25, సెప్టెంబర్ 2020, శుక్రవారం

పోత‌న త‌ల‌పులో....63

                                                                                                                                                                                                                                                  

త‌ల్లిదండ్రుల‌వ‌ద్ద సెల‌వు తీసుకుని అక్క‌డి నుంచి కృష్ణ‌ప‌ర‌మాత్మ‌,

 పదహారువేల నూటయెనిమిది స్వర్ణ సౌధాలతో కూడిన అంతఃపుర ప్రాంగణంలోకి ప్రవేశిస్తున్నాడు.

                         ***

ఒక భామాభవనంబు మున్నుసొర వేఱొక్కర్తు లోఁగుందునో

సుకరాలాపము లాడదో సొలయునో సుప్రీతి వీక్షింపదో

వికలత్వంబున నుండునో యనుచు నవ్వేళన్ వధూగేహముల్

ప్రకటాశ్చర్యవిభూతిఁ జొచ్చె బహురూపవ్యక్తుఁడై భార్గవా!

        ***

భృగువంశోద్భవుడవైన శౌనకా!

 ముందుగా ఒక సతి మందిరానికి వెళ్తే వేరొకామె కృంగిపోతుందేమో; తొందరపాటుతో సరిగా మాట్లాడదేమో; సొక్కిపోతుందేమో; ప్రేమతో వీక్షించదేమో; వైకల్యం వహిస్తుందేమో అని ప‌రిపరివిధాల అనుకుంటూ అందరు భార్యల గృహాలలోకి అన్ని రూపాలు ధరించి అత్యద్భుతమైన మహిమతో ఒకేమారు ప్రవేశించాడు కృష్ణ‌ప‌ర‌మాత్మ‌.

                   **

శిశువులఁ జంకలనిడి తను

కృశతలు విరహాగ్నిఁ దెలుప గృహగేహళులన్

రశనలు జాఱఁగ సిగ్గున

శశిముఖు లెదురేఁగి రపుడు జలజాక్షునకున్.

                 ***

 ఆ స‌మ‌యంలో, ఆ చంద్రముఖు లందరు చంటిబిడ్డలను చంకలలో ఎత్తుకొని, విరహతాపంవల్ల చిక్కిపోయిన శరీరాలతో, దిగ్గున లేచి సిగ్గుతో కృష్ణ‌య్య‌కు ఎదురువచ్చారు.

                ***


"పతి నా యింటికి మున్ను వచ్చె నిదె నా ప్రాణేశుఁ డస్మద్గృహా

గతుఁడయ్యెన్ మును సేరెఁ బో తొలుత మత్కాంతుండు నా శాలకే

నితరాలభ్య సుఖంబు గంటి, నని తారింటింట నర్చించి ర

య్యతివల్ నూఱుఁబదారువేలు నెనమం డ్రవ్వేళ నాత్మేశ్వరున్.

              ***

పదహారువేల నూట యెనిమిదిమంది రమణీమణులు”యిదుగో నా భర్త తొట్టతొలుత నా యింటికే వచ్చాడు. నా మనోనాథుడు ముందుగా నా గృహంలోనే అడుగుపెట్టాడు. నా ప్రాణేశ్వరుడు నా మందిరానికే ముందుగా చేరాడు. అనన్య సామాన్యమైన ఆనందాన్ని నేనే పొందాను” అనుకొంటూ ఇంటింటా తమ ఆత్మేశ్వరుణ్ణి ఆర్చించారు. పొంగిపోయారు.


🏵️పోతన ప‌ద్యం🏵️

🏵️ప్రేమ‌ర‌సం🏵️

కామెంట్‌లు లేవు: