19, అక్టోబర్ 2022, బుధవారం

Srimadhandhra Bhagavatham -- 47

 Srimadhandhra Bhagavatham -- 47 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu

ఇంద్రుడు దధీచి దగ్గరకు వెళ్ళి ‘నేను ఇంద్రుడనని చాలా గొప్పవాడిననే అహంభావంతో మా గురువుగారు సభలోకి వచ్చినపుడు లేవకుండా కూర్చుని ఆయనకు అపచారం చేశాను. ఈవేళ నేను ఏ స్థితికి వచ్చానో తెలుసా! నేను దేహంతో ఉండడానికి దేహీ, అని అభ్యర్ధిస్తున్నాను. అంతకన్నా నాకు బ్రతుకు లేదు. నేను బ్రతికి ఉండడానికి దయచేసి ‘మీ దేహమును నాకీయవలసినది. ఇంతకన్న నేను ఏమి అడగను. ఇలా అడగడంలోనే నేను చాలా చచ్చిపోయాను’ అని ఇంతటి ఇంద్రుడు తలదించుకుని అడిగాడు.

దధీచి గొప్పతనం ఏమిటంటే ఆయన ఇంతకుముందు రెండుమార్లు చచ్చిపోయాడు. ఆయన ఒకసారి తపస్సు చేసుకుంటుంటే అశ్వనీ దేవతలు వచ్చి ‘మీరు మాకు ‘అశ్వశిరము’ అనే మంత్రమును ఉపదేశం చెయ్యాలండి' అన్నారు. దధీచి ఇపుడు నేను ఒకయాగం చేసుకుంటున్నాను. అది పూర్తయిపోయిన తరువాత తప్పకుండా ఉపదేశం చేస్తాను అన్నాడు. వాళ్ళు వెళ్ళిపోయిన తరువాత ఇంద్రుడు దధీచి దగ్గరకు వచ్చి మీరు ఆ విద్య అశ్వనీ దేవతలకు చెప్పినట్లయితే మిమ్మల్ని చంపేస్తాను అన్నాడు. తరువాత మరల అశ్వనీ దేవతలు వచ్చారు. దధీచి నేను మీకు ఆ మంత్రమును ఉపదేశించినట్లయితే ఇంద్రుడు నన్ను చంపేస్తానన్నాడు ఎలాగ? అన్నాడు అశ్వనీ దేవతలు ‘నీవు మాకు విద్య ఉపదేశం చేసావని చెప్పగానే ముందు వెనుక చూడకుండా ఇంద్రుడు నీ కంఠమును కోసేస్తాడు. ఆ పనేదో మేమే చేసేస్తాము. ఒక గుఱ్ఱం తలకాయ తీసుకు వచ్చి నీకు పెట్టేస్తాము. ఆ విద్య పేరు ఎలాగు అశ్వశిరము కదా. నువ్వు గుర్రం తలకాయతో మాకు చెప్పెయ్యి. ఇంద్రుడు వచ్చి కోపంతో ముందు వెనుక చూడకుండా ఆ తలకాయ కొట్టేస్తాడు. మేము ఆ గుర్రం తలకాయ తీసివేసి అసలు తలకాయ పెట్టేస్తాము అన్నారు.

గురువు అంటే ఎలా ఉంటాడో ఎంత స్వార్థ త్యాగంతో ఉన్నాడన్నది చూడాలి. దధీచి నరికెయ్యండి అన్నాడు. వెంటనే వారు దధీచి కంఠం నరికేసి ఒక గుఱ్ఱం తలకాయను తెచ్చి అతికించారు. ఇంద్రుడు వచ్చి మరల తలకాయ నరికేశాడు. వీళ్ళు ఆ గుర్రం తలకాయను ప్రక్కన పెట్టి దధీచికి మామూలు తలను పెట్టేశారు. ఆయన ప్రాణంతోనే ఉన్నాడు. బ్రహ్మహత్యాపాతకం రాలేదు. దధీచి ద్విజుడు. మహాపురుషుని దగ్గరకు వెళ్ళి ఈమాట అడిగితే ఆయన వీళ్ళను చూసి ఒక చిరునవ్వు నవ్వి 'నేను ప్రపంచములో కోర్కెలను అడిగిన వారిని చూశాను. మీరు నా శరీరమును అడుగుతున్నారు. ఇలా అడగడానికి మీకు సిగ్గుగా లేదా? మీరు బ్రతకడానికి ఇంకొకరిని చంపుతారా? ఇలా అడగవచ్చునా? అన్నారు. అంటే వాళ్ళు ‘ మాకు ఇంతకన్న వేరు మార్గం లేదు. మిమ్మల్ని వేడుకుంటున్నాము. మమ్మల్ని రక్షించడానికి మీరు తప్ప ఈ ప్రపంచమునందు వేరొకరు లేరు అన్నారు.

దధీచి 'ఈ శరీరము నేను కాదు. నేను ఆత్మని. మీకు శరీరము కావాలి తీసుకోమని చెప్పి యోగవిద్యతో తనలో ఉన్న ప్రాణవాయువును పైకిలేపి అనంతములో కలిపేసి శరీరమును కిందపడగొట్టేశాడు. వీళ్ళందరూ ఆ శరీరము కోసి అందులోని ఎముకలను తీసుకొని విశ్వకర్మకు ఇచ్చారు. అందులోంచి విశ్వకర్మ నూరు అంచులు కలిగిన వజ్రాయుధమును తయారు చేశాడు.

ఈలోగా వృత్రాసురుడు లోకములన్నింటిని గడగడలాడించేస్తున్నాడు. ఇంద్రుడు గబగబా వెంటనే ఈ వజ్రాయుధమును చేతిలో పట్టుకుని ఐరావతమునెక్కి తన సైన్యమునంతటిని తీసుకుని యుద్ధభూమికి వెళ్ళాడు. వృత్రాసురుడితో యుద్ధం చేశాడు. వృత్రాసురుడు 'ఇంద్రా !నేను ఈ విశ్వమంతా నిండిపోయి ఉండి నీవేమి చేస్తున్నావో చూస్తూనే ఉన్నాను. నువ్వు శ్రీమన్నారాయణ దర్శనము చేసుకుని, దధీచి ఎముకలు పట్టుకుని దానితో వజ్రాయుధం చేయించుకుని నన్ను చంపడానికి వచ్చావు. నేను నీ చేతిలో చచ్చిపోతాను. ఎందుకంటే నీకు శ్రీమన్నారాయణుడి అండ ఉన్నది. వజ్రాయుధానికి నేను చచ్చిపోతానని స్వామి చెప్పారు. ఆయన వాక్కుకు తిరుగులేదు. నేను చచ్చిపోతానన్న భయం లేదు. నాకు ఎప్పటికయినా భగవంతుని సేవ చేసి భగవద్వాక్యములు చెప్పే వారితో కూడిక కావాలి. నేను శ్రీమన్నారాయణుని పాదములలో చేరిపోవడానికి పరితపిస్తున్న వాడిని. తొందరగా నీ వజ్రాయుధమును నామీద ప్రయోగించి నన్ను తుదముట్టించు’ అన్నాడు.

వాని మాటలకు ఇంద్రుడు ఆశ్చర్యపోయి ‘నిన్ను చూస్తుంటే నాకు నారాయణునే చూస్తున్నట్లు ఉంది నీకు నమస్కారం చెయ్యాలనిపిస్తోంది. నీవు రాక్షసుడవు ఏమిటి, నీకు యుద్ధం ఏమిటి’ అని అడిగాడు. ఆయన ‘ధర్మము ధర్మమే. నీవు మా అన్నయ్యను చంపేశావు. చచ్చిపోయేవరకు నీతో యుద్ధం చేస్తాను' అని ఒక శూలం తీసి ఐరావతం తలమీద కొట్టాడు. ఆ దెబ్బకు తలబద్దలై నెత్తురు కారుతూ ఐరావతం పడిపోయింది. ఆ శూలం తీసి లెంపకాయ కొట్టినట్లు ఇంద్రుని చెంపమీద కొట్టాడు. ఆ దెబ్బకు తల గిర్రున తిరిగి ఇంద్రుడు తన చేతిలో వున్న వజ్రాయుధమును క్రింద పడేశాడు. అది భూమిమీద పడిపోయింది. ఇంద్రా! వజ్రాయుధమును తీసుకుని నాతో యుద్ధం చెయ్యి’ అన్నాడు. నిజంగా ఆ వృత్రాసురుడు ఎంతో ధర్మాత్ముడు. ఇంద్రుడు అనుమాన పడుతూనే వజ్రాయుధాన్ని చేతితో పట్టుకుని ఆయన రెండు చేతులు నరికేశాడు. అలాగే వాడు పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ దగ్గరకు వచ్చి నోటితో ఉఫ్ అన్నాడు. ఆ గాలికి ఇంద్రుడు, ఇంద్రుని ఐరావతము అన్నీ కలిసి ఆయన నోట్లోకి వెళ్ళిపోయాయి. గుటుక్కున మింగేశాడు. వృత్రాసురుని కడుపులోకి వెళ్ళిపోయిన ఇంద్రుడు అదృష్టవశాత్తు ఇంతకు పూర్వం విశ్వరూపుని దగ్గర నారాయణ కవచం పొందాడు. ఆ నారాయణ కవచ స్మరణం చేత, వైష్ణవీ విద్య చేత అతడు వృత్రుని కడుపులోకి వెళ్ళిపోయినా జీర్ణము కాలేదు. వృత్రాసురుని కడుపులో ఉండిపోయి వజ్రాయుధంతో ఆయన కడుపు కత్తిరించి బయటకు వచ్చి ఆయన దగ్గరకు వచ్చి ఒక సంవత్సరం పాటు ఆయన కంఠం చుట్టూ తిరుగుతూ వజ్రాయుధంతో ఆయన కంఠమును కత్తిరించాడు. ఉత్తరాయణ దక్షిణాయనముల సంధికాలంలో వృత్రాసురుని శిరస్సు దుళ్ళి క్రింద పడిపోయింది. వృత్రాసురుడు రాక్షసుడే కానీ పోతనగారు అన్నారు –

అఖిల దుఃఖైక సంహారాది కారణం; బఖిలార్థ సంచ యాహ్లాదకరము

విమల భక్త్యుద్రేక విభవ సందర్శనం; బనుపమ భక్త వర్ణనరతంబు

విబుధహర్షానేక విజయ సంయుక్తంబు; గ్రస్తామరేంద్ర మోక్షక్రమంబు

బ్రహ్మహత్యానేక పాపనిస్తరణంబు; గమనీయ సజ్జన కాంక్షితంబు

నైన యీ యితిహాసంబు నధిక భక్తి, వినినఁ జదివిన వ్రాసిన ననుదినంబు

నాయు రారోగ్య విజయ భాగ్యాభివృద్ధి, కర్మనాశము సుగతియుఁ గల్గు ననఘ!

ఎవరికయినా విశేషమయిన కష్టములు, బ్రహ్మహత్యాపాతకం వంటి కష్టములు వస్తే వృత్రాసుర వధలో వున్న పద్యములను, వచనములను కూర్చుని ఒక పుస్తకములో వ్రాస్తే చాలు వాళ్ళ కష్టములు పోతాయి. చెపితే చాలు కష్టములు పోతాయి. ఎంతటి మహాపాపము తరుముకు వస్తున్నా వృత్రాసుర వధ వింటే చాలు ఆ పాపములన్నీ పోతాయి.

ఇదంతా విని పరీక్షిత్తు ఒక ప్రశ్న అడిగాడు. ఇప్పటివరకు నీవు నాకు ఎన్నో విషయములు చెప్పావు. ఇలాంటి రాక్షసుని గురించి నేను వినలేదు. ఏమి ఆశ్చర్యము! నన్ను తొందరగా చంపెయ్యి – నేను శ్రీమన్నారాయణుడిలోకి వెళ్ళిపోతానన్న రాక్షసుడిని ఇంతవరకు నేను చూడలేదు. ఈ వృత్రాసురుడికి ఇంత మహిత భక్తి ఎలా కలిగింది? ఇంతజ్ఞానం ఎలా కలిగింది? నాకు చెప్పు నా మనస్సు ఆత్రుత పడిపోతోంది అన్నాడు. మహానుభావుడు శుకుడు ఆనాడు చెప్పాడు.

https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersU...

instagram.com/pravachana_chakravarthy

కామెంట్‌లు లేవు: