**దశిక రారామ
తృతీయ స్కంధం -29
దేవమనుష్యాదుల సృష్టి
ఆ విధంగా ప్రశ్నించిన విదురునితో మైత్రేయుడు ఇలా అన్నాడు “జీవులకు అగోచరుడూ, పురుషోత్తముడూ, యోగమాయా సమేతుడూ, కాలస్వరూపుడూ, నిర్వికారుడూ అయిన జగన్నివాసుడు ఆదికాలంలో సృష్టిని గురించి తీవ్రంగా ఆలోచించాడు. ఆ ఆలోచనా ఫలితంగా సత్త్వం, రజస్సు, తమం అనే మూడు గుణాలు పుట్టాయి. ఆ మూడు గుణాలలో రజోగుణం నుండి మహత్తత్త్వం పుట్టింది. ఆ మహత్తత్త్వం నుండి మూడు గుణాల అంశలు కల అహంకారం పుట్టింది. ఆ అహంకారం నుండి పంచతన్మాత్రలు పుట్టాయి. వాటినుండి సమస్త సృష్టికి మూలకారణాలైన పంచభూతాలు పుట్టాయి. ఆ పంచభూతాలలో ఏ ఒక్కదానికీ ప్రత్యేకంగా లోకాన్ని సృష్టించడం చేతకాక, అన్నీ ఒక గుంపుగా కలిసి పాంచభౌతికమైన ఒక బంగారు గ్రుడ్డును సృష్టించాయి. ఆ గ్రుడ్డు మహాజలాలలో తేలియాడుతూ వృద్ధి పొందుతూ ఉండగా...నారాయణుడనే పేరుతో ప్రసిద్ధి కెక్కే పరబ్రహ్మం వెయ్యి దివ్యసంవత్సరాలు ఆ అండాన్ని అధిష్టించి ఉన్నాడు. ఆ వాసుదేవుని బొడ్డునుండి వేయి సూర్యుల కాంతితో వెలుగుతూ, సమస్త ప్రాణిసమూహంతో కూడిన ఒక పద్మం పుట్టింది. ఆ పద్మంలో నుండి భగవదంశతో చతుర్ముఖ బ్రహ్మ పుట్టాడు. స్వయం ప్రకాశుడైన ఆ బ్రహ్మ నామ రూప గుణాలు అనే సంకేతాలు కలిగి సమస్త జగత్తులనూ సృష్టించాడు. బ్రహ్మదేవుడు తామిస్రం, అంధతామిస్రం, తమం, మోహం, మహామోహం అనే ఐదు విధాలైన మోహస్థితి కలిగిన అవిద్యను పుట్టించి, అది తనకు మోహమయమైన శరీరమని భావించి ఏవగించుకొని, ఆ దేహాన్ని వదిలివేశాడు. బ్రహ్మ వదిలిపెట్టిన ఆ దేహం ఆకలి దప్పులకు స్థానమై రాత్రమయ మయింది. దానిలో నుండి యక్షులూ, రక్షస్సులూ అనే ప్రాణులు పుట్టగా వారికి ఆకలి దప్పులు అధికం కాగా కొందరు బ్రహ్మను భక్షిద్దా మన్నారు, మరి కొందరు రక్షిద్దా మన్నారు. ఈ విధంగా పలుకుతూ వారు బ్రహ్మ సమీపానికి వెళ్ళగా, బ్రహ్మ భయకంపితుడై “నేను మీ తండ్రిని. మీరు నా కుమారులు. నన్ను హింసించవద్దు” అంటూ “మా భక్షత... రక్షత” అనే శబ్దాలను ఉచ్చరించాడు. ఆ కారణంగా వారికి యక్షులు, రక్షస్సులు అనే పేర్లు వచ్చాయి. ఆ తరువాత బ్రహ్మ తేజోమయమైన మరొక దేహాన్ని ధరించి, సత్త్వగుణంతో కూడినవారూ, ప్రకాశవంతులూ అయిన దేవతలను ప్రముఖంగా సృష్టించి, ఆ తేజోమయమైన దేహాన్ని వదలివేయగా అది పగలుగా రూపొంది దేవతలందరికీ ఆశ్రయ మయింది. తరువాత బ్రహ్మ తన కటిప్రదేశం నుండి మిక్కిలి చంచలచిత్తులైన అసురులను సృష్టించాడు. వారు అతికాముకులు కావడం వల్ల ఆ బ్రహ్మదేవుణ్ణి చుట్టుముట్టి రతిక్రియను అపేక్షించి, సిగ్గు విడిచి వెంట పడగా బ్రహ్మ నవ్వుతూ పరుగులు తీసి, శరణాగతుల కష్టాలను తొలగించేవాడూ, భక్తులు కోరిన రూపంలో దర్శనం ఇచ్చేవాడూ అయిన నారాయణుని చేరి ఆయన పాదాలకు ప్రణమిల్లి ఇలా అన్నాడు. సమస్త దేవతలచేత పొగడబడేవాడా! విశ్వానికి క్షేమాన్ని కలిగించేవాడా! రక్షించు! రక్షించు! ఉపేక్షించక నన్ను రక్షించు. నా మాటను ఆలకించు. నేను నీ ఆజ్ఞను తలదాల్చి క్రమంగా...ఈ ప్రజలను సృష్టించగా వారిలో పాపాత్ములైన ఈ రాక్షసులు నన్నే రమించాలని రాగా చింత చెంది ఇక్కడికి వచ్చాను. ఓ సుచరిత్రా! నన్ను రక్షించు.అంతేకాక లోకంలో ఉండేవారికి కష్టాలను కలిగించడానికి, కష్టాలు పడేవారి కష్టాలను దూరం చేయడానికి నీకంటె సమర్థు లెవరున్నారు?” అని స్తోత్రం చేయగా, బ్రహ్మదేవుని దైన్యాన్ని తెలిసికొని నిస్సందేహంగా అందరి హృదయాలను దర్శించే శ్రీహరి “ఓ బ్రహ్మా! నీ ఈ ఘోరమైన శరీరాన్ని విడిచిపెట్టు” అని ఆజ్ఞాపించగా బ్రహ్మ ఆ దేహాన్ని త్యాగం చేసాడు. అప్పుడు ఆ దేహం నుండి మణులు పొదిగిన క్రొత్త బంగారు కాలి అందెలు ఘల్లుఘల్లుమని మ్రోగే పాదపద్మాలు కలది, మెత్తని పట్టుచీరపై మిలమిల మెరుస్తున్న మొలనూలుతో ఇసుకతిన్నెలవలె ఉన్న కటిప్రదేశం కలది, ఒకదానితో ఒకటి ఒరసికొంటున్న కుచకుంభాల బరువుకు నకనకలాడే నడుము కలది, మద్యపానం మత్తుతో చలిస్తున్న అప్పుడే వికసించిన పద్మాలవంటి కన్నులు కలది, కృష్ణపక్షపు అష్టమినాటి చంద్రుని పోలిన నుదురు కలది, మదించిన తుమ్మెదలకు సాటి వచ్చే శిరోజాలు కలది, అందమైన సంపంగి పువ్వు వలె సోగదేలిన ముక్కు కలది, చిరునవ్వులు చిందే చూపుల కలది, తామరపూలవంటి చేతులు కలది....
అబ్జపాణి అని పిలునదగిన ఆ సుందరి సంధ్యారూపంలో పుట్టగా, రాక్షసులు చూచి కౌగలించి, తమలో తాము ఇలా మాట్లాడుకున్నారు. “ఈ సౌకుమార్యం, ఈ నవయౌవనం, ఈ సౌందర్యం, ఈ జాణతనం, ఈ సౌభాగ్యవిశేషం ఏ స్త్రీలకూ లేదు. ఇది చాల చిత్రంగా ఉంది”. అని ఆశ్చర్యపడి ఆ రాక్షసులు “మనమంతా ఈమెను చూచినప్పటినుండి కామోత్కంఠులమై ఉండగా ఈమె మాత్రం మన మీద ఏమాత్రం మక్కువ చూపకుండా ఉండటానికి కారణం ఏమిటి?” అని అనేక విధాలుగా అనుకొని, ఆ సంధ్యాసుందరితో....ఇలా అన్నారు.అరటి బోదెల లాంటి నున్నటి తొడలు గల సుందరీ! నీదే కులం? నీదే ఊరు? నీ తల్లిదండ్రులు ఎవరు? ఎందుకు నీవు ఇక్కడ వంటరిగా తిరుగుతున్నావు? మాకు తెలిసేలా చెప్పు.
సృష్టి ఆదిలో తను సృష్టించిన రాక్షసులబారి నుండి తప్పించుకోడానికి బ్రహ్మదేవుడు తన దేహాన్ని విడిచాడు. ఆ దేహంనుండి ఆ రాక్షసులను మోహంలో పడేసిన సంధ్యాసుందరి జనించింది.
(చిట్టిపొట్టి పదాలతో ఎంతటి గంభీర భక్తిభావాలైనా, సరస శృంగారమైనా పండించగల మేటి పోతన గారి ఆ సంధ్యాసుందరి వర్ణన యిది.)
నీ సౌందర్య సంపదతో ఇంపైన ఈ పుణ్యభూమిలో మోహంతో నీవెంట పడిన దుర్బలులమైన మమ్మల్ని ఎందుకు చేరనివ్వవు? మన్మథుని బాధ మాకు ఎక్కువయింది కదా!”అంటూ వాళ్ళు ఆమె సౌందర్యాన్ని వర్ణించడానికి అలవి కాక ఆలోచిస్తూ...కుచకుంభాల బరువువల్ల జవజవలాడే నడుము ఆకాశం కాగా, అందమైన చిగురాకువంటి హస్తంలో ప్రకాశించే పూలచెండు అస్తమించే సూర్యబింబం కాగా, నల్లగా మెరుస్తూ విప్పారిన కొప్పుముడి చీకటి రేకలు కాగా, స్వచ్ఛమైన భావాలను వెల్లడిస్తూ మెరిసే చూపులు నక్షత్రాలు కాగా, శరీరానికి పూసుకున్న గంధపు పూత సంధ్యారాగం కాగా, స్త్రీరూపాన్ని ధరించిన ఆ సంధ్యాదేవిని అసురులు చుట్టుముట్టి, హృదయాలలో పెచ్చరిల్లిన మోహావేశంతో ఆమెతో మళ్ళీ ఇలా
అన్నారు. క్రొత్తగా వికసించిన తామరపువ్వు వంటి ముఖం కలదానా! పద్మం ఒకే స్థలంలో ఉంటుంది, కాని నీ పాదాలనే పద్మాలు అనేక స్థలాలలో అనేక ప్రకారాలుగా ప్రకాశిస్తున్నాయి కదా!”
అని ఈ విధంగా ఆ రాక్షసులు పలుకుతూ తమ మనసులో తమకం అధికం కాగా ఆ సంధ్యాసుందరిని పట్టుకున్నారు. అది చూచి బ్రహ్మ తన మనస్సులో ఎంతో సంతోషించాడు. అప్పుడు బ్రహ్మ తన చేతిని వాసన చూడగా గంధర్వులూ అప్సరసలూ పుట్టారు. బ్రహ్మ తన శరీరాన్ని వదలివేయగా అది...వెన్నెల రూపాన్ని పొందగా, ఆ దేహాన్ని విశ్వావసువు ముందు నడుస్తున్న గంధర్వులూ అప్సరసలూ తీసుకున్నారు. మళ్ళీ బ్రహ్మ కునుకుపాటు, ఉన్మాదం,ఆవులింత, నిద్రలతో కూడిన శరీరాన్ని ధరించి పిశాచాలనూ, గుహ్యకులనూ, సిద్ధులనూ, భూతాలనూ పుట్టించగా వాళ్ళు దిగంబరులై వెండ్రుకలు విరబోసుకొని ఉండడం చూచి బ్రహ్మ కన్నులు మూసుకొని అప్పటి తన శరీరాన్ని వదలి వేయగా దానిని పిశాచులు గ్రహించారు. అనంతరం బ్రహ్మ తనను అన్నవంతునిగా భావించి అదృశ్య శరీరుడై పితృదేవతలనూ సాధ్యులనూ పుట్టించగా వారు తమను పుట్టించిన అదృశ్యదేహానికి కార్యమైన దేవభాగాన్ని అందుకొనగా ఆ కారణం వల్ల శ్రాద్ధ సమయాలలో పితృగణాలనూ సాధ్యగణాలనూ ఉద్దేశించి హవ్యకవ్యాలను సమర్పిస్తారు. సజ్జనులు సంస్తుతించే ఓ పరీక్షిన్మహారాజా! విను. బ్రహ్మదేవుడు తిరోధానశక్తి వల్ల నరులను, సిద్ధులను,విద్యాధరులను పుట్టించి వారికి తిరోధానం అనే పేరుగల ఆ దేహాన్ని ఇచ్చాడు. తర్వాత బ్రహ్మ తనకు ప్రతిబింబంగా ఉన్న శరీరంనుండి కిన్నెరులనూ, కింపురుషులనూ పుట్టించగా వారు ఆ బ్రహ్మదేవుని ప్రతిబింబాలైన శరీరాలను ధరించి ఇద్దరిద్దరు జతకూడి బ్రహ్మదేవునికి సంబంధించిన గీతాలను గానం చేయసాగారు. అప్పుడు బ్రహ్మ తన మనస్సులో...తాను చేసిన సృష్టి అభివృద్ధి చెందకుండా ఉన్నందుకు బ్రహ్మ చింతించి, నిద్రించి, కాళ్ళూ చేతులూ విదిలించగా రాలిన రోమాలన్నీ పాములుగా మారాయి.
బ్రహ్మదేవుడు తాను పూనిన పని నెరవేరినట్లుగా భావించి తన అంతరాత్మ తృప్తిపడే విధంగా సమస్త జగత్తులో పవిత్రులూ, ముల్లోకాలలో శ్రేష్ఠులూ ఐన మనువులను సృష్టించాడు. ఆ విధంగా పుట్టించి బ్రహ్మ వారికి పురుషరూపమైన తన దేహాన్ని ఇవ్వగా ఆ మనువులు తమకంటే ముందుగా సృష్టింపబడిన వారితో కలిసి బ్రహ్మతో ఇలా అన్నారు. “దేవా! సకల లోకాలకు సృష్టికర్తవైన నీవు చేసిన ఈ విస్తృతమైన సుకృతం ఆశ్చర్యకరమైనది. యజ్ఞాలు మొదలైన క్రియాకాండ అంతా ఈ మనువులను సృష్టించడం వల్ల ప్రశంసనీయమయింది. యజ్ఞాలలోని హవిర్భాగాలను మా నాలుకలతో ఆస్వాదించే అవకాశం మాకు లభించింది” అని అంతరంగాల్లో సంతోషం పెల్లుబుకుతూ ఉండగా బ్రహ్మదేవుని ప్రస్తుతించారు.
బ్రహ్మ శ్రేష్ఠమైన తపస్సు, యోగం, విద్య, సమాధి వీటితో కూడినవాడై ఋషివేషాన్ని ధరించి, ఇంద్రియాలతో కలిసిన ఆత్మస్వరూపుడై ఋషిగణాలను సృష్టించి, వారికి తన శరీరాంశాలైన సమాధి, యోగం, ఐశ్వర్యం, తపస్సు, విద్య, వైరాగ్యం అనే వాటిని క్రమంగా ఒక్కొక్కరికి సంక్రమింపచేసాడు” అని మైత్రేయుడు తెలియజేయగా విని విదురుడు మహానందం పొంది గోవిందుని పాదారవిందాలను తన మనస్సులో స్మరించి, మళ్ళీ మైత్రేయునితో ఈ విధంగా అన్నాడు. ఉత్తమ గుణాలు కల మైత్రేయా! భూమిమీద స్వాయంభువ మనువు వంశం ధర్మసమ్మతమనీ, ఆ వంశంలో స్త్రీపురుష యోగం వల్ల ప్రజావృద్ధి జరిగిందనీ నీవు చెప్పావు. అంతేకాక ఆ స్వాయంభువ మనువుకు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే ఇద్దరు కుమారులు ఉన్నారనీ అన్నావు. వారు ఏడు దీవులతో కూడిన భూమండలమంతా ధర్మమార్గం ఎంతమాత్రం తప్పకుండా పుణ్యాత్ములై ఎట్లా పాలించారు? ఓ మునివరా! వారి చరిత్ర అంతా నాకు దయార్ద్రబుద్ధితో వివరించు. అంతేకాక ఆ స్వయంభువ మనువు యోగలక్షణ సంపన్నురాలైన తన కుమార్తె దేవహూతి అనే కన్యారత్నాన్ని ఏ విధంగా కర్దముడనే ప్రజాపతికి ఇచ్చి వివాహం చేసాడు? ఆ దేవహూతి యందు మహాయోగీశ్వరుడైన కర్దముడు ఏ విధంగా సంతానాన్ని కన్నాడు? అంతేకాక ఆ కర్దమ ప్రజాపతి తన కూతురైన రుచి అనే కన్యను దక్షప్రజాపతికి ఇచ్చాడని నీవు చెప్పావు. ఆ రుచి యందు దక్షప్రజాపతి ప్రజలను ఎట్లా సృష్టించాడు? ఇవన్నీ వివరంగా నాకు చెప్పు” అని అడుగగా మైతేయుడు ఇలా అన్నాడు.
🙏🙏🙏
సేకరణ
**ధర్మము-సంస్కృతి*
🙏🙏🙏
**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**
*మన ధర్మాన్ని రక్షిద్దాం**
**ధర్మో రక్షతి రక్షితః**
🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి