19, అక్టోబర్ 2022, బుధవారం

ధర్మాకృతి : ఇంద్రసరస్వతీ, భారతీ మహాస్వాములు - 3

 ధర్మాకృతి : ఇంద్రసరస్వతీ, భారతీ మహాస్వాములు - 3


శ్రీకంఠశాస్త్రి గారిపైన వదిలివేశారు. తమకు ఇష్టము ఉన్నా లేకున్నా వారి నిర్ణయానికే తమ ఆమోదముద్ర వేసేవారు.


శ్రీకంఠశాస్త్రి గారు విద్యారణ్యుల కాలం నుండి వచ్చిన రాచమర్యాదలు ఏమాత్రం సడలించడం ఇష్టపడేవారు కాదు. స్వామివారికి ఈ దర్జా ఆడంబరం నచ్చేవి కాదు. 1920-27 యాత్రలలో ప్రతి గ్రామం ప్రవేశించేటప్పుడు స్వామివారికి కిరీటము, ఆభరణాలు, జరీ శాలువాలు అలంకారం చేయవలసినదిగా శాస్త్రి గారి ఆజ్ఞ. స్వామివారికి సుతరామూ ఇది ఇష్టం ఉండేది కాదు. అయినా శాస్త్రిగారికి కష్టం కలిగించ కూడదని నిర్లిప్తంగా భారించేవారు. మళ్ళీ గ్రామం దాటగానే ఈ బరుగు తొలగించబడేది. స్వామివారు ఈ కవాతుని సాక్షిమాత్రంగా స్వీకరించేవారు. ‘నేనో వేషధారిని. ఈరోజు ఈ వేషం – రేపో వేషం’ అని తీసిపారేసేవారు. 


శ్రీకంఠశాస్త్రి గారి విధానానికి, స్వామివారి స్వాభావిక లక్షణాలకు అనంతమైన అంతరం ఉంది. శృంగేరీ మఠ ఔన్నత్యానికి శాస్త్రిగారు ఎనలేని సేవ చేశారనేది నిర్వివాదాంశము. కానీ చిన్నతనంలో తమ వద్ద పెరిగిన ఈ స్వామివారి ఆధ్యాత్మికోన్నతిని బహుశః వారు గుర్తించలేదని చెబుతారు. శాస్త్రిగారు స్వయంగా పండితులు. అద్వైతానుభూతి గూర్చి స్పష్టమైన పుస్తక పరిజ్ఞానమున్నది. అయితే మఠోన్నతి అనే గాడిన పది మిగతా విషయాలను పట్టించుకోవడం మానేశారనుకుంటారు. ఈ కారణం చేతనో వస్తుతః విరాగి కావ్వడం చేతనో శృంగేరీ స్వామి 1928-31 లలో పూర్తిగా అంతర్ముఖులయిపోయారు. నిరంతర బ్రహ్మానుభవంలో మునిగి తేలుతూ బాహ్య స్మృతి పూర్తిగా మర్చిపోయారు. పూజ మొదలుపెడితే గంటల తరబడి అర్చన చేస్తూ ఉండడం, చేతిలో పుష్పం ఉంచుకొని అమ్మవారిని చూస్తూ అలానే లీనమయిపోయి ఉండడం, అభిషేకం చేస్తూ ధారాపాత్రలో పాలు అయిపోయినా అలానే ఉండిపోవడం వంటివి చేయనారంభించారు. విజ్ఞాపన చేస్తే వినిపించేది కాదు. ఏం తింటున్నారో వారికే అర్థమయ్యేది కాదు. సదాశివ బ్రహ్మేంద్రుల ఆత్మవిద్యా విలాసంలోని శ్లోకాలు పెద్దగా చదువుకుంటూ ఉండేవారు. 


శ్రీకంఠశాస్త్రి గారికి ఈ పోకడ అర్థం కాలేదు. స్వామివారికి ప్రయోగం లాంటిదేమైనా జరిగిందేమోనని పరిహారాలు మొదలుపెట్టారు. రాత్రిపూజ వారే చేయడం మొదలుపెట్టారు. బాహ్యస్మృతిలో లేనికాలంలో గదిలో తాళం వేసి ఉంచి పరిచారకులను కావలి ఉంచారు. పరిచారకులు కూడా కేవలం స్నానం చేయించడానికి ఆహరం ఇవ్వడానికి మాత్రమే లోపలి వెళ్ళేవారు. మూసిన గదిలోనుంచి అప్పుడప్పుడూ సంగీతం కేవలం దేవతలే పాడుతున్నారా అన్నట్లు వినవస్తుంది. మరింకోసారి స్వామివారు ఆశువుగా ఆత్మానుభూతి సంబంధమైన శ్లోకాలు అనర్గళంగా చదవడం వినవస్తుంది. ఆహా! ఆ స్వామి ఉనికి చేత శృంగేరీ చిక్ మంగళూర్ జిల్లా, కర్ణాటక యావద్భారతం పవిత్రమైపోయాయి.


అర్థం కాని అమాయకులు మతిభ్రమణం అని భ్రమపడ్డారు. విషయం ప్రభుత్వం దాకా పొక్కింది. కోట్ల ఆస్తి ఉన్న పీఠానికి అధిపతి – విషయం ధృవీకరించుకోవడానికి రహస్యంగా ఒక మానసిక వైద్యుని పంపారు. స్వామివారిని కలిసే వేలు లేనందున ఆ వైద్యుడు వారి మనఃపరిస్థితి గూర్చి సర్వాధికారి వద్ద, పరిచారకుల వద్ద వాకబు చేస్తున్నాడు. అయితే హఠాత్తుగా స్వామివారు బాహ్యస్మృతిలోనికి వచ్చారు. బాహ్యస్మృతిలోనికి వచ్చినప్పుడు ఆశ్రమ నిధులు, భక్తులకు దర్శనాలు స్వామివారు యధావిధిగా నిర్వర్తిస్తారట. అందరితో పాటు వైద్యుడు కూడా స్వామి దర్శనానికిక వెళ్ళారు. దర్శనం అయిన తరువాత శలవు తీసుకోబోతున్నారు. “ఏం వెళ్ళిపోతున్నావు? వచ్చిన పని అయిందా?” అన్నారు స్వామి. రహస్యమైన పనిమీద వచ్చిన వైద్యుడు మౌనం వహించారు. ‘నీవు నన్ను పరీక్షించే పని పూర్తిచేశావా? నా ఈ వ్యాధికి మీ వైద్యవిధానంలో మందు ఏమైనా ఉన్నదా” అని నేరుగా ప్రశ్నించారు. డాక్టర్ గారు దొరమొహం వేశారు. తనపై ఏర్పాటు చేయబడిన కావలిని. అందువలన ఏర్పడిన అనుమానాన్ని దృష్టిలో ఉంచుకొని “ఇది నా ప్రారబ్ధం. అనుభవించవలసినదే. పాపం నీవేమి చేస్తావు” అని పంపివేశారు. డాక్టర్ నివేదిక ఏమైనా ఉంటుందనే విషయం వేరే చెప్పనక్కర లేదు కదా!


(సశేషం)


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: