25, సెప్టెంబర్ 2020, శుక్రవారం

*శకటాసుర సంహారం ద్వారా కృష్ణుడు చెప్పిన నీతి*


    

వనాలు హరించుకుపోతే ప్ర‌కృతి సమతౌల్యత దెబ్బతిని అకాల వర్షాలు, కరవు కాటకాలు సంభవిస్తాయి. పచ్చని చెట్ల విలువ గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. వీటిని నాశనం చేయడం కూడా ధర్మ విరుద్ధం. అవసరానికి ఒక చెట్టును ఉపయోగించితే బదులుగా నాలుగు మొక్కలు నాటాలని ధర్మశాస్త్రం పేర్కొంటుంది. దీనికి సంబంధించి భాగవతంలో ఓ కథ కూడా ఉంది. ఇదే శకటాసుర సంహారం. కృష్ణుడు బాల్యంలో ఎంతో మంది రాక్షసులను సంహరించాడు. వారిటో శకటాసురుడు కూడా ఒకడు.


శకటాసుర సంహారం ద్వారా కృష్ణుడు చెప్పిన నీతి

గత జన్మలో హిరణ్యలోచనుడి కుమారుడు ఉత్కచుడే ఈ శకటాసురుడు. సహజ రాక్షస గుణాలతో ఉత్కచుడు వినాశానికి పాల్పడేవాడు. ఒకనాడు లోమశ మహర్షి ఆశ్రమంలోకి ప్రవేశించి అనేక వృక్షాలను కూకటి వేళ్లతో పెకలించి వేశాడు. ఉత్కచుడి చర్యలకు లోమశ మహర్షి తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయాడు. పాము కుబుశాన్ని విడిచినట్లు నీవు శరీరాన్ని వదలిపెడతావని శపించాడు. దీంతో తన తప్పును తెలుసుకున్న ఉత్కచుడు ఆ మహర్షి పాదాలపై పడి క్షమించమని వేడుకుంటాడు. అతడిలో కలిగిన పశ్చాత్తాపానికి లోమశుడు సంతోషించి నా శాపానికి తిరుగులేదు... కాబట్టి నీవు మరు జన్మలో శకటాసురునిగా జన్మించి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి వల్ల మోక్షం పొందుతావని తెలిపాడు.


కౌంసుడి ఆదేశానుసారం శకటాసురుడు గోకులంలో యశోద చెంత పెరుగుతున్న బాలకృష్ణ సంహారానికి వచ్చి ఊయలలోని కృష్ణుడిపై బండిని తోశాడు. కృష్ణుడు దీన్ని తన కాలితో తన్నేసరికి ఒక్క దెబ్బకే శకాటసురుడు మరణించి, మోక్షం పొంది వైకుంఠానికి చేరుకున్నాడు. ప్రకృతిని దైవంగా ఆరాధించే సంస్కృతి మనది. వృక్షాలను భగవంతుడి రూపంలో పూజించడం హిందువుల ఆచారం. అందుకే ఎలాంటి కారణం లేకుండా చెట్ల వినాశనానికి పాల్పడ్డ ఉత్కచుడు ముని శాపానికి గురికావాల్సి వచ్చింది. ప్ర‌కృతి పట్ల నిర్ద్యాక్షిణ్యంగా వ్యవహరిస్తే వినాశనం తప్పదని ఉత్కచుడు వృత్తాంతం తెలుపుతుంది.

కామెంట్‌లు లేవు: