🌻అమ్మ 🌻
సీ. నవమాసములుమోసి భవము నిచ్చెడి యమ్మ
శిశువుకు ధరపైన సృష్టికర్త
అమృతము నందించి యక్కున నిడుకొని
లాలించి పాలించు రమ్యచరిత
ఉలకని శిశువుకు పలుకులన్నేర్పించి
మోదమున్ గూర్చెడి మొదటి గురువు
సతతమ్ము శిశువుకై వెతలను తా నోర్చి
బుజ్జి బొజ్జకు పాలు పోయు నెలత
ఆ. అడుగు లేయు చుండ హస్తము న్నందించి
పడక పట్టుకొనెడి ప్రాపు యమ్మ
అమ్మ తోడు లేక నన్నింట వెతలగున్
నవని నన్నిటందు యమ్మ మిన్న
సీ. పెరిగిన సంతును మురిపంబు తోడను
బుజ్జగించియు పంపు నొజ్జ కడకు
విద్యల నా సంతు వికసించు చుండంగ
పరవశంబున గాంచి మురిసిపోవు
ఆటల పాటల నారితేరుచు నుండ
నానంద చిత్తాన మేను నిమురు
యుక్త వయస్సున నుద్వాహమగుచుండ
మించిన ప్రేమతో మేలు కోరు
తే. తనరు చుండంగ తన సంతు తననుమించి
యంతరంగమ్ము నందున యమ్మ మురియు
అమ్మ లేకున్న బ్రతుకంత యంధమయము
యవని నన్నింట నెంచంగ నమ్మ మిన్న
క. కమ్మని ప్రేమను పంచగ
యిమ్మహి సృజయించె బ్రహ్మ యీప్సిత మొప్ప
న్నమ్మను, సుగుణంబులలో
యమ్మకు మరి మించు వేల్పు యరయన్ గలదే !
ఆ. "తల్లి దండ్రి గురువు దైవ" మంచు బుధులు
"అమ్మ" నుంచినార లాదియందు
భవము నిచ్చు తల్లి ప్రత్యక్ష దైవమ్ము
నరుల కైన దివిని సురల కైన
సీ. చిన్నవాడు ధ్రువుండు శ్రీమహావిష్ణుని
దర్శనమును పొందె తల్లి వలన
తల్లి దాస్యము బాప తరలియు గరుడుండు
తెచ్చె నమృతమును దివము నుండి
తల్లి కోర్కెను దీర్చ తరలె శ్రీరాముండు
వర్షముల్ పదునాల్గు వనములకును
మాతకు వసతిగా మళ్ళించెను నదిని
శంకరాచార్యుండు సవినయముగ
తే. తల్లి ఋణమును దీర్చుట తనయులకును
బాధ్యతై యుండు నయ్యదే ప్రాప్త మరయ
మాతృమూర్తిని మించియు మమత జూపు
దైవమే లేదు తలచంగ ధరణి యందు.
ఆ. 'జనని జన్మభూమి' స్వర్గంబు కంటెను
భవ్య మనుచు రామభద్రు డనియె
జన్మ నిచ్చి నట్టి జననికి మించిన
దైవ మొండు లేదు ధాత్రి యందు.
ఆ. తనువు నిచ్చినట్టి జననికంటె నిలను
దైవ మెవరు లేరు తలచ మదిని
'మాతృసేవ' చేయు మనుజుండె మనుజుండు
కానివాడు మోక్షగామి కాడు
🙏నమో మాతృదేవో భవ🙏
✍️గోపాలుని మధుసూదనరావు🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి