25, సెప్టెంబర్ 2020, శుక్రవారం

**సౌందర్య లహరి**

 **దశిక రాము**

**శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారి భాష్యం**


ఏడవ శ్లోకం - మొదటి భాగం


క్వణత్కాంచీదామా కరికలభకుంభస్తననతా

పరిక్షీణా మధ్యే పరిణత శరచ్చంద్ర వదనా|

ధనుర్బాణాన్ పాశం సృణిమపి దధానా కరతలైః

పురస్తా దాస్తాం నః పురమథితు రాహోపురుషికా!!


ఆభరణములలో పొదగబడిన చిరుగజ్జెల సవ్వడి *క్వణత్* శబ్దంతో సూచించబడుతుంది. మొలనూలుకు మేఖల అని పేరు. గజ్జేలు పొదగబడిన మొలనూలును కాంచి అంటారు. లలితా సహస్రనామాలలో ప్రస్తావించబడిన *రణత్కింకిణి మేఖల* క్వణత్కాంచీ దామమునే సూచిస్తోంది. ఈ కాంచీ దామమునే మణిమేఖల అని పిలుస్తారు. తెలుగులో ఒడ్డాణమంటారు.


తమిళ పంచ కావ్యాలలో మణిమేఖల ఒకటి. దీనిలోని కథానాయిక పేరుకూడా అదే! మణిమేఖల బౌద్ధగ్రంథం. ఈ కథానాయిక కాంచీపురంలోని ఒక బౌద్ధాచార్యుని వద్ద ఉపదేశం పొంది కృతకృత్యత పొందినట్లు చెప్పబడింది. ఆమె తన చివరి రోజులలో కాంచిపురంలోని ప్రజల క్షామంతో కడగండ్ల పాలవుతుంటే, తన అక్షయపాత్రనుండి ఆహారం సృజించి అన్నార్తులకు పంచి పెట్టిందట. నిజానికి ఈ లీల కామాక్షీదేవిది. కామాక్షీ పురాణాల నుండి వారు నకలు చేసుకోన్నారు. కామాక్షీ పురాణమే మణిమేఖల వృత్తాంతం నుండి నకలు చేయబడి ఉండవచ్చు కదా అని కొందరు భావించవచ్చు. 


మణిమేఖల కంటే పూర్వీకమైన సంగమ కాలంలోని ఒక కవయిత్రి పేరు *కామకన్ని* అంటే కామాక్షి. కామాక్షీ ఆరాధన పూరాతనమైనదన్నపుడు పై వృత్తాంతంతో సహా కామాక్షీ పురాణంలో అన్ని కథలూ మణిమేఖలకంటే పురాతనమైనవే అనటంలో ఆశ్చర్యమేముంది. కామాక్షీ ఒక్క అన్నదానమే కాదు, ముప్ఫైరెండు దానాలు చేసిందని అవ్వైయార్ పాడింది. సంప్రదాయంలోని అరవైనాలుగు దానాలు కుదింపబడి ముప్ఫైరెండుగా చెప్పబడ్డాయి. ఇంతకీ మణిమేఖల అంటే కాంచి – ఓఢ్యాణము. గజ్జెలు, రత్నాలతో పొదగబడిన మొలనూలు.


ఈ దేశంలో అంబిక కన్యాకుమారి, క్షీరభవాని (కాశ్మీరు), మీనాక్షీ, విశాలాక్షీ – ఈ రకంగా అనేక రూపాలలో ప్రార్థించబడింది. అయితే శ్రీవిద్యా తంత్రంలో వర్ణించబడిన ఆయుధములు, ముద్రలతో కూడిన లలితా త్రిపురసుందరి కంచి కామాక్షీ మాత్రమే! ఆచార్యులవారు కామాక్షీ పేరును నేరుగా చెప్పకపోయినప్పటికీ మణిమేఖలను కాంచీ దామమని చెబుతూ కామాక్షీ దేవిని స్ఫురింపజేస్తున్నారు. 


భూమిని మనం విష్ణుమూర్తి భార్య అయిన భూదేవిగా భావిస్తాం కదా! ఆ భూదేవి నాభి కాంచీపురంలో ఉంది. ఓఢ్యాణపు ముందుభాగం నాభికి పైన ఉంటుంది. కాబట్టి ఈ ప్రదేశానికి కాంచి అన్న ప్రసిద్ధి కలిగింది.


దామమంటే అనేక నూలుపోగులుతో పేనబడిన తాడు. ఓఢ్యాణము బంగారు దామములతో పేనబడినది కాబట్టి ఆచార్యులవారు దానిని *కాంచీదామ*మంటున్నారు. అమ్మ నడుస్తుంటే కాలిగజ్జెల గలగలలతో కాంచీదామపు చిఱుగజ్జెల సవ్వడులు కూడా కలిసి ఒక మధురనాదాన్ని సృష్టిస్తాయన్నమాట.


భూమినాభి నుండి బయలుదేరిన ఈ ఓఢ్యాణము చుట్టిరావాలంటే ఎంత పెద్దదిగా ఉండాలి ?? ఈ కాంచీ దామము అంబిక నడుముకు అలంకరించబడింది కాబట్టి, అంబిక నడుము ఎంతో పెద్దది అయి ఉండవచ్చునేమో అన్న స్ఫురణ కలుగుతుంది. కానీ, నిజానికి ఆమె నడుము ఎంతో పలచన. *పరిక్షీణా మధ్యే* – సన్నని నడుము, ఇది ఉత్తమ జాతి స్త్రీల లక్షణమని చెప్పబడుతోంది.


(సశేషం)


కృతజ్ఞతలతో🙏🙏🙏


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

#ParamacharyaSoundaryaLahariBhashyam

🙏🙏🙏

కామెంట్‌లు లేవు: