25, సెప్టెంబర్ 2020, శుక్రవారం

**మహాభారతము**

 **దశిక రాము**




నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ /

దేవీం సరస్వతీమ్ వ్యాసం( చైవ ) తతో జయముదీరయేత్.//


93 - అరణ్యపర్వం.


కౌశికుడు ఆశ్చర్యం లోనుండి తేరుకోకునే లోపే, ' మహాత్మా ! ఇది మాంస విక్రయ ప్రదేశం. తమబోటివారు సంచరించే ప్రదేశం కాదు. మా గృహం పావనం చెయ్యండి. అక్కడ మనం మాట్లాడుకుందాము. ' అని ధర్మవ్యాధుడు తన యింటికి తీసుకువెళ్లి, అర్ఘ్యపాద్యాదులతో పూజించాడు.  


అప్పటిదాకా వుగ్గబట్టుకుని మౌనంగా వున్న కౌశికుడు, ' ధర్మవ్యాధా ! నీకు విశేష గుణాలు వున్నాయని నాకు విదితమౌతున్నది. అయితే, మూగజంతువులను చంపి మాంసం విక్రయించే నీచమైన పనిలో నీవు యెందుకు పాలుపంచుకుంటున్నావు. ఈ విషయంలో నాకు వ్యధగా వున్నది. ' అని తన మనసులోని మాట బయటపెట్టాడు. ఆయన సందేహానికి ధర్మవ్యాధుడు ఈ విధంగా సమాధానం చెబుతున్నాడు : 


' మీరు నాపై చూపించిన సానుభూతికి నా కృతజ్ఞతలు. విప్రోత్తమా ! మాంసవిక్రయం నా కులవృత్తి. మా తాత ముత్తాతల కాలంనుండీ యిదే మా జీవనాధారము. మేము తప్పు చేస్తున్నామన్న భావన మాలో అణుమాత్రం కూడా లేదు. ఎందుకంటె, మేము పుట్టినదీ, పెరుగుతున్నదీ యీ వాతావరణంలోనే. ఇది నాకై నేను యెంచుకున్న వృత్తికాదు. అందువలన, యేదోషమూ నాకు అంటదు. '


' ఇక నా ప్రవ్రుత్తి, ప్రవర్తన అంటారా, నేను మా అమ్మా నాన్నలను భక్తితో దైవాలలాగా సేవిస్తాను. వచ్చే అతిధులను ఆదరిస్తాను. దైవకార్యాలు చేస్తాను. భృత్యులని ఆదరిస్తాను. వారి పట్ల పరుషంగా వుండను. ఇతరుల దోషాలను గురించి మాట్లాడను. నాకంటే అధికులను చూసి అసూయపడను. సంచిత ప్రారబ్ధ ఆగామి కర్మల గురించి నాకు తెలుసు. అందుకే, ఈ జన్మలో చేసే కర్మఫలాలు మోక్ష ప్రతిబంధకాలు కాకుండా చూసుకుంటున్నాను. '


' విప్రోత్తమా ! నేను జీవహింస చెయ్యను. మాంసభక్షణ చెయ్యను. కేవలం యితరులు తెచ్చే మాంసాన్ని ముక్కలుగా కొట్టి విక్రయిస్తాను. స్వధర్మాన్ని త్యజించకూడదు అనే భావంతో, పెద్దలను సేవిస్తూ, పిన్నలను ఆదరిస్తూ, నా విధులు నేను నిర్వర్తిస్తూ వుంటాను. ' అని అనేక విషయాలు ఉపనిషత్తుల లోని సారమంతా తన అనుభవ రూపం లో చెప్పిఅబ్బురపరచాడు, కౌశికుని, ధర్మవ్యాధుడు. ఇంకా యిలా అంటున్నాడు :


' బ్రాహ్మణోత్తమా ! నేను చేసే వృత్తి ఘోరమైనదే. కానీ నేను దానిని కోరుకుని స్వీకరించలేదు. నా పూర్వజన్మ పుణ్యపాపఫలాల చేత నేను యీ బోయకులం లో ఈ ఇంట జన్మించాను. పుణ్య శేషం వలన నా ప్రవ్రుత్తి సాత్వికంగా మారిపోయింది. మనం ధర్మమార్గంలో ప్రయాణిస్తే, ఇహపర లోకాలలో సుఖాలకు కొదువ వుండదు. ఈ దేహమే రధము. ఇంద్రియాలు రథానికి కట్టిన గుర్రాలు. బుద్ధియే రథసారధి. ఇంద్రియాలు వాటి సహజమైన విషయాలవైపే పరుగులు తీస్తాయి. వాటిని నియంత్రించి పరమాత్మలో మనస్సు లగ్నం చేసి, సచ్చిదానంద స్థితిలో రమించడమే, మనం చెయ్య వలసిన పని. ' 


ఈ మాటలన్నీ సంభ్రమంగా వింటున్న కౌశికుడు, ' ధర్మవ్యాధా ! నీకు ఇట్టి ధర్మ సాక్షాత్కారము ఎక్కడినుండి వచ్చింది. ఏ గురువు శుశ్రూష చేశావు? ' అని అడిగాడు. దానికి ధర్మవ్యాధుడు, ' నేను పెద్దల నుండి నేర్చుకున్న విషయాలనే మీకు చెప్పాను ప్రత్యేకంగా ఏ గురువు నుండి నేర్చుకొనలేదు. మీరు ఒకసారి లోనికి వచ్చి మా తల్లిదండ్రులను కూడా కలవండి, వారు కూడా సంతోషిస్తారు. ' . అనిచెప్పి లోనికి తీసుకువెళ్ళాడు.


లోపల భవనం కడు సుందరంగా స్వర్గలోకాన్ని తలపించేటట్లు వున్నది. ఆతని తల్లిదండ్రులు శయనించేగదిలో సుగంధ ద్రవ్యాల పరిమళం వ్యాపించి వున్నది. చక్కని శయ్య, కూర్చునే శుభ్రమైన ఆసనాలు అమర్చి వున్నవి. వాటిపై ధర్మవ్యాధుని తల్లిదండ్రులు కూర్చుని సంతోషంగా కబుర్లు చెప్పుకుంటున్నారు. 


లోపలికి వస్తూనే, ధర్మవ్యాధుడు వారిరువురకూ నమస్కరించి, వారి ఆశీర్వాదం తీసుకున్నాడు. కౌశికునకు తన తల్లిదండ్రులను పరిచయం చేశాడు ధర్మవ్యాధుడు. తాను మాంసపుదుకాణం లో చూసిన ధర్మవ్యాధుడూ, ఇతడూ ఒకడేనా అని ఆశ్చర్యం తో అతడి వైపూ, అతని తల్లిదండ్రుల వైపూ, ఆ గృహంలోని సౌకర్యముల వైపూ, చూస్తూ బొమ్మలా నిలబడిపోయాడు కౌశికుడు. 


' కౌశికా ! వీరే నాతల్లిదండ్రులు, నాకు దేవతాసమానులు. వీరి సేవలన్నీ నేనే స్వయంగా చేస్తాను. వారిని ఆనందపరచే విషయాలే వారి దగ్గర ప్రస్తావిస్తాను. వారికి బాధ కలిగించే విషయాలు, వారిని నొప్పించే మాటలు మాట్లాడను. యిదే నా తపస్సు. ఆతపస్సుతోనే నాచిత్తం నాఆధీనంలో వుంటుంది. విషయపరిజ్ఞానం చేస్తుంది. మిమ్ములను నావద్దకు పంపిన పతివ్రతాశిరోమణి కూడా,పవిత్రురాలు. ఆమె దివ్యదృష్టితోనే, మిమ్ములను నా వద్దకు పంపింది. నేను కూడా నాకు తెలిసినది మీకుచెప్పాను. ' అని కౌశికుని సందేహ నివృత్తి చేస్తూ, ' కౌశికా ! మీరు వేరే విధంగా అనుకోనంటే, ఒక విన్నపము. మీరు యెంతో విద్య సంపాదించారు. తపస్సు చేశారు. కానీ మీ తల్లిదండ్రులను వారి వృద్ధాప్యంలో విడిచిపెట్టి తపస్సుకై అరణ్యాలకు వెళ్లారు. వారు మీ గురించి రోదిస్తూ అంధులైపోయి జీవితం గడుపుతున్నారు. ముందుగా మీరు మీ తల్లిదండ్రులను కలుసుకుని, వారిసేవలో ధన్యులుకండి. ' అని చెప్పాడు ధర్మవ్యాధుడు. 


ధర్మవ్యాధుని మాటలకూ భక్తి భావంతో పులకించిపోయి, కౌశికుడు, ' ధర్మవ్యాధా ! నీవు బోయకులంలో జన్మించినా, బ్రాహ్మణోత్తముని వలే జీవిస్తున్నావు. నా కళ్ళు తెరిపించి నాకు దిశానిర్దేశం చేశావు. నరకకూపంలో పడకుండా కాపాడావు. ఇప్పుడే వెళ్లి నా మాతా పితల సేవలో తరిస్తాను. ' అని ఆతనికి నమస్కరించి వెళ్లిపోతుండగా, యింకా అనేక మంచి విషయాలు ధర్మవ్యాధుడు కౌశికునికి బోధించి, సాదరంగా వీడ్కోలు పలికాడు. 


అని మార్కండేయమహర్షి, ' పతివ్రతా ధర్మము, మాతాపితల సేవ యెంత ప్రభావ వంతమైనవో చెప్పడంకోసమే, మీకు ధర్మవ్యాధుని ఉపాఖ్యానం చెప్పాను. ' అంటూ ధర్మరాజు మొదలైనవారు, ఆనందంగా పరవశులై కధలో లీనమైన విధానం చూసి సంతోషించాడు.   


స్వస్తి.


వ్యాసానుగ్రహంతో మరికొంత రేపు.

🙏🙏🙏

సేకరణ

**ధర్మము-సంస్కృతి*

🙏🙏🙏


**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**

*మన ధర్మాన్ని రక్షిద్దాం**


**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏

కామెంట్‌లు లేవు: