🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
*****
*శ్లో:- చితా చింతా ద్వయో ర్మధ్యే ౹*
*చింతా నామ గరీయసీ ౹*
*చితా దాహతి నిర్జీవమ్ ౹*
*చింతా ప్రాణయుతం వపు: ౹౹*
*****
*భా:- "చిత" అంటే చితి అని; "చింత" అంటే విచారము అని అర్థం. ఈ రెంటికి మధ్య "సున్న" మాత్రమే తేడా. మనిషి సజీవంగా ఉంటే "శివం" అని ; నిర్జీవంగా ఉంటే "శవం" అని లోక వ్యవహారము . "చితి" అచేతనమైన కళేబరాన్ని మాత్రమే కాల్చివేస్తుంది. ఇక "చింత" అనేది ముప్పూటా అన్నపానీయాలు సేవిస్తూ, అన్ని పనులు మానుకొని, సంసార సమస్యలతో సతమతమవుతూ, అదేపనిగా పరిష్కార మార్గాలు వెతుకుతూ, దిగులు పడేవాడిని ప్రాణాలు ఉండగానే నిలువునా కాల్చివేస్తుంది. దానితో ఆ వ్యక్తి చిక్కి శల్యమై, నీరసించి, కృంగి, కృశించి నశిస్తాడు. కాన అయినదానికి, కానిదానికి దిగులు పడకూడదు. ప్రతి చిన్న విషయానికి ఒత్తిడికి గురియై , డీలాపడి పోవడం నేటి తరానికి పరిపాటి. దశరథు డంతటి వాడు రాముని ఎడబాటుకు దిగులు పడి, అసువులు బాయడం చారిత్రక ప్రసిద్ధమే కదా! పైగా "చితి" ఒకేసారి కాల్చగా, "దిగులు" అనుక్షణం, అనునిత్యం, అణువణువునా మనిషిని వెన్నాడి కాల్చి చంపుతుంది. కాన "చితి" కంటే "చింత"యే బలీయము, ప్రమాదకరము, వినాశకరము అని చెప్పక తప్పదు. తన సుఖమే స్వర్గమని, తన దుఃఖమే నరకమనే శతకకర్త తీర్మానము అక్షరసత్యము. సుఖదుఃఖాలలో సంయమనం అలవరచుకోవాలని సారాంశము*.
*****
*సమర్పణ : పీసపాటి*
🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి