25, సెప్టెంబర్ 2020, శుక్రవారం

మధుర గాయకులు శ్రీ బాలు గారి కి నివాళులర్పిస్తుంది తెలుగు కవులు బ్లాగు



నీవు లేవంటున్నారేంటి బాలు..
మేము ఊహ తెలిసింది మొదలు నీ జోలపాటలు వింటూ బొజ్జున్నాం..
నీ మేలుకొలుపు పాటలకు మేల్కొన్నాం..
నిస్సత్తువగా ఉంటే నీ హుషారైన పాటలతో ఉత్సాహం పొందాం...
ఆనంద కర సమయాన నీపాటలకు మైమరచి నృత్యాలు చేస్తూ సంబరాలు చేసాం...
పెళ్లైనా, పేరంటమైనా.. ఏ సంబరమైనా నీపాట తోడైతే ఆ సందడి అంబరాన్ని తాకేల్సిందే..
కుర్రకారును కిర్రెక్కిస్తూ.. యువతను వెర్రెక్కి స్తూ..
ప్రేమికులను మత్తెక్కించే నీ స్వరమాధుర్యం మూగబోయింది అంటారేంటీ... 
విషాదగీతాలకు విలపించేలా చేసావు..
భక్తిరస గీతాలకు భగవంతుడే వంతపాడేలా ఆలపించిన ఆ గొంతు ఆగిపోయింది అంటారేంటి? శ్రమ తెలియకుండా కూనిరాగాలు తీసే ప్రతి శ్రామికుల గొంతులో నీవులేవూ..
ప్రియురాలు కోసం ధైర్యాన్ని ప్రోది చేసుకొని ప్రియుడు వర్ణించే ప్రేమ పాటలో నీవు లేవూ..
ప్రతి గుడిపై ఉదయ,సంధ్యలలో వేసే భక్తి గీతాలలో నీవు జీవించే ఉంటావు..ప్రతి పల్లె, పట్టణం లో గల లోగిల్లలో...సంగీత ప్రియుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచే ఉంటావు..సంగీతం ఉన్నంతకాలం..కాదు మానవాళి ఉన్నంత కాలం కాదుకాదు సృష్టి ఉన్నంత కాలం చిరంజీవి గా ఉంటావు.. కారణజన్ముడవు నీవు నీకు మరణం ఏమిటి? అవతార పరిసమాప్తి..అంతే.. సుస్వరాల "బాలు"కు అక్షర నివాళి.
@తోటకూర గంగాధర్.
    ఎమ్.ఏ.,ఎం.ఎల్.ఐ.ఎస్.సి.
 

కామెంట్‌లు లేవు: