25, సెప్టెంబర్ 2020, శుక్రవారం

మోహముద్గరము

 


         పద్యానువాదము 

గోపాలుని మధుసూదన రావు 


ఎచటి నుండియువచ్చితి ? నెవరు నేను ?

జనని యెవ్వరు ? నరయంగ జనకుడెవరు ?

తలచుమీవిధి నిరతంబు తాత్త్వికముగ 

స్వప్నతుల్యము తరచగా సర్వ జగతి 21


విశ్వమున సర్వప్రాణుల విష్ణుడుండ 

సాటివిష్ణుని నిందించ సవ్య మగునె ! 

ఆత్మ పరమాత్మ తత్త్వంబు ననుభవించ 

సర్వ జీవంబులందున సమత జూపు 22


శత్రు మిత్రుల బంధుల పుత్రులందు 

స్నేహ శత్రుత్వ ద్వంద్వముల్ చేయవలదు 

ఆరయ దర్శించుమాత్మనే యందరందు 

ఖేదమొందక విడనాడు బేధబుద్ధి 23


మరల జన్మంబు భువియందు మరల చావు 

మాత జఠరంబు నందున మరల నిద్ర 

తలచ సంసార మిదియేను తప్పదెపుడు 

భజన సేయుము పరమాత్ము పాహి యనుచు 24


గుడ్డపేలికబొంతను కూడియుండి 

పాపపుణ్యంబుల కతీత పథమునందు 

పూర్ణయోగంబు నాత్మలో పొందుయోగి 

బాలు నున్మత్తు మనుజునిభంగినుండు 25

కామెంట్‌లు లేవు: