25, సెప్టెంబర్ 2020, శుక్రవారం

15-05-గీతా మకరందము

 

         పురుషోత్తమప్రాప్తియోగము

       

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అవతారిక - నాశరహితమగు అట్టి పరమాత్మపదమును ఎవరు పొందగలరో వచించుచున్నారు -

 

నిర్మానమోహా జితసఙ్గదోషా

అధ్యాత్మనిత్యా వినివృత్తకామాః | 

ద్వన్ద్వైర్విముక్తాః సుఖదుఃఖసంజ్ఞైః 

గచ్ఛన్త్య మూఢాః పదమవ్యయం తత్ || 

 

తాత్పర్యము:-అభిమానము (లేక, అహంకారము) అవివేకము లేనివారును, సంగము (దృశ్యపదార్థములం దాసక్తి) అను దోషమును జయించినవారును, నిరంతరము ఆత్మజ్ఞానము (బ్రహ్మనిష్ఠ) గలవారును, కోరికలన్నియు లెస్సగ (వాసనాసహితముగ తొలగినవారును, సుఖదుఃఖములను ద్వంద్వములనుండి బాగుగ విడువబడినవారును అగు జ్ఞానులు అట్టి అవ్యయమగు బ్రహ్మపదమును (మోక్షమును) బొందుచున్నారు.


వ్యాఖ్య:- పునరావృత్తిలేని శాశ్వతబ్రహ్మపదమును (మోక్షమును) ఎవరు పొందగలరో ఈ శ్లోకమునందు చక్కగ నిరూపింపబడినది. ఆఱు సల్లక్షణములు గలవారు అట్టి మహోన్నతపదవిని జేబట్టగలరు. అవి యేవి యనిన -

(1) అభిమాన, అవివేకరాహిత్యము.

(2) సంగమును దోషమును జయించుట - (సంగమనగా దృశ్యపదార్థములందు ఆసక్తి, అసంగమనగా అది లేకుండుట, వానితో అంటకనుండుట).

(3) నిరంతరము ఆత్మయందు నిష్ఠగలిగియుండుట. ఇచట నిరంతరము (నిత్యాః) అను పదము గమనింపదగినది. ఏదియో యొక కాలమున దైవచింతన చేయుట మంచిదేకాని, అది చాలదు, క్రమక్రమముగ ఆ దైవనిష్ఠాసమయమును పెంచుకొనుచుపోయి 'నిరంతర దైవనిష్ఠ’ యను స్థితిని జేరుకొనవలయును. ఏలయనిన, దైవభావమను ప్రకాశము లేనిచో మాయయను అంధకారము వెంటనేవచ్చి అలముకొనును. అత్తఱి మహాప్రమాదము సంభవించును. కావున నిరంతర అధ్యాత్మనిష్ఠద్వారా మాయకు ఒకింతేని అవకాశమీయక నుండవలెను. ప్రపంచములో మూడురకముల జనులుందురు. కొందఱు అహర్నిశము ఆత్మస్థితిని, దైవభావమును గల్గియుందురు. వీరు ఉత్తములు. మఱికొందఱు కొద్దిసేపు దైవచింతనగలిగి తదుపరి ప్రాపంచిక కార్యకలాపములయందు నిమగ్నులగుదురు. వీరు మధ్యములు, సాధనాతిశయముచే వీరు మొదటితరగతికి క్రమముగ జేరుకొనగలరు. ఇక నిరంతరము దృశ్యపదార్థవ్యామోహములోనే కొట్టుకొనుచు దైవస్మరణ ఒకింతైనను లేనివారు కనిష్ఠులు. ఈ స్థితి నింద్యము, గర్హితము అయియున్నది. కావున వివేకవంతు లిద్దానిని త్యజించవలయును.

  (4) ఇక మోక్షపదప్రాప్తికి ఆవశ్యకమైన నాల్గవ సుగుణము కోరికలను సంపూర్ణముగ, వాసనాసహితముగ తొలగించుట (వినివృత్తకామాః). "నివృత్త” అని చెప్పక "వినివృత్త” అని చెప్పుటవలన కోరికలన్నియు నిశ్శేషముగ, సమూలముగ (వాసనాసహితముగ) తొలగిపోవలెనని భావము.


 'అధ్యాత్మనిత్యా వినివృత్తకామాః’ అను ఈ శ్లోకపాదమును ముముక్షువులు సదా స్మరించుచుండుట మంచిది. ఏలయనిన ఆధ్యాత్మిక సాధనసర్వస్వమంతయు ఈ రెండు పదములలోనే ఇమిడియున్నది. మొదటిది తత్త్వజ్ఞానము (అధ్యాత్మనిత్యాః), రెండవది వాసనాక్షయము" (వినివృత్తకామాః). మొదటిది దృక్ - స్వరూపస్థితి. రెండవది దృశ్యరాహిత్యము. ఈ రెండిటిని సాధకుడు ఏకకాలములో అభ్యసించుచురావలెనని శాస్త్రము లుద్ఘోషించుచున్నవి.

          (5) ఇక ఐదవసాధన సుఖదుఃఖాది ద్వంద్వరాహిత్యము.

(6) ఆఱవది అమూఢత్వము. అనగా అజ్ఞానము లేకుండుట. అజ్ఞానమును, అవిద్యను దరికిచేరనీయక, జ్ఞానమందే సదా నిలుకడగలిగియుండుట. ఈ ప్రకారముగ భగవానుడు తెలిపిన ఆఱుసాధనలను చక్కగ అవలంబించువారు పొందునట్టి మహత్తర ఫలితమేది? అవ్యయమగు మోక్షమే (గచ్ఛన్తి పదమవ్యయమ్). ప్రపంచములోని పదవులన్నియు వ్యయములు, నాశవంతములు క్షయిష్ణువులు. పరమాత్మపదవి యొక్కటియే అవ్యయమైనది. శాశ్వతమైనది. తరుగులేనిది. కావున విజ్ఞులెల్లరును అద్దానినే అన్వేషింపవలయును.


ప్రశ్న:- పరమాత్మపద మెట్టిది?

ఉత్తరము:- అవ్యయమైనది. నాశరహితమైనది. 

ప్రశ్న:- దాని నెవరు, పొందగలరు? 

ఉత్తరము:- (1) అభిమానము అవివేకము లేనివారు (2) సంగము (దృశ్య వస్తులం దాసక్తి) అను దోషమును జయించినవారు (3) నిరంతరము ఆత్మస్థితియందుండువారు తో(4) కోరికలను పరిపూర్ణముగ (వాసనాసహితముగ) తొలగించినవారు (5) సుఖదుఃఖాది ద్వంద్వములనుండి విడువబడినవారు (6) మూఢత్వము (అజ్ఞానము) లేనివారు - ఈ ప్రకారములగు ఆఱుసల్లక్షణములుగలవారు-పరమాత్మపదమును (మోక్షపదవిని) పొందగలరు.

కామెంట్‌లు లేవు: