అలివేలుమంగమ్మ యరకొరలేకుండ
ననిశమ్ము సత్సేవ లందజేయ
పద్మావతీదేవి ప్రణయరాగముతోడ
హృదయానుతాపమ్మునదుపుజేయ
అన్నమయ్యాఖ్యు గేయార్ఘ్యగానమ్ములె
హ్లాదానురంజన మందజేయ
గరుడ శేషాదులే ఘనవాహనాదులై
సంచారసౌఖ్యముల్ సల్పుచుండ
కొండలన్ మార్మ్రోగ గోవిందనామంబు
భక్త జనంబులే పలుకుచుండ
ప్రత్యేక హారతుల్ ప్రతినిత్యమునునీయ
కళ్ళె యద్దుకొనుచు గ్రాలుచుండ
పలుబృందములె రక్తి భజనగీతమ్ములే
పారవశ్యముగూర్ప పాడుచుండ
పెక్కు పారాయణల్ మక్కువగావించి
ప్రజ ధైర్యచిత్తాల వరలుచుండ
తిరుమలను తిరుపతిగ సందీప్తుడగుచు
భక్తమందారుడే కృపావర్షదుడయి
అండపిండాది లోకాల కండయైన
వేంక టేశ్వరస్వామిని వేడుకొందు.
రాయప్రోలు సీతారామశర్మ భీమవరం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి