25, సెప్టెంబర్ 2020, శుక్రవారం

🌼🌿కామాక్షీ కామదాయినీ.......🌼🌿*



అమ్మవారు కేవలం తన దృష్టిపాతం చేతనే భక్తులందరిని ప్రసన్నం చేయడం చేత కమనీయమైన ఆమె నేత్రాల వల్ల కామాక్షీ అనే పేరు వచ్చింది. 


కామాక్షీ, కామేశ్వరీ అనే రెండు పేర్లతో బ్రహ్మదేవుడు అమ్మవారిని కీర్తించాడు.

నమస్కరించిన ప్రతీ జీవుని మనోరథాన్ని తన దృష్టిమాత్రంచేతనే నేరవేర్చే తల్లి కనుక కామాక్షీ.


ఆవిడ ఈశ్వరుని ఇచ్ఛాశక్తి. కళ్ళు విప్పడం అనేది ఒక గొప్ప శక్తి.


స ఐక్ష్యతా బహుస్యామ్ ప్రజాయేయా అని వేదమంత్రం.


ఐక్ష్యతా అంటే చూసాడని అర్థం. కళ్ళు మూసుకుని ఉంటే లయం. కళ్ళు విప్పితేనే సృష్టి. కళ్ళు విప్పితేనే పనులన్నీ ఉన్నాయి.పరమేశ్వరుడు కళ్ళు విప్పితేనే సృష్టి, స్థితి, లయలు అన్నీ జరుగుతున్నాయి.


ఉన్మేషనిమిషోత్పన్నవిపన్నభువనావళిః. పరమేశ్వరుని కన్నులు విప్పుట అనే శక్తి ఏదైతే ఉన్నదో అదే అమ్మవారు. అదే ఇచ్ఛా జ్ఞాన క్రియాత్మకమైన శక్తి. ఆవిడే కామాక్షీ.


కశ్చ అశ్చ మశ్చ ఇతి కామః అని ఒక అర్ధం చెప్పారు.


కామాక్షీ - ఆవిడ కళ్ళు తెరిస్తే సృష్టి. ఆ తెరిచి అలా నిలిపితే స్థితి. మూస్తే లయం. ఆ కళ్ళతోనే సృష్టి, స్థితి, లయ అనే మూడూ కనుచూపులతోనే చేస్తున్నారు అమ్మవారు. 


సృష్టికి ప్రతీకైన బ్రహ్మదేవుడు ’క’ కారం ద్వారా, స్థితికి ప్రతీకైన విష్ణువు ’అ’కారం ద్వారా, లయకి ప్రతీకైన రుద్రుడు ’మ’కారం ద్వారా తెలియజేయడుతున్నారు.


’క’ ’అ’ ’మ’ - బ్రహ్మ విష్ణు రుద్రులు - సృష్టి స్థితి లయలు ఇవన్నీ కళ్ళల్లోనే ఉన్న తల్లి కనుక కామాక్షీ. 


కామాక్షీ అన్నమాటలో ఇంత లోతైన అర్ధం ఉంది.


అమ్మవారు చిదగ్నికుండం నుండి ఆవిర్భవించిన వెంటనే కామాక్షీ కామదాయినీ అని కీర్తించి ’దేవర్షిగణసంఘాతసూయమానాత్మవైభవా’ అని దేవతలందరూ కలిసి అమ్మవారిని కీర్తించారు.


-----పూజ్యగురువులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు


*🌼🌿శ్రీ మాత్రే నమః🌼🌿* 

కామెంట్‌లు లేవు: