27, ఆగస్టు 2024, మంగళవారం

దేవాలయాలు - పూజలు 23*

 *దేవాలయాలు - పూజలు 23*


6) *తీర్థము* :- తీర్థం అంటేనే తరింపజేసేది అని అర్థము. భగవంతునికి ఆరాధనా పూర్వకంగా పంచామృత స్నాన/ అభిషేక గంగనే (జలము) తీర్థం కాబట్టి ఈ పావనోదకము ప్రభావ మరియు ఔషధ గుణాలు/శక్తులను కల్గి ఉంటుంది. ఈ తీర్థం మహిమాన్విత మంత్ర సంయుక్తం కూడా. స్వీకరించిన వారికి సర్వ శుభాలను అందజేస్తుంది. గత వ్యాసాలలో వివిధ తీర్థముల గురించి తెలుసుకునియున్నాము. మరొకసారి పునశ్చరణ.... *పంచామృత అభిషేక తీర్థం, పానక తీర్థం, జల తీర్థం, కషాయ తీర్థం,తులసి తీర్థం, బిల్వ తీర్థం, పచ్చ కర్పూరం తీర్థం*. తీర్థ సమయంలో ఒక్కొక్క సారి అర్చక స్వాముల వారు పాలు మరియు పెరుగు కూడా అందజేస్తారు. పూజాదికాల అనంతరం తీర్థ గ్రహణ వలన, గ్రహించిన వారిలో ఆరోగ్యపరమైన ప్రయోజనాలతో పాటు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. 


భగవత్ పరమైన కార్యక్రమాలన్నియు నియమ నిష్ఠలతో మరియు నియమాలతో కూడి శాస్త్ర మరియు జ్ఞాన పరంగా ఉంటాయి, *భక్తులు పాటించవలసి ఉంటుంది*. శాస్త్ర మరియు జ్ఞాన పరంగా ఉంటాయి కాబట్టి అవి భక్తులకు హిత కరములే. భక్తులు గమనించాల్సింది *అన్నిటికంటే "భక్తి" ప్రధానం*


*నియమాలు*

1) *సావధానంగా*:- పూజల అనంతరము మాత్రమే తీర్థమును ప్రశాంతంగా, సావధానంగా భక్తి శ్రద్ధలతో స్వీకరించాలి. అవతల పనులున్నాయని అర్చక స్వాముల వారిని ఇబ్బంది పెట్టీ, బలవంత పెట్టీ, పూజ మధ్యలోనే తీర్థము కోరరాదు, పుచ్చుకోరాదు. సాధారణంగా గృహాలలో ఈలా జరుగుతూ ఉంటుంది.

2) తీర్థం తీసుకును నప్పుడు భక్తులు చేతిని గోకర్ణ (గోవు చెవి) ముద్ర వేసి అనగా ఈ ముద్రలో బొటన వేలు చూపుడు వేలును అంతర్ మడతతో నియంత్రిస్తుంది. చివరి మూడు వేళ్ళు మాత్రం ముందుకు సాగి ఉంటాయి. తీర్థము మినప గింజ పరిమాణంలో తీర్థము జాగ్రతగా పుచ్చుకోవాలి.

ఇందుకు శాస్త్ర ప్రమాణం..

*గోకర్ణాకృతి హస్తేన మాష మగ్న జలం పిబేత్* దేవాలయంలో గాని గృహంలో గాని పూజానంతరమే తీర్థం స్వీకరించాలి. *వాయు ముద్ర* లో తీర్థము సాధారణంగా పుచ్చుకోన రాదు, నిషిద్ధము. వాయు ముద్ర అంటే కుడి అరచేతిని మొత్తము వెడల్పుగా చాపడము. అలవాటుగానో, పొరపాటుగానో *వాయు ముద్ర* లో తీర్థం పుచ్చుకుంటే ఆ ప్రభావాలు వేరుగా ఉంటాయి.


3) *తీర్థం ఎన్ని సార్లు*:- దేవాలయంలో అవుతే ఒకసారి మాత్రమే. పూజలు నిర్వహించ బడిన గృహంలో...ఆ గృహంలోనే భోజనం చేసే అవకాశం, అవసరం ఉంటే.. తీర్థం *ఒకేమారు* పుచ్చుకోవాలి. ఆ గృహంలో భోజనం చేసే అవకాశం లేకుంటే తప్పనిసరిగా *మూడు సార్లు* తీర్థం స్వీకరించాలి. తీర్థం మూడు మార్ల విశిష్టత గూడా తెలియజేయ బడినది. *మొదటి* సారి పుచ్చుకున్నపుడు శారీరక, మానసిక శుద్ధి జరుగుతుంది.

*రెండవ సారి* పుచ్చుకున్నప్పుడు న్యాయ మరియు ధర్మ ప్రవర్తనలు అబ్బుతాయి.

*మూడవ సారి* పవిత్రమైన పరమేశ్వరుని పరమ పదం దక్కుతుందని పెద్దల విశ్వాసం.

మూడు సార్లు శ్రద్ధ, భక్తి, నియమ, నిష్ఠలతో తీర్థం పుచ్చుకుంటే భోజనము చేసినంత ఆత్మ నిబ్బరం లభిస్తుందని భక్తుల విశ్వాసము.

4) *ఉపవాస తదనంతరం* 

ఏకాదశి మరియు మిగతా పర్వ దినాల సందర్భంగా... ఉపవాసం ఉన్న మరుసటి ఉదయమే ఒకసారి తీర్థం పుచ్చుకోవాలి. *ఈ చర్య ఉపవాస దీక్ష ఉపసంహరణ (ముగింపు) ను తెలియజేస్తుంది*.

5) *తీర్థం స్వీకరణ* :- 

భక్తులు నుదుట తిలకము, విభూతి, కుంకుమ, చందనము ఇత్యాది మంగళకర లేపనములు లేకుండా తీర్థము స్వీకరించరాదు. 

తీర్థం కుడి చేతితో స్వీకరించాలి. నోటి వెంట శబ్దము కాని *జుఱ్ఱు* మని చప్పుడు రాకూడదు. ఆ వెంటనే తలపై చేతిని అద్దుకో రాదు, తుడుచుకోరాదు. తీర్థము గ్రహించునప్పుడు పై కండువా, ఉత్తరీయము, చేతి రుమాలు, మహిళలు అవుతే చీర చెంగును, బాలికలవుతే ఓణీని గాని హస్తము దిగువన ఉంచి తీర్థము తీసుకొన వలసి ఉన్నది, ఉంటుంది కూడా. తీర్థము ఒక చుక్క కూడా నేలపై పడరాదు. *గమనిక* అర్చక స్వాములు భక్తులకు తీర్థము ఇచ్చినప్పుడు యథాలాపంగా, అన్యమనస్కులై, ఇతరులతో సంభాషించుచూ అశ్రద్దగా *ఉండరాదు* తీర్థము చేతిని నీటితో శుభ్రం గాని అందుబాటులో ఉన్న వస్త్రంతో గాని శుభ్రపర్చాలి. తలకు తీర్థమును అద్ద రాదను నియమానికి పెద్దలు తెలియజేసిన రెండు కారణాలు. మనుష్యులు తలపై బ్రహ్మ దేవుడు పరివేష్టించి ఉండడం. మరియొకటి తీర్థము భక్తులకు అందించిన పిదప అర్చక స్వాముల వారు శఠారిని భక్తులపై తలపై ఉంచి భగవత్ అనుగ్రహము కల్గిస్తారు. శఠారి అంటే భగవత్ పాదములు. తీర్థము పుచ్చుకున్న *ఎంగిలిని* బ్రహ్మ దేవుల వారికి మరియు భగవత్ పాదములకు *అంటించ రాదు*. 

6) *తీర్థ విశిష్ట సంప్రదాయము*. సాధారణంగా దేవాలయాలలో/పూజల సంప్రదాయములతో పరిచయమున్న భక్తులు, తీర్థ స్వీకరణ సమయంలో పుచ్చుకునేటప్పుడు మొదటి సారి *కేశవాయ స్వాహా* అని, రెండవ సారి *నారాయణాయ స్వాహా* అని మూడవ సారి *మాధవాయ స్వాహా* అని ఉచ్చరించడం ఆనవాయితి. ఇంకా ఇంకా విశిష్ఠులు పుచ్చుకునే విధానంలో *బ్రహ్మ తీర్థ, దేవ తీర్థ, ఋషి తీర్థ మరియు పితృ తీర్థ* పద్ధతులు పాటిస్తారు.


ధన్యవాదములు

*(సశేషం)*

కామెంట్‌లు లేవు: