30, ఆగస్టు 2024, శుక్రవారం

హిమగిరి సొగసులు

 హిమగిరి సొగసులు

          

   ----------------------------- 


           చం: " అటజని గాంచె , భూమిసురుఁ డంబర చుంబి శిరస్సర ఝ్ఝరీ


                        పటల ముహుర్ముహుర్లుట దభంగ తరంగ మృదంగ నిస్వన  


                        స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్


                        దటక చరత్కరేణు కర కంపిత సాలము, శీత శైలమున్ ;

              

                             మనుచరిత్రము- అల్లసాని పెద్దన! 


              హిమాలయమును వర్ణించు అద్భుతమైన యీపద్యము పెద్దన గారిది. ఆంధ్ర కవితా పితామహునిగా, తొలిప్రబంథనిర్మాతగా, రాయలచే గండపెండేరమును దొడిగించుకొనిన కవిపుంగవునిగా పెద్దన ప్రశస్తినందినవాడు.

వయసా,వచసా ,వర్ఛసా పెద్దన పెద్దయే! వర్ణనల లోనేగాక కథాకథనమున సిధ్ధహస్తుడు. " అల్లసానివాని యల్లిక

జిగిబిగి "- యను ప్రశంస యతని గొప్పతనమునకు ప్రతీక!


                     అరుణాస్పద నగరమున ప్రవరుడను నాహితాగ్ని వసించును. అతనికి తీర్థయాత్రపై మక్కువ.కానీ

తీరికయేలేదు. ఒకనాడు అతిథిగా వచ్చిన సిధ్ధుని వలన పాదలేపనమును పొంది, ఆకాశగమనమున హిమగిరి

కరుదెంచెను.


             కం: ఆమందిడి యతడరిగిన


                  భూమీ సురుఁడేగె, తుహిన భూధర శృంగ


                  శ్యామల కోమల కానన  


                 హేమాఢ్య దరీ ఝరీ నిరీక్షా పేక్షన్; 


                          ఆతరువాతి పద్యమిది. కొంచెం అర్ధం వివరిస్తా!  


               అర్ధ వివరణము: భూమిసురుడు- బ్రాహ్మణుడు (ప్రవరుడు) అంబరచుంబి- ఆకాశమును ముద్దిడుచున్న; శిరత్- శరసులనుండి (శిఖరములనుండి) ఝరీ- కొండకాలువలయొక్క; పటల- సముదాయముపు: మహుర్ముహుః- మాటిమాటికి

లుఠత్- క్రిందకు జారిపడు; అభంగ- విరుగని; తరంగ- కెరటములను; మృదంగ- మద్దెలలయొక్త ; నిస్వన- ధ్వనులకు; నటనానుకూల-

నాట్యానుకూలముగా; స్ఫుటత్-స్పష్టపడుచున్న; పరిఫుల్ల- బాగుగా విప్పుకొన్న ;కలాపి- నెమళయొక్క; కలాపిజాలమున్: పింఛముల

సముదాయములు గలదానిని, తటక: కొండ చఱియలయందు; చరత్-తిరుగాడు; కరేణు- ఏనుగుల; కర-తొండములచే;కంపిత- వంపబడుచున్న ;సాలమున్-మద్దిచెట్లు గలదియు అగు; శీతశైలమున్: హిమగిరిని:; అటజని- అటకుబోయి; కాంచెన్-చూచెను.


          భావము: పాద లేపనం సాయంతో యెగిరి వచ్చిన ప్రవరుఁడు. హిమాలయ పర్వతమును జూచాడు. అదియెలావుంది?

చాలాయెత్తుగా ఉంది. దానిశిఖరాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఆగిరి శిఖరమునుండి కొండకాలువలు క్రిందకు జారిపడుతున్నాయి. ఆప్రవాహాల మ్రోతలు మద్దెలల ధ్వనుల ననుకరిస్తున్నాయి. ఆధ్వనుల కనుకూలంగా నెమళ్ళు పురులు విప్పి నాట్యం చేస్తున్నాయి. ఆకొండ చఱియలలో విస్తారంగా ఏనుగులున్నాయి. అవి అక్కడి మద్దిచెట్ల కొమ్మలను తొండములతో వంచి ఆకులను మేస్తున్నాయి. 


                          ఇదీ మంచుకొండ దృశ్యము! ఈదృశ్యాన్ని కవితా కమనీయంగా పెద్దన వివరించిన తీరు అద్భుతమైనది.

           

           " అంబరచుంబి.......... 

 ఇత్యాదిగా నారంభమైన యా సుదీర్ఘసమాసము హిమాలయముల ఉన్నతికి నిదర్శనము. కొండ శిఖరములనుండి సెలయేటి ప్రవాహ ములు జాలువారుట, మిగుల సుందరతర దృశ్యము. సెలయేటి మ్రోతలు మద్దెల ధ్వానముల నుపమించుట,తదనుగుణముగా నెమలి గుంపులయాటలు మంజుల మనోహర దృశ్యములు. కొండచఱియలలో యేనుగులు విహరించుట ఆహిమగిరి శక్తికి నిదర్శనము. మద్దివృక్షముల కొమ్మలను వంచుట ఇత్యాదులు అచటి వృక్షసంపదకు సంకేతము. 


                         కొండలయున్నతి ఆకాశమంటుట చే నతిశయోక్తియు, అభంగతరంగముల ధ్వానము మద్దెలమ్రోతలపై నారోపణము చేయుట చే రూపకము, వెరసి "రూపకాను ప్రాణిత అతిశయోక్తి యలంకారము"- ఇందుచెప్పబడినది.


                     అసమాన మైన పదాడంబరము, సుదీర్ఘసమాసములు, పాఠకుల కలవిగాని యానందాశ్చర్యములను కలిగించు

చున్నవి గదా! ఇదీ పెద్దన గారి వర్ణనలోని గొప్పదనము!


                                                                        స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

కామెంట్‌లు లేవు: