19, అక్టోబర్ 2022, బుధవారం

పాపాలను పోగొట్టే పినాకపాణి...

 #పాపాలను పోగొట్టే పినాకపాణి....


ఈశ్వరుడికున్న నామాల్లో చాలా చిత్రమైనది.. ‘పినాకి’ అనే నామం. 


మనకు తెలిసి ఉన్నంతలో చేతిలో కోదండం పట్టుకున్న శివమూర్తి ఎక్కడా కనిపించడు.. 


శివుడు పట్టుకునే ధనుస్సు సామాన్యమైనది కాదు. ఆయన మేరుపర్వతాన్ని ధనుస్సుగా పట్టుకుంటాడు. 


 #పరమశివుని పినాకము 


మహాశివునికి గల మరో పేరే పినాకపాణి. ఈ పేరుని ఎక్కడో చోట వినే వుంటారు. ఆ ధనస్సే మహాశివుని ఆయుధం, దాని పేరే పినాకము.


పినాకము అను ధనస్సును చేతిలో కలవాడు పినాకపాణి, మహాశివుడు.


శ్రీమహావిష్ణువు చేసే రాక్షస సంహారానికి, శంకరుడు చేసే రాక్షస సంహారానికి చిన్న తేడా ఉంటుంది. విష్ణుమూర్తి రాక్షస సంహారం చేసేటప్పుడు.. 


ఆ రాక్షసుడు ఏ వరాలు కోరుకున్నాడో వాటికి మినహాయింపుగా చంపడానికి వీలైన శరీరాన్ని స్వీకరిస్తాడు. శంకరుడు తాను ఎలా ఉన్నాడో అలాగే ఉండి రాక్షసులను సంహరిస్తాడు. 


వేరొక రూపం తీసుకోడు. అయితే శంకరుడు ధనస్సును పట్టుకున్నట్టు ఎక్కడా చూపించరు గానీ.. వేదం వల్ల శాబ్దికంగా తెలుస్తుంది..


ఎక్కడంటే... యజుర్వేదంలోని ‘శ్రీరుద్రం (రుద్రాద్యాయం)’లో తెలుస్తుంది.


నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః

నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముత తే నమః

యా త ఇషుపశ్శివతమాశివం బభూవ తే ధనుః

శివాశరవ్యాయా తవ త యా నో రుద్ర మృడయ’


`ఓ రుద్రా మా మీద ఏమిటా కోపం? స్వామీ మీరు అంత కోపంగా ఉన్నారేమిటి? మీ కోపానికి ఒక నమస్కారం’ - అని చెబుతూ రుద్రాభిషేకం ప్రారంభిస్తాం.


ఇక్కడ మనం ప్రసన్నుడైన మూర్తికి నమస్కారం చెయ్యడం లేదు. కోపంగా ఉన్న స్వామివారి మూర్తికి నమస్కారం చేస్తున్నారు.


కోపంతో ఉన్నవాడు తన చేతిలో ఉన్న ఆయుధం నుంచి బాణాలను విడిచిపెడతాడు. ఇవి మనల్ని రోదింపజేస్తాయి. మరి ఎందుకు ఆయన అలా ధనుస్సు పట్టుకోవాలి? రుద్రుడు మనం చేసిన తప్పులకు మనను శిక్షించడానికి ధనుస్సును పట్టుకుని ఉన్నాడు. 


ఆయన వంక చూస్తేనే భయంతో వణికిపోతారు. దీన్ని ఈశ్వరుడి ఘోరరూపం అంటారు. అలాంటి రూపంలో ఉన్న ఈశ్వరుడు తన ధనుస్సును ఎక్కుపెడితే మన కంట అశ్రుధారలు తప్పవు. 


ఆయన మనల్ని ఎందుకు బాధపెట్టడం అంటే.. చేసిన పాప ఫలితం బాధపడితేగానీ పోదు కాబట్టి. పాపం పోయేలా ఏడిపించేందుకుగాను ఆయన తన బాణాలను తీస్తున్నాడు.


అప్పుడు మనమేం చేయాలి? ‘నేను పాపం చేశాను. కానీ నన్ను అంత ఏడిపించకు. తట్టుకోలేను. నేను ఏడిస్తే నీ పాదాల యందు విస్మృతి కలుగుతుంది. 


నిష్ఠతో నీ పాదాలను పట్టుకోలేని స్థితి నాకు వచ్చేస్తుంది. కాబట్టి ఈశ్వరా నీ కోపానికి ఒక నమస్కారం. ఈశ్వరా నీ ధనుస్సుకు ఒక నమస్కారం. ఈశ్వరా నీ బాణాలకు ఒక నమస్కారం.


మేమేదో కొద్దిగా పుణ్యం చేసుకున్నాం. నీవు తలుచుకుంటే, నన్ను నీ భక్తుడిని చేసుకుంటే ఎవరూ అడ్డు రారు. నా యందు దయ ఉంచి నన్ను నీ త్రోవలో పెట్టుకో’ అని ప్రార్థిస్తే ఆయన ప్రసన్నుడు అవుతాడు. 


అసలు సనాతన ధర్మంలో.. మనను భయపెట్టడానికి మనం చేసే పాపానికి ఫలితం ఇచ్చేవాడొకడు, భయం తీసేవాడు ఒకడు వేర్వేరుగా ఉండరు. ‘భయకృత్‌ భయనాశనః’.. భయాన్ని సృష్టించేవాడు, తీసేసేవాడు పరమాత్మే. 


ఈశ్వరుని కారుణ్యానికి అంతులేదు. శాస్త్రప్రకారం ఆయన పట్టుకున్న ధనుస్సు మనకు ఎల్లప్పుడూ రక్షణే కల్పిస్తుంది. ఘోరరూపంతో పాపఫలితాన్నిచ్చినా.. అఘోర రూపంతో సుఖాన్నిచ్చినా చేస్తున్నది మన రక్షణే. 


రామాయణంలొ ముఖ్య ఘట్టమైన శివధనుర్భంగం గురించి తెలియని వారు ఎవరూ వుండరు. కానీ శివుని ధనస్సు జనకుని దగ్గరికి ఎలా వచ్చింది? దాని ప్రత్యేకతలు ఏంటో

తెలుసుకుందాము.


దక్ష ప్రజాపతి శివుడికి హవిస్సులు ఇవ్వని యాగం ప్రారంభించాడు. శివుడు లేని చోట మంగళం ఎలా ఉంటుందని ప్రశ్నించిన దక్షుని కుమార్తె, పరమశివుడి భార్య అయిన సతీదేవి అవమానానికి గురై యోగాగ్నిలో శరీరాన్ని వదిలింది.


ఆగ్రహించిన శివుడు రుద్రుడై, యజ్ఞాన్ని తన ధనస్సుతో ధ్వంసం చేసి, అక్కడికి వచ్చిన దేవతలపై కోపోద్రుక్తుడై, మహాశివుడు తన ధనస్సును ఎక్కు పెట్టడంతో వెంటనే దేవతలు శివుని పాదాలను చేరి, శరణు వేడి, ప్రార్థించారు. అంతటితో శివుడు ప్రసన్నుడై ఆ ధనస్సుని వారికి అందజేస్తాడు.


ఆ ధనుస్సుని దేవరాతుడు అనే మిథిలా నగర రాజు దగ్గర న్యాసంగా (అంటే కొంతకాలం ఉంచారు)ఉంచారు. దానినే పినాకము అంటారు.


అప్పుడా రాజు, ధనుస్సుని ఒక మంజూషలో (పెద్ద పెట్టె) పెట్టాడు. ఎనిమిది చక్రాలున్న ఆ మంజూషలొ శివ ధనుస్సు ఉండగా తొయ్యాలంటే దాదాపు 5000 మంది మనుషులు కావాలి. అలా ఆ విదేహ వంశీయులు ఆ శివ ధనుస్సుని రోజూ పూజిస్తూ, పరమ పవిత్రంగా చూసుకుంటూ ఉన్నారు.


వంశపారంపర్యంగా వస్తున్న ఆ ధనస్సుని జనకుడు, తన కుమార్తె సీతా స్వయంవరంలో ఉపయోగించి, ఉత్తమోత్తముడైన వరుడిని ఎంచుకొనుటకు ఉంచుతాడు.


విశ్వామిత్రునితో వచ్చిన రామలక్ష్మణులలో, రాముడు ఆ శివధనస్సును ఎక్కుపెట్టడమే కాక, శివధనుర్భంగం చేయడంతో సీతను పొందుతాడు.


అలాంటి ఆ ధనుస్సు లోకాలను రక్షించగలిగినది. అందుకే రుద్రం ఆ ధనుస్సును అంత స్తోత్రం చేసింది.

కామెంట్‌లు లేవు: