12, మే 2024, ఆదివారం

శంకర జయంతి

 శంకర జయంతి 

           (జగద్గురు సంస్మరణ )


సీ. భరతఖండమ్మున భార్గవభూమిలో 

                భవ్య 'కాలడి' వద్ద ప్రభవమొంది

     అతిపిన్న వయసులో నాగమంబుల నేర్చి

                పలుశాస్త్రప్రతిభల పరిఢవిల్లి 

     యున్నతంబైనట్టి సన్న్యాసదీక్షను 

                గైకొని యతులందు గణుతి కెక్కి

     'గోవిందభగవాను' గురువరేణ్యుల వద్ద 

                ఛాత్రత్వమును పొంది సన్నుతి గని

      భగవానుడగు 'వ్యాసు' పరమాదరముతోడ 

                వేదభాష్యమ్ములు వెలువరించి 

      అఖిల నిగమసార మధ్యయనము జేసి

                'అద్వైతమతము' ను నవని కిచ్చి

తే. పెక్కు సంస్కృతకావ్యముల్ పెక్కు స్తుతుల 

      జగతి కందించి నట్టి యా జగతి గురువు

     'శంకరాచార్యు' మది నెంచి సన్నుతించి 

      భక్తి నర్పింతు శతకోటి వందనములు.        


తే. అఖిలశంకల గజమున కంకుశంబు

      భువినియద్ద్వైతసిద్ధికి బోధగురువు 

      ధరణివెల్గొందు శ్రీజగద్గురువునకును 

      శంకరుడెయైన శంకరాచార్యునకును 

      భక్తి తోడుత నతుడనై ప్రణతు లిడుదు.

                    🙏🙏🙏


✍️గోపాలుని మధుసూదనరావు🙏

కామెంట్‌లు లేవు: