27, జులై 2021, మంగళవారం

ఆనాటి పెళ్ళి భోజనాలు

 మనందరినీ నాలుగైదు దశాబ్ధాల వెనుకకు తీసుకుపోయే మెసేజ్ -  ఆనాటి పెళ్ళి భోజనాలు ఒకసారి రుచి చూడాలంటే, చదివేయండి మరి 😃

చివరన, ఆగకుండా చదివిన తృప్తి ఎంత అంటే, చెప్పలేనంత👌😊

ఆరోజులు మళ్లీ రావు. వస్తే ఎంత బాగుండును? 


*పెళ్ళి భోజనం* 


ఆకుపచ్చని అరిటాకు ముందు కూచుంటాము శుభ్రంగా.  శుభ్రంగా...తడిగా మెరుస్తుంటుంది లేత అరిటాకు నవ నవలాడుతూ. 


వంటల వాసన గాలిలో తేలివస్తూ మనల్ని ఒక ఊపు ఊపేస్తుంటుంది తొందర చేస్తూ.  తినబోయే వాటి రుచులు నాలుకను చవులూరిస్తాయి. 


ఈలోగా ‘ చవి’ వడ్డిస్తానంటూ వస్తాడు ఒక బూరిబుగ్గల పిల్లవాడు. బొజ్జనిండా తిని పందిట్లో పడి అల్లరి చేస్తుంటే పిలచి వాడికి ఉప్పు విస్తట్లో పైన వారగా వేసే పని అప్పచెప్పారులా ఉంది. 

శ్రద్ధగా వేస్తున్నవాణ్ణి చూసి నవ్వుతుంటాం. 


పట్టుపరుకిణీ గర గర లాడించుకుంటూ నీళ్ళ జగ్గు పట్టుకొస్తుంది ఓ బాలామణి , దానితో పాటే ఇంకా కొందరు ఆడపిల్లలు వీరికి మంచినీళ్ళు పోసే పని . కిలకిలా గల గలా నవ్వుతూ చిందకుండా తలలు వంచి గ్లాసులలో నీళ్ళు పోస్తుంటే, ఆడపిల్లల వద్దిక చూసి ముచ్చట పడిపోతాం ఆకుల ముందు కూచున్న మనం . 


ఈలోగా వస్తాడు పూర్ణంబూరెల బుట్ట పుచ్చుకుని చినమామయ్య. 

ఈ మామయ్యకు లౌక్యం బాగా తెలుసు. 

బావా ! బామ్మర్దీ! ఏమే మరదలా ! మేనకోడలా ! అని పలకరిస్తున్నట్టే పలకరిస్తూ లాఘవంగా రెండు బూరెలు వడ్డించిపోతుంటాడు వేగంగా. ఇంకోటి వేయవయ్యా ! అంటున్నా మాటలు చెవిని వేసుకోనే వేసుకోడు. 


పెద్ద పళ్ళంలో కనపడేట్టు పట్టుకుని పొడుగ్గా ఉన్న అరటికాయ బజ్జీ అందంగా వడ్డించి పోతాడు నూనూగు మీసాల మేనల్లుడు మరో మాటుండదు. 


వచ్చి ఆకులో ఇటుపక్క  చెంమ్చాతో చూసి చూసి వడ్డిస్తుంది దోసావకాయను , పెళ్ళై ఇద్దరు పిల్లలున్న నంగనాచి మేనకోడలు. 

ఆ దోసావకాయ ఘాటుకు నోట్లో నీళ్ళూరి , ‘అదేమిటే ఆ  విదపడం ..ఇంకొంచం వేయచ్చు కదే ‘అంటే , 

‘ముందు అది తినవమ్మా తర్వాత మళ్ళా వేస్తా ‘అంటూ తన పిల్లలకు చెప్పినట్టు చెపుతూ చక్కా పోతుంది. 


తర్వాత కొత్తావకాయని అత్తయ్య పట్టుకొస్తుంది . 

ఈ రంగు చూసావా వదినా! 

నే దగ్గరుండి గుంటూరు మిరపకాయలు ఆడించి కలిపించాను, ముక్క కసుక్కుమంటోంది కొరికితే ‘ అంటూ పెచ్చుతో సహా ఎర్రెర్రని ఆవకాయ వడ్డించి అందరి మనసు రంజింప చేస్తుంది. 


పచ్చళ్ళ గుత్తి పుచ్చుకొని తెల్లటి లాల్చీ పైజమా వేసుకున్న బాబయ్య వస్తాడు వడ్డించడానికి. ఈ బాబయ్య ఎప్పుడూ తెల్లటి బట్టలే వేసుకొని చల్లగా నవ్వుతుంటాడు. 

పైగా వడ్డింపుకు పట్టుకొచ్చినదో.. 

రుచులూరించే గోంగూర పచ్చడి దానికి తగ్గట్టుగా గొప్పకబుర్లు చెపుతూ’ మీ పిన్ని చేత చేయించాను, ఆకంతా నేనొక్కడినే వలిచాను తెలుసా ‘ అంటూ. ఆచేత్తోనే గుత్తి రెండో భాగంలో ఉన్న తాజాగా ఘుమ ఘుమలాడే కొబ్బరికాయ మామిడికాయ కలిపిన పచ్చడి వడ్డించేసి పోతాడు. 


తర్వాత అమాయకపు పిన్ని వంతు. పట్టెడు పట్టెడు పులిహోర వెనకాడకుండా వడ్డిస్తుంటుంది, వరసలో కుర్రవెధవ నాకు వేరుశనగపలుకులు ఎక్కువ రాలేదంటే, మళ్ళీ వెనక్కి వెళ్ళి చిరునవ్వుతో వడ్డిస్తుంది. ‘సుబ్బరంగా తినండి , లేకపోతే అక్క నన్ను కోప్పడుతుంది ‘ అంటుంది తెచ్చుకున్న పెద్దరికంతో. 


ప్రత్యేకంగా పనసపొట్టు కూర గంపలో వేసుకు పట్టుకువస్తాడు వంటపంతులు మామ. ఎంతో కష్టపడి చేసిన ఆ కూర తన చేత్తో తానే వడ్డించాలని, పదిమందికీ తన వంట నైపుణ్యం చెప్పాలని , పనసపొట్టు కొట్టిన దగ్గరనుంచి పోపు పుష్కలంగా వేసానని , జీడిపప్పుకు మొహమాటపడలేదని,  కొంచం ఆవ కూడా తగిలించానని వర్ణిస్తూ వడ్డిస్తుంటే మనం ఉవ్విళ్ళూరిపోతాం ఎప్పుడెప్పుడు నోటపెట్టుకుందామా అని. 


ఈలోగా ’గుత్తివంకాయ కూర ‘అంటూ అరుస్తూ వడ్డిస్తాడు అసిస్టెంటు కుర్రాడు , పరుగులే నుంచోడం లేదు. గరిట నుంచి జారి విస్తట్లో పడుతుంటుంది నూనె ఓడుతున్న నోరూరూంచేసే గుత్తి వంకాయ . ఎవరో అది చూడంగానే బంతిలో వారు కూనిరాగం తీస్తారు , *‘గుత్తివంకాయ కూరోయి బావా ”* అంటూ. 


పప్పు గోకర్ణంతో వస్తాడు పెళ్ళి కూతురు అన్నగారు. చెల్లెలి పెళ్ళిపనుల పర్యవేక్షించి అలసిపోయినట్టున్నా , వడ్డింపు పనికి కూడా పరుగెట్టుకొచ్చాడు. మరి ఇదే కదా అన్నిటికన్నా ముఖ్యమైన పని, వచ్చిన అతిధులను భోజనంతో ఆదరించడం . పేరుకు పప్పు గోకర్ణం పట్టుకు వడ్డిస్తున్నా , పది కళ్ళు పెట్టుకు చూస్తున్నాడు అందరకీ అన్నీ అందుతున్నాయా, వడ్డింపులు సరిగా సాగుతున్నాయా అని. అంత హడావిడిలోనూ ఆకులో మామిడికాయ పప్పు వడ్డిస్తూ మొహంలో నవ్వు చెదరనివ్వనేలేదు.  


సిల్కు వల్లెవాటు జారిపోతుంటే సద్దుకుంటూ, మొహం మీది ముంగురులు వెనక్కి తోసుకుంటూ, అక్క పెళ్ళికి సందడి అంతా తానై తిరుగుతున్న కాటుక కళ్ళ చిన్నది, పెళ్ళి కూతురు చెల్లి అప్పడాలు,గుమ్మడి వడియాలు,ఊర మిరపకాయ వడ్డిస్తోంది హుషారుగా. కాని ఒకళ్ళకి వడియం వడ్డించడం, వదిలేస్తే ఇంకోరికి ఊరమిరపకాయ సొడ్డు పెడుతోంది , నలుగురినీ ఒక్కదగ్గరగా చూసిన గాభారాలో. పైగా పొలోమంటూ ఈ పిల్లను చూడగానే ప్రతీవాళ్ళూ పరాచికాలాడటమే. 

*‘ఏమిటా కంగారు అంటూ ‘తర్వాత నీదే కదా ఛాన్స్’,* *నువ్వెప్పుడు పెట్టిస్తావే పప్పన్నం’* 

ఇవ్వన్నీ వింటూ ఆ పిల్ల సిగ్గుపడిపోయి మరింత కంగారుపడి , కనిపించిన వదిన గారికి ఆ అప్పడాలు అప్పచెప్పి తుర్రుమంది. 


వెంట అన్నం పట్టించుకుని చేతిలో నేతి కొమ్ముజారీ పట్టుకుని పట్టుచీరతో అక్షింతలు పూలరేకులు కాసిని మీదపడి అంటుకున్నవాటితో ఆమట్ని ఆపసోపాలు పడుతూ వస్తుంది పెద్దమ్మ , పెళ్ళికూతురు తల్లి యజమానురాలు. మొహమంతా పెళ్ళి నిర్విఘ్న్నంగా జరిగిందన్న తృప్తీ సంతోషమూనూ. 

ప్రతి వక్కరనీ పేరుపేరునా వరసలతో పలకరిస్తూ పెద్దవాళ్ళని ‘ ‘అన్నయ్యా! వచ్చి నీ చేతుల మీదుగా 

మా పిల్ల పెళ్ళి జరిపించావు, వదినా భోజమనమయ్యేక బొట్టెట్టించుకుని తాంబూలం తీసుకు వెళ్ళండమ్మా’ అంటూనూ’ 

తమ్ముడూ ! నువ్వొచ్చావు ఎంతో సంతోషం , అమ్మాయీ లక్షీమీదేవి లాగ ఉన్నావమ్మా’ అంటూ చిన్నవాళ్ళనీ పలకరించుతూ, వడ్డించిన అన్నం మరికాస్త కలపండి మొహమాటం లేకుండ భోంచేయమని చెపుతూ , చాలు చాలంటున్నా నేయి ధార కట్టిస్తుంది విస్తట్లో. 


ఈలోగా అల్లక్కడ లోపలనుంచి  *‘తప్పుకోండి , తప్పుకోండి వేడి వేడి గుమ్మడికాయ దప్పళం వస్తోంది’* అని కేకలు వినిపిస్తుంటాయి . 

మనం అయితే దప్పళానికి ఖాళీ ఉంచుకోవాలనుకుంటూ, అన్నీ తినేసి కొంత అన్నం మధ్యలో గుంట చేసి పెట్టుకొని అందులో వేడి వేడి ముక్కల పులుసు పోయించుకొని మైమరచి తింటాము. 


అప్పుడొస్తాడు పెళ్ళి పెద్ద గృహయజమాని కన్యాదాత , కమ్మని గట్టి పెరుగు దగ్గరుండి వెంటబెట్టించుకుని. జోడీగా చక్కెరకేళీ,అరటిపండు .విస్తట్లో పెరుగుకు అన్నం ఏదని కేకలు పెట్టి మళ్ళీ అన్నం వడ్డిపిస్తాడు. అన్నీ అందాయా లోటేమీ జరగలేదు కదా అని కనుక్కుంటాడు. 

అతని మొహంలో భారం దిగిన తేలిక తృప్తి సంతోషం పరవళ్ళు తొక్కుతున్నా పొంగిపోకుండా అందరకీ తన ఆహ్వానం అందుకొని పెళ్ళికి వచ్చినందుకు పేరు పేరునా కృతజ్ఞతలు చెప్పుకుంటాడు. ఇంకా చేయవలసిన బాధ్యతలు తలచుకుంటూ అందరనీ గబ గబా చిరునవ్వుతో తలపంకించి చూస్తూ అభినందనలు అందుకుంటూ ముందుకెడుతుంటాడు. 


ఈయనకు ఎదురు వస్తాడు అత్తాకోడలంచు పంచా, కండువా సవరించుకుంటూ, పెళ్ళికూతురి తండ్రికి ప్రాణస్నేహితుడుట. ‘ ప్రత్యేకించి పురమాయించి చేయించాను, మాపిల్ల పెళ్ళి కోసం’ అంటూ  బూందీ మిఠాయి , పాకం కాజా వేసి, ‘ వదలకుండా తినాలి’ అని బెదిరించి మరీ వెడతాడు. 


చివరలో ఎవరు పెట్టి పోయారో గమనించముగాని , భోజనం పూర్తి చేసి తలఎత్తి చూసేటప్పటికి సుగంధభరితమైన తియ్యని కిళ్ళీ ఉంటుంది, మంచినీళ్ళ గ్లాసు పక్కన. 


కిళ్ళీ నోట్లో బిగించి , ఎదురుగా చూస్తే పందిట్లో ఓ పక్క వెండి కంచాలలో వధూవరులకు భోజనం వడ్డించి, స్నేహితులు వరసైన వారు పరాచికాలాడుతూ వారిని ఒకరికొకరు తినిపించుకోవాలని గొడవ చేస్తుంటారు. సిగ్గులతో ఓరచూపులతో కొంటె నవ్వులతో,ఒకళ్ళకొకళ్ళు తినిపించుకుంటూ ఒకరు కొరికిన మిఠాయి మరోకరు కొరుకుతూ , జీవితంలోని మధురిమలను రుచులను కలిసి అందుకోవడానికి సిద్ధమైన వారిని దూరం నుంచే మనసులో  కలకాలం సుఖంగా బతకమని ఆశీర్వదించి, భుక్తాయాసంతో ఇంటిదారి పడతాం మనం. 


*మరి ఈరోజుల్లో ఆ సరదాలు ఎక్కడ కానరావాయే....* 


*ఆ రోజులు మళ్లీ రావు, కదా, వస్తె ఎంత బాగుండు?*

  

.... *శ్రీమతి జానకి చామర్తి గారి రచన*

🙏🙏🙏🌹🌹🌹👌😊

కామెంట్‌లు లేవు: