25, సెప్టెంబర్ 2020, శుక్రవారం

మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..

 

రక్షణ..సంరక్షణ.


"అయ్యా!..గర్భగుడి మంటపం చుట్టూరా గ్రిల్లు పెట్టిస్తే బాగుంటుంది..ఒక్కొక్కసారి అందరూ నేరుగా ఇక్కడకు వచ్చేస్తున్నారు.. ఇబ్బందిగా ఉంటోంది..శని ఆదివారాల్లో తాళ్ళు కడుతున్నాము..మిగిలిన రోజుల్లో నియంత్రణ లేకుండా ఉంది..ఏదో ఒక శాశ్వత ఏర్పాటు చేసుకోవాలి..మీరొక్కసారి ఆలోచన చేయండి.." అని మా సిబ్బంది నాతో చెప్పారు..నిజమే..గర్భగుడి చుట్టూరా ఎటువంటి రక్షణా లేదు..కానీ సుమారు లక్ష రూపాయల వ్యయం తో కూడుకున్న పని..సమకూర్చుకోవాలి.. సమయం పడుతుంది..ఆ మాటే వాళ్ళతో చెప్పి..తాత్కాలిక ఏర్పాటు గురించి ఆలోచన చేద్దామని అనుకున్నాము..ఇది జరిగింది 2009 వ సంవత్సరం జూన్ నెలలో ఒకరోజు..ఆరోజు గురువారం..


ఆ ప్రక్క ఆదివారం నాడు..ఎప్పటిలాగానే గర్భగుడి చుట్టూరా తాళ్లతో కట్టి..అందరూ లోపలికి రాకుండా ఏర్పాటు చేసాము..ఉదయం తొమ్మిది గంటలప్పుడు ఒక పెద్దాయన, ఆయన భార్యా..కుమారుడు..వచ్చారు..శ్రీ స్వామివారికి అర్చన చేయించుకొని..తిరిగి వెళ్లి..ముందువైపున్న మంటపం లో కూర్చుని.. వాళ్లలో వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ వున్నారు..నేను కానీ మా సిబ్బంది కానీ పెద్దగా పట్టించుకోలేదు..కొద్దిసేపటి తరువాత..ఆ దంపతులిద్దరూ మెల్లిగా ఒకరి ఆసరతో ఒకరు లేచి..నా దగ్గరకు వచ్చారు..


"శ్రీధరరావు గారి అబ్బాయి ఇక్కడ వున్నాడని విన్నాము..కొంచెం నాకు చూపుతారా?.."అని నన్నే అడిగాడా పెద్దాయన..నేను నవ్వి.."నేనే పెద్దాయనా..నాతో ఏదైనా పని ఉందా?.." అన్నాను..


"నువ్వేనా?..కనుక్కోలేకపోయాను..నా పేరు మాలకొండయ్య..ఈమె పేరు ఈశ్వరమ్మ..మాది ఒంగోలు దగ్గర ఓలేటి వారి పాలెం..మేము వేమూరి వాళ్ళం..(అది వాళ్ళ ఇంటిపేరు..). మీ నాయన గారు ఇక్కడ నిర్వహణ చేస్తున్నప్పుడు తరచూ వచ్చేవాళ్ళం..మీ నాన్న గారికి నేను బాగా పరిచయం..ఇప్పుడు వయసు మీద పడ్డ తరువాత, ఇక్కడకు రావడం తగ్గిపోయింది..మొదటినుంచీ ఈ స్వామిని నమ్ముకొని వున్నాము..అన్నీ సక్రమంగానే చూసాడు ఆ తండ్రి..ఉన్నంతలో నలుగురికి పెట్టే స్థితిలోనే వున్నాము.." అన్నాడు.


"నీ పేరేంది?.." అన్నాడు.."ప్రసాద్.." అన్నాను..


"మూడేళ్ల క్రిందట ఇక్కడికి వచ్చినప్పుడు..అప్పుడు నువ్వింకా ఇక్కడ బాధ్యత తీసుకోలేదులే..మీ నాయనే చూస్తూ వున్నాడు..అప్పుడు..శ్రీ స్వామివారిని ఒక కోరిక కోరుకున్నాము..ఆ కోరిక నెరవేరితే ఈ గర్భగుడి చుట్టూ వున్న మంటపానికి గ్రిల్ తయారు చేయించి పెట్టిస్తా అని అనుకున్నాను..ఆ స్వామి మమ్మల్ని చల్లగా చూసాడు..మేము అనుకున్నది నెరవేరింది..కాకుంటే..మేమే ఆలస్యం చేసాము..నువ్వు పనివాళ్లను పిలిపించి..ఎంత అవుతుందో లెక్క గట్టించి చెప్పు..ఆ డబ్బు నేనిస్తాను..గ్రిల్ తయారు చేయించి బిగిద్దాము.." అన్నాడు..


అవాక్కవడం మినహా నేనేమీ చేయలేదు..గ్రిల్ గురించి అప్పటికి పూర్తిగా నేనే నిర్ణయం తీసుకోలేదు..కానీ శ్రీ స్వామివారు మాత్రం..లోపల సమాధిలో కూర్చునే నిర్ణయం తీసేసుకున్నారు..ఇక ఆలోచించడానికి నేనెవరిని?..కేవలం వీళ్ళతో మాట్లాడటానికి ఒక సాధనాన్ని మాత్రమే..


"మీతో పాటు ఇంకెవరన్నా మీ వాళ్ళు వచ్చారా?.." అన్నాను నేను.."మా పెద్దబ్బాయి వచ్చాడు.." అని ఆ అబ్బాయిని పిలుచుకుని వచ్చాడు..వాళ్ళను కూర్చోబెట్టి.."నేను పనివాళ్లను పిలచి..లెక్క గట్టి..మీకు చెప్పడం కన్నా..ఈ మంటపం కొలతలు తీసుకొని ఒంగోలు వెళ్లి..అక్కడ ఎస్టిమేషన్ వేయించండి..మీకొక అభిప్రాయం వస్తుంది..దానిని బట్టి ఇక్కడ పనివాళ్ళతో మాట్లాడదాము.."అన్నాను..


ఈ సూచన వాళ్లకు నచ్చింది..అప్పటికప్పుడే కొలతలు తీసుకొని వెళ్లారు..మరో రెండు మూడు రోజుల్లోనే..ఒంగోలు నుండి పనివాళ్లను వెంటబెట్టుకొని వచ్చారు..వెల్డింగ్ మిషన్లు తెచ్చుకొని..మందిరం వద్దే వారం పాటు వుండి.. గ్రిల్ తయారు చేసి..బిగించి వెళ్లిపోయారు..ఇప్పటికీ ఆ మాలకొండయ్య గారు గుడికి వస్తూ వుంటారు..ఏమాత్రం భేషజం చూపించరు.. తనకు శక్తి ఉన్నంతవరకూ శ్రీ స్వామివారి సేవలో ఉంటానని వినయపూర్వకంగా చెపుతూ వుంటారు..


శ్రీ స్వామివారి వద్ద ప్రతిదీ విన్నవించుకోవలసిన అవసరం లేదని ఆరోజు నాకు తెలిసివచ్చింది.. మా అందరి ఆలోచనలు పసిగట్టి అందుకు తగ్గ ప్రణాళికలు ఆయన వద్ద సిద్ధంగా ఉంటాయి..ప్రతిసారీ ఋజువు అవుతూనే ఉంది..


సర్వం..

దత్తకృప.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్: 523114.. సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: