో, పరిశ్రమించడములో ఇన్ని ఏర్పాట్లు చేయడములో ఈవిడ ఇలా అయిపోయింది’ అనుకుని దేవహూతీ! నీ సేవలకి నేను సంతోషించాను. నీకు నావలన తీరవలసిన కోరిక ఏమిటి? అని అడిగాడు.

ఒక సౌశీల్యవంతురాలయిన స్త్రీ భర్తవలన తాను సంతానవతియై తల్లి కావాలని కోరుకుంటుంది. ఆవిడ ‘ఈశ్వరా! మీరు నాకు పతిదేవులు. మీరు నన్ను కరుణించి నేను తల్లినయ్యే అదృష్టమును నాకు కటాక్షించండి’ అని కోరితే ఆయన ‘తప్పకుండా కటాక్షిస్తాను’ అని ఒక అందమైన మాట చెప్పాడు. ‘నీకు నేను చూడడానికి ఇలా ఒక ఆశ్రమములో జటలు కట్టుకుని, ఉరఃపంజరము పైకి వచ్చేసి ఒక నారపంచె కట్టుకుని ఎప్పుడూ దండకమండలములు పట్టుకుని చాలా వెర్రివాడిలా, తపస్సు చేసుకుంటున్న వాడిలా ఏ భోగ భాగ్యములు లేని వాడిలా, ఇంకా చెప్పాలంటే ఎప్పుడూ భూశయనం చేసే వాడిలా కనపడుతున్నాను కదా! నాకు ఉన్న భోగములు ఎటువంటివో తెలుసా? ఈ భూమియందు సార్వభౌములమని సమస్త భూమండలమును ఏలగలమన్న చక్రవర్తులకు కూడా లేని భోగములు నాకున్నాయి.

నేను నిరంతరము శ్రీమన్నారాయణుని సేవించాను. అపారమయిన భక్తితో యోగమును అవలంబించాను. గొప్ప తపస్సు చేశాను. ఈశ్వరానుగ్రహముగా యోగశక్తి చేత కల్పింపబడవలసిన భోగోపకరణములు ఉన్నాయి. అవి సామాన్యులకు దొరికేవి కావు. వాటిని నేను నా తపశ్శక్తితో సృజిస్తున్నాను. ఇతరులకు కనపడవు. వాటిని చూడడానికి వీలయిన దివ్యదృష్టిని నీకు ఇస్తున్నాను. భోగోపకరణములను చూడవలసినది’ అని దివ్యదృష్టిని ఇచ్చాడు.

ఒక పెద్ద భవనము వచ్చింది. ఆ భవనములో గొప్ప గొప్ప శయ్యా మందిరములు ఉన్నాయి. ఆ శయ్యా మందిరములకు ఏనుగుల దంతములతో చేయబడిన కోళ్ళు, కట్టుకోవడానికి వీలుగా వ్రేలాడుతున్న చీనీ చీనాంబరములు – బంగారము, వెండితో చేయబడిన స్తంభములు, వజ్ర వైఢూర్య మరకత మాణిక్యములు వాటికి తాపడము చేయబడ్డాయి. లోపల శయనాగారములు, బయట విశాలమయిన ప్రాంగణములు.

వీటన్నింటినీ చూసి ఆమె తెల్లబోయి నిలబడిపోయింది. ఈ స్థితిలో వున్న దేవహూతికి ఉత్తరక్షణములో ఇవన్నీ కనబడ్డాయి. కర్దమప్రజాపతి ‘దేవహూతీ! అదిగో బిందు సరోవరము. అందులో దిగి స్నానం చేసి బయటకు రా’ అన్నాడు. వచ్చేసరికి ఇంతకు పూర్వం దేవహూతి ఎంత సౌందర్యముగా ఉండేదో దానికి పదివేల రెట్లు అధిక సౌందర్యమును పొందింది. అక్కడ ఒక వేయిమంది దివ్యకాంతలు కనపడ్డారు. వాళ్ళు ఆమెకు పట్టు పుట్టములు కట్టి, అంగరాగముల నలది ఆమె చక్కటి కేశపాశమును ముడివేసి అందులో రకరకములయిన పువ్వులు పెట్టి ఒక నిలువు అద్దం పట్టుకువచ్చి ఆవిడ ముందుపెట్టి సోయగమును చూసుకోమన్నారు. అద్దంలో తన సోయగమును చూసుకుని, వెంటనే తన భర్తను స్మరించినది. ఉత్తరక్షణము కర్దమప్రజాపతి ప్రత్యక్షమయి మనము ఎవరూ అనుభవించని భోగములు అనుభవిద్దాము రావలసింది’ అని విమానము ఎక్కించాడు. ఈ విమానము సమస్త లోకముల మీద ఎవరికీ కనపడకుండా తిరగగలిగిన విమానములో వాళ్లు తిరుగుతున్నారు. భోగములను అనుభవిస్తూ ఇద్దరూ ఆనందముగా క్రీడిస్తూ ఉండగా ఆ విమానము మేరు పర్వతశిఖరముల మీద దిగింది. వారు మేరు పర్వతచరియలలోకి వెళ్ళారు. అక్కడ గంధర్వులు, యక్షులు, కిన్నరలు, కిపురుషులు దేవతలు ఉన్నారు. గ్రహములన్నీ ఆ మేరుపర్వతమును చుట్టి వస్తుంటాయి. ఆ మేరుపర్వత చరియలలో దేవహూతితో కలిసి కొన్ని సంవత్సరములు అలా భోగములను అనుభవిస్తూనే ఉన్నాడు. అలా భోగములను అనుభవిస్తూ ఉండగా వారికి తొమ్మండుగురు ఆడపిల్లలు పుట్టారు. తొమ్మిదవపిల్ల పుట్టిన తరువాత కర్దమ ప్రజాపతి ‘మనం ఎన్నాళ్ళ నుండి భోగం అనుభవిస్తున్నామో నీకు గుర్తుందా దేవహూతీ? అని అడిగాడు. ఆవిడ తొమ్మండుగురు ఆడపిల్లలు జన్మించారు. పెద్దపిల్ల పెళ్ళి ఈడుకు వచ్చేస్తున్నది.’ జ్ఞాపకమే లేదు కాలము క్షణములా గడిచిపోయింది’ అన్నది.

ఆయన ఇన్ని భోగములను అనుభవిస్తూ ఇవి భోగములు కాదని మనసులో నిరంతరము తలుచుకుంటున్నాడు. వైరాగ్యము బాగా ఏర్పడుతున్నది. వైరాగ్య భావన మనస్సులో ఉండాలి. అది పండిననాడు భార్యకు చెప్పి వెళ్ళిపోవాలి. అందుకని దేవహూతీ! నేను సన్యాసము తీసుకుని వెళ్ళిపోతున్నాను’ అన్నాడు. దేవహూతి ‘నిన్ను ఆపను నువ్వు పండడమే నాకు కావాలి. గృహస్థాశ్రమంలోకి వచ్చినందుకు నువ్వు పండాలి. కానీ నాది ఒక్క కోరిక. నాకు తొమ్మండుగురు ఆడపిల్లలను ఇచ్చావు. ఇప్పుడు వీరికి యోగ్యమైన వరుడిని తేవాలి. నేను ఆడదానిని ఏమీ తెలియవు. ఇంటికి రక్షణగా నాకు ఒక కొడుకును ప్రసాదించి వెళ్ళు. ఆ కొడుకు మరల నన్ను సంసార లంపటమునందు తిప్పేవాడు కాకూడదు. ఆ కొడుకు నన్ను ఉద్ధరించే వాడు కావాలి. నన్నుకూడా జ్ఞానము వైపు తిప్పేవాడు కావాలి. కూతుళ్ళను గట్టెక్కించగలవాడు అయిన ఒక కొడుకును ఇచ్చి వెళ్లవలసినది’ అని అడిగింది.

ఆయన ‘గొప్ప కోరిక కోరావు. నీకు ఒక కుమారుడిని ఇవ్వడానికి నేను అంగీకరిస్తున్నాను’ అన్నాడు. కర్దమప్రజాపతి తేజస్సునందు శ్రీమన్నారాయణుడు ప్రవేశించాడు. పిమ్మట దేవహూతి గర్భములోనికి ప్రవేశించి ఆయన కుమారుడయి కపిల భగవానుడని పేరుతో బయటకు వచ్చాడు.

కపిలమహర్షి జన్మిస్తే సంతోషమును ప్రకటించడానికి మరీచి మొదలగు మహర్షులతో బ్రహ్మగారు వచ్చారు. ‘కర్దమా! నిన్ను నేను సృష్టించి ప్రజోత్పత్తి చేయమని చెప్పాను. నీవు కేవలము ప్రజోత్పత్తి చేస్తూ ఉండిపోలేదు. గృహస్థాశ్రమము లోనికి వెళ్ళి ప్రజోత్పత్తి చేసి ధర్మబద్ధమయిన భోగమును అనుభవించి వైరాగ్యమును పొంది, వైరాగ్యము వలన సన్యసించుటకు సిద్ధపడి, భార్య కోర్కె తీర్చడానికి ఈశ్వరుడిని కొడుకుగా పొందావు. కపిలుడిని సేవించి నీ భార్య దేవహూతి మోక్షమును పొందుతుంది. సన్యాసాశ్రమమునకు వెళ్ళి నీవు మోక్షం పొందుతావు’ అన్నాడు. ఇదీ గృహస్థాశ్రమములో ప్రవర్తించవలసిన విధానము.

చతుర్ముఖ బ్రహ్మగారు వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిన తరువాత కర్దమప్రజాపతి తన కుమార్తెలను ఎవరికీ ఇచ్చి వివాహము చెయ్యాలా అని ఆలోచించారు. ఇంటి పెద్ద, తండ్రిగారయిన చతుర్ముఖబ్రహ్మగారు ఉన్నారు. ఆయన నిర్ణయం చేయాలి. బ్రహ్మగారు ‘నీకు కలిగిన తొమ్మండుగురు పిల్లలను తొమ్మండుగురు ఋషులకు ఇచ్చి వివాహము చేయమ’ ని చెప్పారు. ఆయన సూచన ప్రకారము తన కుమార్తె మరీచిమహర్షికి ‘కళ’ ను, అత్రిమహర్షికి ‘అనసూయ’ ను, అంగీరసునకు ‘శ్రద్ధ’ ను, పులస్త్యునకు ‘హవిర్భువు’ ని, పులహునకు ‘గతి’ ని, క్రతువునకు ‘క్రియ’ ను భృగువునకు ‘ఖ్యాతి’ ని’ వసిష్ఠునకు ‘అరుంధతి’ని, అధర్వునకు ‘శాంతి’ని – అలా తొమ్మండుగురు ఋషులకు, తొమ్మండుగురు కన్యలు ఇచ్చి కన్యాదానం చేశాడు. చేసి తను సన్యసించి వెళ్ళిపోయే ముందు లోపలికి వెళ్ళాడు. చంటిపిల్లవాడయిన కపిలుడు పడుకొని ఉన్నాడు. ఆయన ఎవరో కర్దమునికి తెలుసు. చంటి పిల్లవానిగా వున్న పిల్లాడిముందు తండ్రి నమస్కరించి స్తోత్రం చేశాడు. ‘మహానుభావా! మీరు ఎందుకు జన్మించారో నాకు తెలుసు. మీరు శ్రీమన్నారాయణులు. నన్ను ఉద్ధరించడానికి జన్మించారు. కొడుకు పుట్టకపోతే నాకు పితృ ఋణం తీరదు. కొడుకుగా పుట్టి పితృ ఋణం నుండి నన్ను ఉద్దరించారు. మీ సౌజన్యమునకు హద్దు లేదు. తండ్రీ! మీకు నమస్కారము. అన్నాడు. ఆయన ‘ఇంతకుపూర్వం నేను ఈ భూమండలము మీద జన్మించి సాంఖ్యమనే వేదాంతమును బోధచేశాను. తత్త్వము ఎన్నిరకములుగా ఉంటుందో సంఖ్యతో నిర్ణయించి చెప్పడమును సాంఖ్యము అంటారు. లోకం మరిచిపోయింది. మళ్ళీ సాంఖ్యం చెప్పడము కోసం నీకు కొడుకుగా పుట్టాను. నీకు కొడుకుగా పుడతానని ఇచ్చిన మాట తప్పలేదు పుట్టాను. నాయనా! నువ్వు వెళ్ళి సన్యసించు. మోక్షమును పొందుతావు’ అన్నాడు.

కర్దమప్రజాపతి ‘నా భార్య నీకు తల్లి అయిన దేవహూతిని నీవు ఉద్ధరించాలి’ అన్నాడు. ‘తప్పకుండా ఉద్ధరిస్తాను’ అన్నారు స్వామి.


https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage


instagram.com/pravachana_chakravarthy

 Srimadhandhra Bhagavatham -- 29 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu


యజ్ఞవరాహమూర్తియై వచ్చి భూమండలమును పైకెత్తాడు. స్వామి అది నీటిలో నిలబడడానికి దానికి ఆధారశక్తిని ఇచ్చాడు. ఆ ఆధారశక్తిని ఇచ్చి మూపురమును పైకెత్తి నిలబడ్డాడు. ఇలా గోళరూపంలో ఉన్న భూమండలమును పైకెత్తేసరికి భూదేవి పొంగిపోయి గాఢంగా ఆలింగనం చేసుకుంది. తత్ఫలితమే నరకాసుర జననము. ఈ దృశ్యము చూసిన ఋషులు పరమాత్మను అనేక విధములుగా స్తోత్రం చేశారు.

స్వామి వారందరికీ అభయం ఇస్తున్న సమయములో హిరణ్యాక్షుడు యుద్ధమునకు వచ్చాడు. ఇద్దరి మధ్య భయంకరమయిన యుద్ధం జరిగింది. ఒక స్థితిలో హిరణ్యాక్షుడు ప్రయోగించిన గదాప్రహారమునకు స్వామి చేతిలో గద జారి క్రింద పడిపోయింది. వాడు ‘నేను ఆయుధం లేని వాడితో యుద్ధం చేయను’ అన్నాడు. అతని ధర్మమునకు స్వామి ఆశ్చర్యపోయారు. వెంటనే స్వామి సుదర్శన చక్రమును స్మరించారు. చతుర్ముఖ బ్రహ్మగారు ‘స్వామీ! నీ వినోదం చాలు, మాకు భయం వేస్తోంది. వాడు నిన్ను అలా గదతో కొడుతుంటే మేము చూడలేక పోతున్నాము. వాడిని సంహరించి ఉద్ధరించు. వాడికి ఒక శాపము విమోచనము అయిపోతుంది’ అన్నారు. స్వామి సుదర్శన చక్రమును ప్రయోగిస్తే వాడు ఒక పెద్ద గదను ప్రయోగించాడు.

ఆ గదను స్వామి అలవోకగా పట్టుకుని విరిచి అవతల పారేశారు. పిమ్మట ఆదివరాహమూర్తి హిరణ్యాక్షుడి గూబమీద ఒక లెంపకాయ కొడితే వాడు క్రిందపడిపోయాడు. నాసికారంధ్రముల వెంట, కర్ణ రంధ్రముల వెంట నెత్తురు కారిపోతూ ఉండగా కిరీటము పడిపోయి తన్నుకుంటున్నాడు. దితి తన కొడుకును శ్రీహరి సంహరిస్తున్నాడని అర్థం చేసుకున్నది. ఆవిడ స్తనముల లోంచి రక్తము స్రవించింది. శ్రీహరి హిరణ్యాక్షుడిని తన రెండుకోరలతో నొక్కిపెట్టి సంహరించాడు. హిరణ్యాక్ష వధ పూర్తయి ఆయనకు ఒక శాపం తీరిపోయింది. పిమ్మట స్వామి భూమండలమును పైకి ఎత్తారు.

ఆదివరాహమై, యజ్ఞవరాహమై ఆనాడు రెండు కోరలతో భూమండలమును సముద్రములోంచి పైకి ఎత్తుతూ తడిసిపోయిన ఒంటితో నిలబడిన స్వామి మూర్తిని ఎవరు మానసికంగా దర్శనము చేసి, చేతులొగ్గి నమస్కరిస్తారో, అటువంటి వారి జీవనయాత్రలో ఈ ఘట్టమును చదివినరోజు పరమోత్కృష్టమయిన రోజై వారి పాపరాశి ధ్వంసం అయిపోతుంది.

5. కర్దముడు – కపిలుడు.

వ్యాసభగవానుడు గృహస్థాశ్రమము అనేది ఎంత గొప్పదో, గృహస్థాశ్రమంలో ఉన్నవాడు తరించడానికి ఎటువంటి మార్గమును అవలంబించాలో, ఎటువంటి జీవనము గడపాలో అందులో తేడా వస్తే ఏమి జరుగుతుందో, భోగము అంటే ఏమిటో దానిని ఎలా అనుభవించాలో, అలా భోగమును అనుభవిస్తే పొరపాటు లేకుండా ఎలా ఉంటుందో చెప్పడానికి, ఒక అద్భుతమయిన ఆఖ్యానమును చూపించారు. అది దేవహూతి కర్దమ ప్రజాపతుల జీవితము.

స్వయంభువు అయిన బ్రహ్మగారు కొంతమంది ప్రజాపతులను సృష్టి చేసిన ప్రజాపతులలో ఒకరు కర్దమప్రజాపతి. ఆయన మహాయోగి పుంగవుడు. కర్దమ ప్రజాపతిని సృష్టిచేసిన పిదప, ఆయనను బ్రహ్మగారు పిలిచి ఒకమాట చెప్పారు. ‘నాయనా! నువ్వు ప్రజోత్పత్తిని చెయ్యాలి. ఇంకా సృష్టి కార్యమును నిర్వహించాలి. నీకు అనురూపయై నీతోపాటు శీలము సరిపోయే ఒక భార్యను స్వీకరించి సంతానమును కనవలసింది ఇది నాకోరిక’ అన్నాడు. ఇది బాహ్యమునందు కర్దమ ప్రజాపతి జీవితము. కర్దముడు తండ్రి మాట పాటించాలని అనుకున్నాడు. సరస్వతీ నదీ తీరంలో కూర్చుని శ్రీమన్నారాయణుని గూర్చి పదివేల సంవత్సరములు తపస్సు చేశాడు. స్వామి ప్రత్యక్షం అయ్యారు. సాధారణముగా భగవద్దర్శనము అయినపుడు భక్తుని కన్నులవెంట ఆనందభాష్పములు కారతాయని చెప్తారు. ఇక్కడ కర్దమ ప్రజాపతి తపస్సును మెచ్చిన శ్రీమన్నారాయణుని కన్నులవెంట ఆనందభాష్పములు జారి నేలమీద పడ్డాయి. అది ఎంతో విచిత్రమయిన సంఘటన – ఆయన కన్నులవెంట కారిన భాష్పబిందువులు పడినచోట ఒక సరోవరం ఏర్పడింది. అది సరస్వతీనదిని చుట్టి ప్రవహించింది. ఈ సరోవరమును ‘బిందు సరోవరము’ అని పిలిచారు.

పరమాత్మను చూసి కర్దమ ప్రజాపతి ‘ఈశ్వరా! నీవు కాలస్వరూపుడవై ఉంటావు. కాలము అనుల్లంఘనీయము. అది ఎవ్వరిచేత ఆపబడదు. అది ఎవ్వరి మాట వినదు. దానికి రాగద్వేషములు లేవు. దానికి నా అన్నవాళ్లు లేరు. దానికి శత్రువులు లేరు. అది అలా ప్రవహించి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్ళిపోతున్న కాలములో జీవులు వస్తూ ఉంటారు. వెళ్ళిపోతూ ఉంటారు. దానికి సంతోషం ఉండదు, దుఃఖం ఉండదు. ఇలా వెళ్ళిపోతున్న కాలమునందు అల్పమయిన భోగములయందు తాదాత్మ్యం చెందకుండా నిన్ను చేరాలి. నిన్ను చేరుకోవడానికి అపారమయిన భక్తి ఉండాలి. భక్తితో కూడి గృహస్థాశ్రమములో ఉండి భోగము అనుభవించాలి. ఆ భోగము వేదము అంగీకరించిన భోగమై ఉండాలి. ఆ భోగమును అనుభవించి వైరాగ్యమును పొందాలి’ అన్నాడు. ఇటువంటి స్థితి కలిగిన కర్దమ ప్రజాపతిని శ్రీమన్నారాయణుడు నాయనా! నీవు ఏ కోరికతో ఇంత తపస్సు చేశావు? అని అడిగితే ‘నేను చతుర్ముఖ బ్రహ్మ చేత సృష్టించబడ్డాను. చతుర్ముఖ బ్రహ్మ నాకొక కర్తవ్యోపదేశము చేశారు. నన్ను ప్రజోత్పత్తి చేయమని, సంతానమును కనమని చెప్పారు. నా తండ్రిమాట పాటించడం నా ప్రథమ కర్తవ్యము. ఆయన మాట పాటించాలి అంటే ప్రజోత్పత్తి చెయ్యాలి అంటే నాకు సౌశీల్యయిన భార్య కావాల’ ని అద్భుతమయిన స్తోత్రం చేశాడు.

ఆయన స్తోత్రమునకు పరమాత్మ సంతోషించి ‘కర్దమప్రజాపతీ! నీ స్తోత్రమునకు నీ మాటకు నేను చాలా సంతోషించాను. నీకు కావలసిన భార్యను నిర్ణయించాను. ఎల్లుండి ఇక్కడకు స్వాయంభువ మనువు వస్తున్నాడు. ఆయనకు ‘అకూతి’, ‘దేవహూతి’, ‘ప్రసూతి’ అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అందులో దేవహూతి అనబడే ఆవిడ నీకు తగిన కన్య. దేవహూతిని రథం మీద కూర్చోబెట్టుకుని వచ్చి పిల్లను ఇస్తాను స్వీకరించమని అడుగుతాడు. ఆ పిల్లను స్వీకరించు. మీరిద్దరూ గృహస్థాశ్రమంలో తరిస్తార’ ని ఆశీర్వదించి స్వామి గరుడవాహనము మీద కూర్చుని గరుడుని రెక్కలసవ్వడి వినపడుతుండగా వెళ్ళిపోయాడు. గరుడుని రెక్కలు కదుపుతున్నప్పుడు ఒక రెక్కలోంచి ఋగ్వేదము, ఒక రెక్కలోనుండి సామవేదమును కర్దమప్రజాపతి విన్నాడు. గరుడవాహనము అంటే ఒక పక్షి కాదు. సాక్షాత్తు వేదమే. వేదము చేత ప్రతిపాదింపబడిన బ్రహ్మమే శ్రీమన్నారాయణుడు. వేదమంత్రములను విని ప్రజాపతి పొంగిపోయాడు.

కర్దమప్రజాపతి నిర్మించుకున్న ఆశ్రమవాటిక ఎంతో అందముగా ఉన్నది. శ్రీమన్నారాయణుడు చెప్పిన రోజు రానే వచ్చింది. స్వాయంభువమనువు చేతిలో ధనుస్సు పట్టుకుని రథం మీద తన భార్యయైన శతరూప, తన కుమార్తె అయిన దేవహూతి తో వచ్చి కర్దమప్రజాపతి దర్శనము చేసారు. కర్దమ ప్రజాపతి వయస్సులో చిన్నవాడు. జ్ఞానము చేత పెద్దవాడు. కర్దమప్రజాపతి పాదములకు స్వాయంభువమనువు నమస్కరించి ‘నాకు ముగ్గరు కుమార్తెలు. అందులో ఇప్పుడు నాతో వచ్చిన పిల్లను దేవహూతి అని పిలుస్తారు. ఈ దేవహూతి నీకు తగిన సౌశీల్యము కలిగినది. నారదుడు మా అంతఃపురమునకు వచ్చినపుడు నీ గుణ విశేషములను వర్ణించి చెప్పేవాడు. నీ గుణములను విన్నతర్వాత నిన్ను భర్తగా చేపట్టాలనే కోర్కె నా కుమార్తెయందు కలిగింది. నా కుమార్తెను స్వీకరించి ధన్యుడిని చేయవలసినద’ ని అడిగాడు. కర్దమప్రజాపతి ‘నీ కుమార్తె ఎంతటి సౌందర్య రాశో నాకు తెలుసు. ఎవరికీ లక్ష్మీదేవి అనుగ్రహము ఉన్నవారు మాత్రమే నీ కుమార్తెను చేపట్టగలరు. నాయందు లక్ష్మీదేవి ప్రసన్నురాలు అయింది. అందుకే నాకు ఇటువంటి భార్యను ఇచ్చింది. నీ కుమార్తె నాకు భార్య కావడానికి తగినదని శ్రీమన్నారాయణుడు నిర్ణయించి మొన్నటిరోజున చెప్పాడు. నేను నీ కుమార్తెను భార్యగా స్వీకరిస్తాను’ అన్నాడు. కర్దమప్రజాపతి, దేవహూతిల వివాహం ప్రపంచమునందు మొట్టమొదటి పెద్దలు కుదిర్చిన వివాహము. ఈ వివాహము మన అందరికీ మార్గదర్శకము.

శ్రీమన్నారాయణుడు కర్దమునికి కొడుకుగా పుడతానని వరము ఇచ్చాడు. వివాహానంతరము స్వాయంభువమనువు కూతురిను కర్దమునికి అప్పజెప్పి భారమైన గుండెతో వెనక్కి తిరిగి చూస్తూ వెళ్ళలేక వెళ్ళలేక తన రాజ్యమునకు తిరిగి వెళ్ళిపోయాడు. ఆయన అలా వెళ్ళి పోతున్నప్పుడు సరస్వతీ నదీతీరములో ఉన్నటువంటి మహాపురుషులను అందరినీ సేవించాడు.


https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage


instagram.com/pravachana_chakravarthy

కామెంట్‌లు లేవు: