25, సెప్టెంబర్ 2020, శుక్రవారం

**త్రిపురారహస్య జ్ఞానఖండసారము**

 **దశిక రాము**



అమ్మదయ గలవారు మాత్రమే దీనిని చదవగలరు 


PART-7

Chapter 1


హైహయవంశీయుఁడు కార్తవీర్యార్జునుఁడు దత్తాత్రేయు నారాధించి అణిమాద్యష్టసిద్ధులను పొందెను. యోగశక్తిచే నతఁడు కావలసినపుడు వేయిబాహువులను పొందఁగలిగియుండెను. పరాక్రమమున అతనిని మించినవారు క్షత్రియులు గాని రాక్షసులు గాని అప్పుడు ఎవరును లేకుండిరి.

ఆతఁ డొకనాఁడు వేటకై వనములందు విహరించుచు జమదగ్నిమహర్షి యాశ్రమము చెంతకు వచ్చెను. మహర్షిని సందర్శించుటకై యాతఁడు ఆశ్రమమున ప్రవేశించెను. జమదగ్నియు మహారాజునకు స్వాగతము నొసంగి హోమధేనువుయొక్క మహిమచేత మంత్రిసేనాసమేతముగా ఆశ్చర్యకరమైన యాతిథ్యము నొసంగెను. ఆగోవుయొక్క మహిమకు అందఱును ఆశ్చర్యపరవశులై ఇట్టి దొకటి యీలోకమున కలదా అని ప్రశంసింపఁజొచ్చిరి. సాటిలేని యైశ్వర్యముతో విరాజిల్లుచున్న యా మహారాజున కాప్రశంసలు భరింపరాని వయ్యెను. తనసంపదను మించిన సంపదకు సాధనమైన గోరత్నము ఒక సామాన్య బ్రాహ్మణుని యొద్ద నుండుట తనప్రాభవనమునకు కొఱత కలిగినట్లుగా భావించి ఆతఁడు వెంటనే ఆగోవును దూడతో కూడ రాజధానికి తీసికొని రండని భటుల కాజ్ఞాపించి వెడలిపోయెను.

అప్పుడు పరశురాముఁడు ఆశ్రమములో లేఁడు. రాజభటులు హోమధేనువును దూడను బలవంతముగా తీసికొనిపోయిన తరువాత కొంతసేపటికిపరశురాముఁడు తిరిగివచ్చెను. ఆతనిని జూడఁగనే ఆశ్రమవాసు లందఱును ఎదురేగి కన్నీళ్ళతో కార్తవీర్యుని దౌర్జన్యమునుగూర్చి చెప్పిరి. అతఁడు రోషావిష్టుఁడై వెంటనే కవచమును అక్షయతూణీరములను ధరించి విష్ణుధనువును పరశువును గైకొని మాహిష్యతీనగరమువైపు పరువిడెను. అప్పటి కింకను రాజు నగరమున ప్రవేశింపలేదు. భార్గవరాముని పింహగర్జనము విని సైన్యము సంభ్రమముతో వెనుదిరిగి ఆతనిని చుట్టుముట్టెను. భార్గవుడు ఒక్క పిడికిలియందు వందలబాణములను సంధించి ప్రయోగించుచు సమీపించినవారిని పరశువునకు బలిగావించుచు సైన్యమును నిర్మూలించెను. గోరత్నముచేతనేకాక పరాక్రమముచేత కూడ అతిశయించుచున్న యా బ్రాహ్మణుని జూచి కార్త వీర్యుఁడు అసూయావిష్టుఁడై విజృంభించి అయిదువందలచేతులలో అయిదువందల ధనువలును ధరించి మిగిలిన యయిదువందల చేతులతో బాణములను సంధించుచు రథమును రాముని పైకి తోలించెను. భార్గవుడుఁడుగ్రుఁడై ఒక్కవింటియందే అయిదువందల బాణములను సంధించి వానిధనువులను ఖండించి కనుఱప్పపాటు మాత్రమున రథముపైకి లంఘించి కార్త వీర్యుని వేయిబాహువులను శీర్షమును ఖండించి సింహగర్జనము గావించెను. అది చూచి కార్తవీర్యుని పుత్రులు పదివేలమంది భయభ్రాంతులై పారిపోయిరి. రాముఁడు దూడతో కూడ హోమధేనువును గైకొని ఆశ్రమమునకు తిరిగివచ్చెను.

🙏🙏🙏

సేకరణ

**ధర్మము-సంస్కృతి*



**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**

*మన ధర్మాన్ని రక్షిద్దాం**


**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏

కామెంట్‌లు లేవు: