25, సెప్టెంబర్ 2020, శుక్రవారం

రామాయణమ్..74

రాముడు అలా ప్రయాణం చేస్తూనే ఉన్నాడు.కోసలదేశాన్ని దాటి వాయువేగ మనోవేగాలతో రధం ప్రయాణం చేస్తున్నది.దారిలో వేదశృతి,గోమతీ,స్యందిక అనే నదులను దాటారు.

.

మధ్యమధ్యలో సుమంత్రుడితోప్రేమగా సంభాషిస్తూ ఇంత అందమైన నా జన్మభూమికి తిరిగి వచ్చి సరయూ నదిలో మరల ఎప్పుడు క్రీడిస్తానో కదా అని పలుకుతూ దారి పొడవునా ఉన్న అందమయిన ప్రదేశాలను సీతకు చూపుతూ ఉల్లాసంగా ముందుకు సాగుతున్నాడు.

.

దారిలో తనను కలువ వచ్చిన గ్రామస్థులు తనస్థితిని చూసి దుఃఖిస్తుంటే వారందరికీ హితముచేప్పి "ఎక్కువకాలము రోదించటము మంచిదికాదు ,పాపము" (చిరం దుఃఖస్య పాపీయః)అని చెప్పి వారి తో మధురంగా సంభాషించి సాయంసంధ్యాసమయంలో కనుమరుగయ్యే సూర్యుడిలా కనపడకుండా వేగంగా వెళ్ళిపోతున్నాడు రామచంద్రుడు.

.

వెళ్ళి,వెళ్ళి ఉత్తుంగ తరంగాలతో,మంగళప్రదమై నాచులేకుండా నిర్మలంగా ఉన్నజలాలతో,దేవ,దానవ,గంధర్వ,కిన్నరులు,సదా సేవించే గంగానదిని చూశారు వారు.

.

ఆ గంగ నీరు కొన్నిచోట్ల అట్టహాసంగా భయంకరంగా ఉన్నది,

కొన్ని చోట్ల జలతరంగఘోష మృదంగధ్వనిని పోలిఉన్నది,

.

కొన్ని చోట్ల దీర్ఘంగా ప్రవహిస్తూ జలము అందమైన స్త్రీల పొడుగాటి జడలా వంపులు తిరిగి వయ్యారంగా సాగుతున్నది.

.

కొన్నిచోట్ల సుడులుతిరుగుతూ చూసేవారికి భయంగొల్పుతూ ఉన్నది ! 

కొన్నిచోట్ల విశాలమై తెల్లటి ఇసుకతిన్నెలు వ్యాపించి ఉన్నాయి.

హంసలు,సారసపక్షులు,చక్రవాకములు,నదిలోవిహరిస్తూ,క్రీడిస్తూ మనోహరమైన ధ్వనులుచేస్తూ సంగీతగోష్ఢులు జరుపుతున్నట్లుగా ఉన్నాయి. 

.

నది ఒడ్డున పెరిగిన వృక్షరాజములు పచ్చని మాలల లాగా గంగాదేవిని అలంకరిస్తున్నాయి . 

.

ఏ విధమైన మలినములు లేకుండా నిర్మలస్ఫటికమణికాంతితో జలములు శోభిల్లుతున్నాయి.

.

ఇంత అందమైన గంగ ఒడ్డున ప్రయాణం చేస్తూ సీతారాములు తమను తాము మరచిపోయినారు .ఏకబిగిన ప్రయాణంచేస్తూ శృంగబేరిపురం వద్ద గంగ సమీపంలోకి చేరుకున్నారు.

.

ఆ నది ఒడ్డున ఒక మహావృక్షము క్రింద ఆ రాత్రికి విశ్రమించాలని రామచంద్రుడు నిర్ణయించుకొని సుమంత్రుని రధం ఆపమన్నాడు.

.

శ్రీరామ ఆగమన వార్త ఏ గాలి చెప్పిందో తెలవదుగానీ ! రాముడి ప్రియమిత్రుడు ,ప్రాణసమానుడు నిషాదరాజు అయిన గుహుడు పరివారంతో సహా అక్కడ వచ్చి వాలాడు.

.


జానకిరామారావు వూటుకూరు గారి 

సౌజన్యం తో ....


*ధర్మధ్వజం*

హిందు చైతన్య వేదిక

కామెంట్‌లు లేవు: