27, ఆగస్టు 2024, మంగళవారం

శ్రీకృష్ణుడు

 శ్రీకృష్ణుడు స్త్రీలోలుడు...

శ్రీకృష్ణుడు అధర్మవాది...

శ్రీకృష్ణుడు మాయలమారి..

శ్రీకృష్ణుడు ...ఎన్నో... ఎన్నెన్నో ఊహలలో అందరికీ అందినవాడు...

శ్రీకృష్ణుని గురించిన పలురకాల ఊహలు అభిప్రాయాలు, నిందలు, శిలాశాసనాలు...

ఎవరి చిత్తానికి వచ్చిన భావనలో వారు ఆ శ్రీకృష్ణుడిని చిత్రించుకున్నారు.

శ్రీకృష్ణ తత్త్వాన్ని అర్థం చేసుకున్న కొందరు ఆయన లీలలను ఆస్వాదించారు

ఆయన అంటే ఏమిటో బోధపరచుకున్నారు... 

          ఏయే వేళల నే సరోజముఖి యేయే లీలలం గోరు దా

        నాయా వేళల నా సరోజముఖి నాయాలీలలం దేల్చి, యే

       చాయం జూచిన దానయై మెలగుచున్సౌఖ్యాబ్ధినోలాడు భో

  గాయత్తుండయి పెక్కురూపముల మాయా కల్పనా చాతురిన్‌. 

                                                                                (పారిజాతాపహరణం ప్ర.ఆ.40)

       ‘‘ ద్వాపర యుగంలో స్త్రీలందరూ శ్రీకృష్ణునే తమ భర్తగా కావాలని కోరుకుంటే ఆ లీలామానుష విగ్రహుడు వారు కోరిన రూపాలలో వారికి దర్శనమిచ్చాడు. ఏ వేళలో ఏ స్త్రీ తనను ఏవిధంగా చూడాలనుకుందో, ఆయా రూపాలలో ప్రత్యక్షమయ్యాడు కృష్ణుడు. ‘తానే అంతటా’ అన్నట్టుగా అందరికీ సౌఖ్యం కల్పించాడు. అనేక రూపాలను ఒకేసారి చూపిన మాయా కల్పనాచతురుడు,’’ అని నంది తిమ్మన పారిజాతాపహరణంలో శ్రీకృష్ణుని ఔన్నత్యాన్ని వర్ణించాడు. 

పారిజాత పుష్పం విషయంలో సత్యభామకు వచ్చిన కోపాన్ని పాద తాడనంతో చూపింది. అది కూడా బ్రహ్మ, ఇంద్రాదుల చేత పూజలందుకునే ఆ జగన్నాథుని మీద ప్రదర్శించింది. అయినా ఆయనకు కించిత్తు కోపం కూడా కలగలేదు. పైగా.. తన కఠిన వక్షస్థలాన్ని తాకిన సత్యభామ లేత పాదం కందిపోయిందేమో చూడమని లాలనగా పలికాదు. ఇతరుల మనసును నొప్పించలేని శ్రీకృష్ణుడు తనను నిందించిన వారిని సైతం క్షమించే గుణం కలవాడు. అంతటా తానే అనే విషయాన్ని నిరూపించడానికే గీత ప్రబోధించాడు. మీరా వంటి భక్తురాలిని తనలో ఐక్యం చేసుకున్నాడు. పెంచిన తల్లి యశోదకు తన ముద్దుముద్దు మాటలతో, చేష్టలతో ఆనందాన్ని కలిగించాడు. కన్నతల్లిదండ్రులయిన దేవకీ వసుదేవులను చెర నుండి విడిపించాడు. కంస సంహారం చేశాడు. చీరలిచ్చి ద్రౌపది మానం కాపాడాడు. అర్జునునికి భగవద్గీత బోధించాడు. కర్మసిద్ధాంతాన్ని జాతికి అందించాడు. ధర్మహాని జరిగిన ప్రతి చోటా ధర్మాన్ని నిలబెట్టాడు. ఎక్కడ ఎప్పుడు తన అవసరం ఉందో అక్కడ అప్పుడు ఆ విధంగా ప్రత్యక్షమయ్యాడు. అందుకే శ్రీకృష్ణుడు జగద్గురువు అయ్యాడు. 

                                                                           డా. పురాణపండ వైజయంతి

కామెంట్‌లు లేవు: