కృపాచార్యుడు, ద్రోణుడి జన్మవృత్తాంతం
పాండురాజు మరణం తరువాత…
కుంతిదేవికి అక్కడ ఉన్న ఋషులే దిక్కు అయ్యారు. వారందరూ, కుంతీదేవినీ, ఐదుగురు కుమారులను తీసుకొని హస్తినాపురానికి ప్రయాణం అయ్యారు. పాండురాజు కుమారులను చూడ్డానికి హస్తినాపుర ప్రజలందరూ కదిలి వచ్చారు. కుంతీదేవి మునులతోనూ, కుమారులతోనూ రాజభవనాన్ని సమీపించగానే, దుర్యోధనుడు, తన 99 మంది తమ్ముళ్లతోనూ, పురోహితులతోనూ ఎదురు వచ్చి వారందరిని లోపలకు తీసుకుని వెళ్లాడు.
భీష్ముడు, విదురుడు, సత్యవతి, ధృతరాష్ట్రుడు, అంబిక, అంబాలిక వారికెదురు వచ్చి మునులందరికి నమస్కరించారు. కుంతీదేవిని ఓదార్చారు, పాండు కుమారులను ప్రేమతో ఎత్తుకున్నారు.
ఆ వచ్చిన వారిలో ఒక ముని భీష్మునితో “పాండురాజు శతశృంగ పర్వతము మీద, ఈ ఐదుగురు కుమారులను పొందాడు. విధివశాత్తు భార్యతో కూడా స్వర్గస్తుడైనాడు. అందువలన మేము వచ్చి వీరిని మీకు అప్పగించాము” అని చీపి ఆ మునులందరూ వెళ్లిపోయారు. తరువాత్ భీష్ముడు పాండు కుమారులతో పాండురాజుకు ఉత్తర కర్మలు నిర్వర్తింప చేసాడు.
ధృతరాష్ట్రుడు తన కుమారులు, పాండురాజు కుమారులు అనే బేధ భావము లేకుండా, అందరిని సమానంగా పెంచుతున్నాడు. కాని ఆటలలొ ఎప్పుడూ భీముడే గెలుస్తున్నాడు. భీముడు వారందరిని ఎక్కువగా బాధిస్తుండేవాడు. భీముడు పెట్టే బాధలు పడలేక, దుర్యోధనుడు తన మేనమామ శకుని, తమ్ముడు దుశ్శాసనుడు మొదలగువారితో ఆలోచించాడు.
“మనం ఈ బాధలు భరించలేము. భీముడిని చంపాలి, ధర్మరాజుని చేరలో పెట్టాలి.ఈ రజ్యాన్ని అంతా మనమే పాలించాలి” అన్నాడు. దానికి శకుని వంత పాడాడు.
ఒకరోజు అందరూ జలక్రీడలు ఆడి మైమరచి నిద్రపోతున్నారు. ఆ సమయంలో దుర్యోధనుడు భీముని తీగలతో కట్టించి, గంగలో తోయించాడు. కాని భీముడు నిద్రలేచి, ఒళ్లు విరుచుకోగానే ఆ తీగలు అన్నీ తెగిపోయాయి.
మరొక రోజు, దుర్యోధనుని ఆజ్ఞతో అతని సారధి భీముని నల్లతాచు పాములతో కరిపించాడు. కాని భీండు వజ్ర శరీరాన్ని ఆ పాముకోరలు చేధించలేక పోయాయి. భీముడు నిద్రలేచి, ఆ పామూలను చంపేసాడు. ఇంకొక రోజు కాలకూట విషాన్ని అన్నంలో కలిపి భీముడికి పెట్టించాడు. కాని భీముడు ఆ విషాన్ని కూడా జీర్ణం చేసుకున్నాడు ఈ విధంగ దుర్యొధనుని ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఇంకా ఏ విధంగా పాండవులకు కీడు చెయ్యాలా అని ఆలోచిస్తున్నాడు.
భీష్ముడు కురుకుమారులందరికి కృపాచార్యుని వద్ద, ద్రోణాచార్యుని వద్ద విలు విద్యలు నేర్పించసాగాడు.
అప్పుడు జనమేజయుడు వైశంపాయననునితో “మహర్ధీ, మాకు కృపాచార్యుడు, ద్రోణుని జన్మ వృత్తాంతాలను చెప్పండి” అని అడిగాడు.
వైశంపాయనుడు, జనమేజయునితో కృపాచార్యుని జన్మ వృత్తాంతాన్ని ఇలా చెప్పసాగాడు.
గౌతముడు అనే మహామునికి శరద్వంతుడు అనే కుమారుడు ఉన్నాడు. అతనికి వేదాలు చదవటం ఇష్టంలేదు. ధనుర్విద్యలో ప్రావిణ్యం సంపాదించాడు. ఇంకా సాధించాలని, ఘోరమైన తపస్సు చేస్తున్నాడు.
ఆ తపస్సును భంగం చెయ్యాలని దేవేంద్రుడు జలపద అనే యౌవనవతిని పంపించాడు. శరద్వంతుడు ఆమెను చూసి పరవశడయ్యాడు. అతని చేతిలో నుండి ధనుర్భాణాల్లు, జింక చర్మం కింద పడ్డాయి. కామోద్రేకంలో అతనికి వీర్యపతనం అయింది. శరద్వంతుడు మరల తపస్సుకు వెళ్లాడు. అతని వీర్యము ఒక రెల్లు పొదలలో రెండు భాగాలుగా పడింది. ఆ వీర్యంలో నుండి ఒక కొడుకు, ఒక కూతురు జన్మించారు.
ఒకరోజు శంతన మహారాజు వేటకు వచ్చి ఆ బిడ్డలను, పక్కనే పడి ఉన్న ధనుర్భాణాలను, జింక చర్మాన్ని చూసాడు. వారు బ్రాహ్మణ కుమారులై ఉంటారని తలచి తీసుకొని వెళ్లి పెంచుకున్నాడు. వారికి కృపుడు, కృపి అని పేర్లు పెట్టాడు.
కొంత కాలము తర్వాత, శర్ద్వంతుడు శంతనుని వద్దకు వచ్చి, వారు తన సంతానమని చెప్పాడు. కృపునికి ఉపనయనం చేసి, తనే స్వయంగా ధనుర్విద్యను నేర్పించాడు.
అలాంటి కృపాచార్యుని భీష్ముడు పిలిపించి, పాండు పుత్రులకు, దుర్యోధనాదులకు విలువిద్య నేర్పించడానికి నియమించాడు.
తరువాత వైశంపాయనుడు జనమేజయునితో ద్రోణాచార్యుని జన్మ వృత్తాంతాన్ని ఇలా చెప్పసాగాడు.
భరద్వాజ మహాముని గంగాతీరంలో తపస్సు చేసుకుంటున్నాడు. ఒకరోజు ఘృతాచి అనే అప్సరస గంగా నదిలో జలకాలాడుతూ ఉంది. గాలికి ఆమె చీర తొలగిపోయింది. ఆమెను చూసి భరద్వాజుడికి కోరిక కలిగింది. ఆ క్షణంలో భరద్వాజునికి వీర్య స్ఖలనం అయింది. భరద్వాజుడు తన వీర్యాన్ని, ఒక (ద్రోణిలో) కలశంలో పెట్టాడు. ఆ వీర్యం నుండి శుక్రుని అంశతో ద్రోణుడు జన్మించాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి