5, మే 2024, ఆదివారం

ఇతిహాసాలు

 *📖 మన ఇతిహాసాలు 📓*


*కురుక్షేత్ర మహా సంగ్రామం - 5️⃣*



*యుద్ధ వ్యూహాలు*



యుద్ధ సమయంలో ఇరు పక్షాలూ తమ తమ సేనలను వివిధ వ్యూహాలలో సమాయత్తం చేసుకొన్నాయి. ఆ రోజు యుద్ధంలో సాధించ దలచిన లక్ష్యానికి అనుగుణంగాను, ఎదుటి పక్షం బలాబలాలను ఎదుర్కోవడానికి వీలుగాను ఈ వ్యూహాలు పన్నినట్లు అనిపిస్తుంది. ఈ వ్యూహాల పేర్లు ఆ వ్యూహాల స్వరూపానికి అనుగుణంగా జంతువులు లేదా వస్తువుల పేర్లతో ఉన్నట్లున్నాయి.


వ్యూహ రచన గురించి "డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జున రావు" ఇలా రాశాడు*


విశిష్టమైన సైన్య రచనా పద్ధతిని వ్యూహం అని వ్యూహ శాస్త్రనిపుణులు వివరిస్తారు. తమ సైన్యం తక్కువగాను, ఎదటి సైన్యం ఎక్కువగాను ఉన్నప్పుడు వ్యూహం బాగా ఉపయుక్తమవుతుంది. ఒకవేళ అధికంగా సైన్యం ఉన్నా ఒక కట్టుదిట్టమైన విధానంతో దీన్ని విస్తరింపచేస్తూ తక్కువ ప్రాణనష్టం జరిగేలా, విజయం తమకు దక్కేలా తగినట్లుగా వ్యూహాన్ని నిర్మించుకోవాలి. మహాభారత యుద్ధ సమయంలో క్రౌంచ వ్యూహం, గరుడ వ్యూహం, మకర వ్యూహం, కూర్మవ్యూహం, శకట వ్యూహం, సూచి, శ్యేన, వజ్ర, అచల, సర్వతోభద్ర, మండలార్థ, శృంగాటక ఇలా అనేకానేక రకాల పేర్లతో వ్యూహాలు రూపొందించారు. పశువులు, పక్షుల పేర్లతో రూపొందించే వ్యూహాలు నిజానికి ఆయా పశువులు, పక్షులు తమ శత్రువులతో ఎలా పోరాడితే గెలుస్తున్నాయో అటువంటి స్వభావాన్ని అంతటినీ వ్యూహ రచయిత సంపూర్ణంగా అవగతం చేసుకుంటాడు. అచలం అంటే పర్వతం, అచల వ్యూహమన్నప్పుడు ఒకచోట ఒక క్రమపద్ధతిలో కొండలాగా కదలకుండా సైన్యం ఉండి శత్రువును ఎదుర్కొంటుంది, మకర వ్యూహంలో మకరం అంటే మొసలి, మొసలి నోరుభాగం అతి భయంకరంగా ఉంటుంది. దీన్ని తలపిస్తూ మకర వ్యూహన్ని రూపుదిద్దుతారు. కూర్మం వీపు భాగం ఎంతో గట్టి కవచంలాగా ఉంటుంది. కూర్మవ్యూహం పన్నేటప్పుడు సైన్యంలో ప్రధానమైన వారికి ఎవరికీ దెబ్బతగలకుండా మిగిలిన సైనిక భాగాలన్ని రక్షక కవచంలాగా ఉంటాయి. శ్యేనం అంటే డేగ, డేగ కళ్ళు ఎంతో చురుకుగా ఉంటాయి. ఆ కళ్ళతోటే తనకు కావలసిన పదార్థాన్ని ఎంతో దూరం నుండి చూసి చాకచక్యంగా తన ఆహారాన్ని తన్నుకుపోతుంది. అలాగే శత్రుసైన్యాన్ని చిత్తు చేయటానికి ఈ వ్యూహాన్ని వాడతారు. క్రౌంచ పక్షి ముక్కు చాలా ధృడంగా ఉంటుంది. ఈ వ్యూహంలో ముక్కు భాగంలో ఉండే వారిని జయించటమంటే శత్రువు ఎంతో కష్టానికి గురికావలసి వస్తుంది. వ్యూహాలు పన్నటానికి తగిన సమయం, వాటికి సంబంధించిన విషయాలను శుక్రనీతిలో గమనించవచ్చు. నదులు, అడవులు, దుర్గాలు, తదితర ప్రాంతాలలో తమ సేనకు ఏదైనా ముప్పు వాటిల్లబోతుంది అని సేనాపతి భావించినప్పుడు సందర్భానికి తగిన వ్యూహరచన చెయ్యడం జరుగుతుండేది. సైన్యం ప్రయాణిస్తున్నపుడు అగ్రభాగంలో ఉన్న సైనిక బలానికి ప్రమాదం ఎదురవుతుందన్నప్పుడు మొసలినోరు భాగాన్ని పోలినట్లుగా మకర వ్యూహాన్ని పన్ని శత్రువును చిత్తు చేసేవారు. అవతల శత్రువు కూడా బలంగానే ఉంటే డేగను పోలిన శ్యేన వ్యూహాన్ని పన్నేవారు. శ్యేన వ్యూహం పన్నటానికి ఒకవేళ పరిస్థితులు అనుకూలించకపోతే సూదిలాగా ముందుకు దూసుకుపోయి శత్రువును నాశనం చెయ్యటానికి సూచీ వ్యూహాన్ని పన్నేవారు. అగ్రభాగాన కాక, వెనుక భాగంలో శత్రువు వల్ల ప్రమాదం కలుగుతుందనుకుంటే శకటం (బండ) లాగా వ్యూహారచన చేసేవారు. ముందూ వెనుకా కాక పక్క భాగాల నుండి ప్రమాదం ముంచుకొస్తుందనుకుంటే వజ్ర వ్యూహాన్ని అలా కూడా కాక నాలుగువైపుల నుండి శత్రువులు దాడి చేయబోతున్నారనుకున్నప్పుడు చక్రవ్యూహమూ భద్రం, వ్యాళం అనే పేర్లున్న వ్యూహాలను కానీ పన్నేవారు. ఈ వ్యూహాలలో కొన్ని శత్రువులను దెబ్బతీయడానికి ఉపయుక్తమయ్యేవిగా ఉండగా, మరికొన్ని తమను తాము కాపాడుకోవటానికి పనికొచ్చేవిగా ఉంటాయి. వ్యూహాలకు అందులో వుండే సైనికులకు ఎప్పటికప్పుడు సూచనలిస్తూ ముందుకు నడవటానికికానీ శత్రువును నిర్భయంగా ఎదుర్కోమని చెప్పటానికి కానీ, వెనక్కి తిరిగి రమ్మనమని చెప్పటానికి కానీ సంబంధిత నాయకులు యుద్ధ సమయంలో ఉపయోగంచే వాద్య పరికరాలను ఉపయోగించటం, రథానికున్న ధ్వజాలు, జెండాలతో సూచనలు చేయడం లాంటివి చేస్తుండేవారు. ఇలా వ్యూహారచనా విన్యాసాలు సమరకళలో ఆనాడు ఎంతో ప్రాధాన్యం వహిస్తుండేవి


*మిగతా భాగం రేపటి* *📖 మన ఇతిహాసాలు లో‌‌‌‌....📓*

కామెంట్‌లు లేవు: