🌻🌺🍀🌻🌺🍀🌻
_స్వయంగా భగవంతుడే తన గురించి, తన భక్తుని గురించి, తనపై ఉండవలసిన భక్తి గురించి చెప్పటం వల్ల మరొక మానవమాత్రునితో పనిలేకుండా మార్పులు, చేర్పులు, తీర్పులు లేకుండా స్వయం సిద్ధమై నిలిచిందీ భగవద్గీత..._
_అసలు ఏమిటీ భగవద్గీత.. భగవద్గీతకు మనకు సంబంధం ఏమిటి.. అందులోని విషయాలను తెలుసుకోవటం వల్ల మనకు ఏం ప్రయోజనం కలుగుతుంది..???_
*మానవజన్మను సార్థకం చేసుకొనుటకు భగవద్గీత ఎలా సాయపడుతుంది...*
మనం సరదాగా మీ బంధువులింటికీ వెళ్ళాలని హైదరాబాదు వెళ్ళామనుకుందాము...
ఒకరోజు బిర్లా మందిరానికని, ఒకరోజు పార్కుకు, జూకు వెళ్ళివస్తున్నారు.
ఒక రోజున ఎవరో స్వామీజీ భగవద్గీతపై ప్రవచనములు చేస్తున్నారని అక్కడికి వెళ్ళారు.
ఒక గంట సేపు ఆ ప్రవచనాలు విని ఆనందించారు, అక్కడి నుండి తిరిగి ఇంటికి వచ్చి భోజనం చేసి పడుకుంటే హాయిగా ఉండేది.
కాని మధ్యలో స్నేహితుడు కనిపించి దగ్గరలో సర్కస్ ఉంది, వెళ్దాం అంటే వెళ్ళారు.... జనంలో త్రోసుకొని టికెట్టు కొనుక్కొని లోపలికెళ్ళారు. స్నేహితుడు కనిపించలేదు. రెండు గంటలు సర్కస్ చూశారు, తిరిగి ఇంటికి బయలుదేరారు, దారి తెలియలేదు, కరెంటు పోయింది, అయినా ముందుకెళ్ళారు,
అక్కడ చిమ్మ చీకటి, కీచురాళ్ళ ధ్వనులు, భయం వేసింది.
వడి వడిగా అడుగులు వేస్తున్నారు, వెనుక కుక్క మొరుగుతూ వెంట బడుతున్నట్లు అనుమానం వచ్చి పరుగు లంకించుకున్నారు.
బాధ, దుఃఖం, ఆకలి, అలసట, దిక్కు తెలియక అలా వెళుతున్నారు, అలా ఎంత దూరం వెళ్ళినా మన బంధువుల బజారు రాలేదు....
కనిపించిన వారినల్లా అడ్రసు అడుగుతున్నారు, ఎవరూ తెలియదంటున్నారు.... చివరకు ఒకాయన ఆ ప్రాంతాలన్నీ పరిచయమున్న వ్యక్తి తటస్థపడి "ఇదిగో ఇటు వెళ్ళు, ఒక ఫర్లాంగు వెళ్ళిన తరువాత దారి చీలుతుంది, ఎడమ వైపు తిరిగి సరాసరి వెళ్ళిపో. మీ బజారు వస్తుంది" అని చెప్పాడు.
ఆ దారి వెంట వెళ్ళి ఇల్లు చేరుకున్నారు, మన బాధలు, భయాలు తొలగిపోయి హాయిగా ఉన్నాము...
_ఇదే విధంగా మనం కూడా మన స్వస్థానాన్ని పరమాత్మ స్థానాన్ని విడిచి ఈ మానవ లోకంలోకి వచ్చిపడ్డాం...._
ఇక్కడ ఏవోవో పనులు చేస్తూ వాటి _ఫలితంగా సుఖాలు, దుఃఖాలు అనుభవిస్తున్నాం, ఈ జన్మను విడిచిపెట్టి మనం చేసిన పుణ్య కర్మల ఫలితంగా స్వర్గలోకానికి వెళ్ళి అక్కడ అనేకమైన భోగాలు అనుభవిస్తాం._
_అలాగే పాప కర్మల ఫలితంగా నరకయాతనలు, భయంకరమైన దుఃఖాలు అనుభవిస్తాం, ఆ పుణ్య, పాప కర్మల ఫలితాలు అనుభవించిన తరువాత తిరిగి మళ్లీ ఈ లోకంలో కుక్కగా, నక్కగా, పిల్లిగా, బల్లిగా, పక్షిగా, పందిగా, పులిగా, ఏనుగుగా, చెట్టుగా, పుట్టగా, లేక మానవుడిగా అనేక రకాల జన్మలు ఎత్తుతూ ఉంటాం..._
_అనేక సుఖాలు, భోగాలు, దుఃఖాలు, కష్టాలు అనుభవిస్తూ ఉంటాం. ఇలా అనంత కోటిజన్మలు, ఈ ప్రయాణం ఇలా సాగుతూనే ఉంటుంది..._
_మనం రోజుకొక డ్రస్సు వేసుకున్నట్లు ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క దేహాన్ని తగిలించుకొని ఈ అంతులేని ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటాం._
_అయితే మనం ఎక్కడికి వెళ్ళాలో, ఎటు వెళ్ళాలో, ఎలా వెళ్ళాలో తెలియకుండానే ఈ ప్రయాణం సాగిస్తుంటాం..._
*"కస్త్వం క్కోహం కుత ఆయుతః"..*
నీవెవరు.. నేనెవరు.. ఎక్కణ్ణుంచి వచ్చాం.. (భజగోవిందం) అని పెద్దలు, శాస్త్రాలు మనను అడుగుతూనే ఉన్నారు.
"మిత్రమా.. ఎక్కడి నుండి ఎక్కడకు నీ ప్రయాణం.. అని. ఏమో.. ఎక్కణ్ణించి వస్తున్నామో తెలియదు.
ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. గ్రుడ్డి ఎద్దు చేలో పడ్డట్టుగా, గాలి ఎటు వీస్తే అటు ఎగిరిపోయే ఎండుటాకులా ఎలాగో జీవయాత్ర సాగిస్తున్నాం.
కాని మన ప్రయాణానికి ఒక గమ్యం లేదు.. ధ్యేయం లేదు.. లక్ష్యం లేదు.. "అచ్చపు చీకటింబడి".. అన్నట్లు చీకట్లో ప్రయాణం చేస్తున్నాం.
_మన ప్రయాణానికి పుట్టు పూర్వోత్తరాలు తెలియవు. పెద్దలు చెబుతున్నా, శాస్త్రాలు ఘోషిస్తున్నా మనం మాత్రం కుంభకర్ణ నిద్ర నుంచి మేల్కోవటం లేదు._
_ఇలా దిక్కులు మరచి, దిక్కు తోచక, చీకటిలో ప్రయాణిస్తున్న మనకు అన్ని మార్గాలు తెలిసిన స్నేహితునిలాగా *'భగవద్గీత'* మనం ఎక్కడి నుండి బయలుదేరామో, ఎక్కడికి వెళ్ళాలో, ఎలా వెళ్ళాలో అన్ని విషయాలను చెప్పి, మనలను చేయిపట్టుకొని మన స్వస్థానానికి నడిపిస్తుంది._
సమస్త దుఃఖాలను అంతం చేసుకొని, దుఃఖంలేని ఆనంద సామ్రాజ్యంలో మనలను ఓలలాడేటట్లు చేస్తుంది. అయితే మనం ఈ భగవద్గీత అనే స్నేహితుని చేయిపట్టుకొని వదలకూడదు, ఎటునడిపిస్తే అటు నడవాలి.
ఈ విధంగా మానవుడికి తన గమ్యస్థానం ఏమిటో తెలియజెప్పి అక్కడకు చేర్చే స్నేహితుడు గనుక భగవద్గీత మానవుడికి సంబంధించినది. మనకు సంబంధించినది. మానవ జన్మను సార్థకం చేసుకొనుటకు ఉపయోగపడేది భగవద్గీత.
కనుక భగవద్గీత చెప్పే విషయాలను గ్రహించాలి, ఈ లోకం మనది కాదు, ఇక్కడి వస్తువులు మనవి కావు. ఇక్కడి దుఃఖాలు, బాధలు కూడా మనవి కావు....
“ఆబ్రహ్మభువనాల్లోకాః పునరావర్తిన్కోర్జున”.. అన్నట్లు ఈ పదునాలుగు లోకాలు కూడా మన మజిలీలే. ఆ లోకం నుంచి ఈ లోకానికి, ఈ లోకం నుంచి ఆ లోకానికి ఏతం బానలాగా పైకీ క్రిందికీ తిరుగుతూ ఉండాల్సిందే...
*🌹🙏ఓం నమో వేంకటేశాయా🙏🌹*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి