30, ఆగస్టు 2024, శుక్రవారం

దేవాలయాలు - పూజలు 26*

 *దేవాలయాలు - పూజలు 26*


సభ్యులకు నమస్కారములు.


*నైవేద్యము - ప్రసాదములు 2*   ఆయా దేవాలయాలను బట్టి గాని భక్తులు వారి వారి గృహములలో అనుసరించు సంప్రదాయముల ప్రకారము నైవేద్య పదార్థాలు ఉండగలవు. శాఖాహారము కావచ్చును లేక మాంసాహారము కావచ్చును. సాధారణంగా శిష్టాచార  దేవాలయాలలో, గృహాలలో శాఖాహారమే నైవేద్యంగా ఉంటుంది. గ్రామ దేవతల గుడులలో కొన్ని ప్రత్యేక సమయాలలో,  దినాలలో మాంసాహార పదార్థాలు, వంటకాలు నైవేద్యంగా సమర్పించబడుతాయి.  భగవన్నివేదన చేసే నైవేద్యాలలో అత్యధిక శాతం శాఖాహారమే  ఉంటుందనుటలో సందేహము లేదు. గృహాలలో నైవేద్యంలో బెల్లము, కొబ్బెఱ మరియు నెయ్యికి అధిక ప్రాధాన్యత ఉంటుంది. 


*నైవేద్యాలలో వివిధములు*

1) ఫలములు:-  కదళీ ఫలము = అరటి పండు, కాశ్మీర ఫలము = సేపు పండు, అమలకం = ఉసిరి పండు, శుష్క ద్రాక్ష = ఎండు ద్రాక్ష, కిస్ మిస్,  నారికేళ ఖండ ద్వయం = కొబ్బరి చిప్పలు, భాగాలు, మాది ఫలం= దబ్బ పండు ఇత్యాది.

2) *నిత్య దినుసులు* 

1) శర్కర = చక్కర, 2) మధు = తేనె, 3) క్షీరం = పాలు, 4) దధి= పెరుగు, 5) పృథక్ = అటుకులు, 6) నవ నీతం = వెన్న, 7) గుడం = బెల్లం మున్నగునవి.

3) *విశేష నివేదనములు*

1) ప్రుథక్ పాయస = అటుకుల పాయసం, 

2) స్నిగ్ధౌధనం = తెల్లటి అన్నము, 

3) మరీచ్యన్నము = కట్టు పొంగలి,

 4) సపాదక భక్షం = గోధుమనూక ప్రసాదం, 

5) క్షీరాన్నం= పరమాన్నం, 

6) చిత్రాన్నం = పులిహోర,  

7) దధ్ధ్యోజనం=పెరుగన్నం

8) కదంబం= కూరగాయలతో కలసిన పులుసన్నం...ఇంకా ఎన్నెన్నో....


*కొన్ని నియమాలు*

1) దేవాలయాలలో  మరియు గృహాలలో తప్పనిసరిగా ఇంటి వంటకాలనే నైవేద్యంగా సమర్పించాలి.

2) ముఖ్యంగా  గడప దాటి వచ్చిన ఆహార పదార్థాలు, వంటకాలు భగవత్ నివేదనకి పనికి రావు ,అర్హత ఉండదు. చాల మంది భక్తులు  తీపి పదార్థాలు (Sweets) అంగడి (Shops) లో కొనుగోలు చేసి దేవాలయాలలో ఇస్తూ ఉంటారు. *ఆ పదార్థాలు అనేకానేక అశౌచములకు గురియై ఉంటాయి,.... ఉండవచ్చును*. 

3) *ద్రవ్యశుద్ధి ముఖ్యము*. నైవేద్య పదార్థాలు సక్రమార్జితమా, , అక్రమార్జితమా లేక హింసా మార్గ  ఆర్జితమా అను విచక్షణ ఆలయ యాజమాన్యానికి, అర్చక స్వాములకు మరియు గృహస్థులకు ఉండాలి. ద్రవ్య శుద్ధి లోపించిన,  దోష మార్గాన ఆర్జిత వస్తువులు భగవత్ నివేదనకు అనర్హము.

4) నైవేద్య ఆహారాలలో ఉల్లి, వెల్లుల్లి, పుట్ట గొడుగులు, ఇతర మసాలా *తామస* ఆహారమూలాలు ఉన్న పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ దేవాలయాలలో అర్చక స్వాములు, గృహాలలో గృహస్థులు వాడరాదు. 

5) నైవేద్య పదార్థాలను భగవన్ సమర్పణకు ముందు దేవాలయాలలో అర్చక స్వాములు, గృహాలలో గృహస్థులు రుచి చూడరాదు. 

భగవన్నామ జపము/నామ సంకీర్తన చేస్తూ వంట చేయాలి... పవిత్ర హృదయం తో నైవేద్యాలు తయారు చేయబడాలి.

6) *భక్తులు, గృహస్థులు ప్రసాదం పుచ్చుకున్న తదుపరి, "కుడి చేతి" లో ఉన్న ప్రసాదమును "ఎడమ చేతిలోకి" మార్చుకుని నెమ్మదిగా ప్రసాదమును ఆరగింపవలెను*. కుడి చేతిలోని ప్రసాదమును కుడి చేతితోనే గబుక్కున *పక్షి లాగా తినకూడదు*.


పూజలు మరియు వ్రతాలలో  తీర్థ ప్రసాదాలు, హోమ  యజ్ఞ యాగాదులులలో హవిస్సులు భగవంతునికి  కృతజ్ఞతా పూర్వకంగా  అర్పించడం, సమర్పించడం ద్వారా దేశ కాల పరిస్థితులే గాకుండా అర్పించిన  భక్తులకు ఈ జన్మలోనే గాకుండా వంశం యావత్తులో ఏ లోటూ రాకుండా ఆ పరమాత్మ చూసుకుంటాడు. భగవంతుని తీర్థ ప్రసాదాల సమర్పణలోనూ, పుచ్చుకునుటలోనూ నిర్లక్ష్యము కూడదు. 


ధన్యవాదములు.

*(సశేషం)*

కామెంట్‌లు లేవు: