12, మే 2024, ఆదివారం

శంకరుని జీవిత విశేషాలు

 ఆది శంకరుని జీవిత విశేషాలు -


ఈ ప్రపంచములో అన్ని దేశాల సంస్కృతులకు మూలము ఆర్ష భూమియైన ఈ భారత దేశమే. మానవుడు పుట్టిన తొలినాళ్ళ నుండీ , కొండకోనల్లో తిరుగాడిన నాటి నుండీ సంస్కృతీ వికాసం పొందేవరకు సర్వం ఈ ఆర్షభూమిలో జరిగినవే . అట్టి భరత ఖండంలో కాలక్రమేణా కలిలో అనేకానేక కొత్త కొత్త సిద్ధాంతాలు, మతాలూ పుట్టుకొచ్చి, ప్రజలకి సనాతన ధర్మం పట్ల, భగవంతుని పట్ల విశ్వాసం సన్నగిల్లుతున్న సమయంలో మన సనాతన ధర్మ పరిరక్షణకై అవతరించిన అపర శంకరావతారమే ఆది శంకరాచార్య. ఆయన జీవిత కాలం మీద అనేక అపోహలు ఉన్నాయి. ఇప్పటికీ అనేక పుస్తకాలలో మనం ఏడవ శతాబ్దానికి చెందినవారిగా మాత్రమే చదువుతున్నాము. శంకరుని కాలం గూర్చి టి ఎస్ నారాయణ్ శాస్త్రి గారు అనేక పరిశోధనలు చేసి రచించిన " ద ఏజ్ అఫ్ శంకర " అనే పుస్తకములో శంకరుని కాలం గూర్చి అనేక వివరాలతో బాటు పీఠాల వివరాలు .. వివిధ కాలాల్లో ఆయా పీఠాలు అధిష్టించిన పీఠాధిపతుల పేర్లు సర్వం అందులో వ్రాసియున్నారు. శంకరుని జీవిత కాల విశేషాలు మీ అందరికోసం ఇక్కడ.


శంకర భగవత్పాదులు కలి అబ్ది 2593 సంవత్సరం అనగా బిఫోర్ కామన్ ఎరా 509 లో పరశురామ క్షేత్రం అయిన నేటి కేరళలోని కాలడి గ్రామములో ఆర్యాంబ శివగురు అనే పుణ్య దంపతులకు వైశాఖ శుక్ల పంచమి నందన నామ సంవత్సరములో జన్మించి ఆ తల్లిదండ్రులకు ఆనంద కారకుడయ్యాడు.


అల్లారు ముద్దుగా పెరిగిన శంకరునికి అయిదవ యేట కలి అబ్ది 2598 లో అనగా బిఫోర్ కామన్ ఎరా 504 లో ఉపనయనం చేసి విద్యాభ్యాసం చేయించారు . చిన్నతనం నుండే ఏక సంథాగ్రాహి అయిన శంకరుడు సర్వము ఇట్టే గ్రహించేవాడు . ఎనిమిదేళ్లు వచ్చేసరికి వేద వేదాంగాలు స్మృతులు , ఇతిహాసాలు, పురాణాలు అన్నింటి మీద శంకరునికి పట్టు ఏర్పడింది .


కలి అబ్ది 2601 లో అనగా బిఫోర్ కామన్ ఎరా 501 లో శంకరుని తండ్రి శివగురువు శివసాయుజ్యం పొందారు. అప్పటికి శంకరుని వయస్సు ఎనిమిదేళ్లు. తండ్రికి సంస్కారాలు అవీ చేసాక శంకరుడు కొన్నాళ్ళు తల్లితోనే జీవించాడు .


తండ్రి మరణించాక ఏడాది గడవగానే శంకరుడు కలి అబ్ది 2602 లో అనగా బిఫోర్ కామన్ ఎరా 500 లో కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఫ్లవా నామ సంవత్సరములో తల్లి అనుమతితో సన్యాసం దీక్ష స్వీకరించాడు . సన్యాసం దీక్ష స్వీకరించిన శంకరుడు జ్ఞానార్థియై కాలి నడకన నర్మదా నదీ తీరములో ఉన్న గోవింద భగవత్పాదుల వద్ద శిష్యరికం కలి అబ్ది 2603 లో అనగా బిఫోర్ కామన్ ఎరా 499 లో చేసారు . అక్కడే క్రమ సన్యాసం చేసిన శంకరుడు నాలుగేళ్ళ పాటు వేదాంత శాస్త్రములో అక్కడ విద్యాభ్యాసం కలి అబ్ది 2605 వరకు అనగా బిఫోర్ కామన్ ఎరా 497 వరకు చేసారు .


వేదాంత శాస్త్రాధ్యయనం తరువాత శంకరుడు కాలి నడకన హిమవత్పర్వత ప్రాంతానికి చేరుకొని బదరికాశ్రమములో ఉన్న గౌడపాదాచార్యులను కలసి ఆయనను పరమగురువుగా స్వీకరించారు . అక్కడ నాలుగేళ్ళ పాటు గౌడ పాదాచార్యుల శిష్యరికంలో సర్వమూ నేర్చారు. అప్పటికి గౌడ పాదాచార్యుల వయస్సు 120 సంవత్సరాలు. శ్రమ అన్నది  లేక అయన స్వయంగా అనేక మర్మాలు , సర్వ శాస్త్రాలు కలి అబ్ది 2605 నుండీ అనగా బిఫోర్ కామన్ ఎరా 497 నుండీ కలి అభ్ది 2609 వరకు అనగా 493 వరకు భోదించారు. బదరికాశ్రమములో శంకరుడు తన గురువు అయిన గౌడ పాదాచార్యుని శిష్యరికంలో తన గురువు గారి బోధనలు అయిన గౌడపాద కరికలు మీద భాష్యం వ్రాసారు. ఆ పిమ్మట ప్రస్థాన త్రయం మీద పదహారు భాష్యాలు వ్రాసారు.


శంకరుడు సన్యాసం దీక్ష వహించిన తరువాత ఆతని వెన్నంటి ఎపుడూ అనుసరించినవాడు విష్ణు శర్మ అనే సహాధ్యాయి .కాలడి నుండి ఆతను శంకరునితోనే నర్మదా తీరం, బదరికాశ్రమము అన్నింటా అతనే శంకరునితో ఉండేవారు. బదరికాశ్రమములో విష్ణు శర్మ కూడా సన్యాసం దీక్ష వహించాడు . అతడినే చిత్సుకాచార్య అని కూడా సంభోదించేవారు. శంకరుని జీవితములో జరిగిన వాటన్నింటికీ ప్రత్యక్ష సాక్షి ఈ చిత్సుకాచార్యులే. వీరే శంకర బృహత్విజయం అని శంకరుని జీవిత విశేషాలను ఆయన సాధించిన విజయాలను అందులో వ్రాసారు. కానీ ఆ గ్రంథం నేడు అలభ్యం.


పదహారేళ్ళ ప్రాయములో బదరికాశ్రమములో ఉన్న శంకరునికి తల్లి ఆర్యాంబ గుర్తుకు రాగా కాలడి బయలు దేరి వెళ్లారు. ఆర్యాంబ కలి అబ్ది 2608 అనగా బిఫోర్ కామన్ ఎరా 492 ఫ్లవంగ నామ సంవత్సరం లో జీవన్ముక్తి పొందారు. అదే సంవత్సరములో శంకరునికి వేదాంత విద్యను గఱపిన గోవింద భగత్పాదులు కూడా కార్తీక పౌర్ణమి నాడు విష్ణు సాయుజ్యం పొందారు .

కామెంట్‌లు లేవు: