మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..
*మాయమైన మాయరోగం..*
"బాబూ! నేను పరంధామయ్యను నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను.." అని ఫోన్ చేశారు.."చెప్పండి.." అన్నాను..
పరంధామయ్య గారు వయసులో పెద్దవారు..శ్రీ స్వామివారు మాలకొండలో తపస్సు చేసుకునే రోజుల్లోనే దర్శించుకున్న వ్యక్తి..శ్రీ స్వామివారంటే అపరిమిత భక్తి విశ్వాసాలు కలిగిన వారు..శ్రీ స్వామివారు సిద్ధిపొందిన తొలినాళ్లలో తరచూ మొగలిచెర్ల కు వచ్చి శ్రీ స్వామివారి సమాధిని దర్శించుకొని వెళ్లేవారు..శ్రీ స్వామివారి దయవల్లే తనకు సంతానం కలిగిందని చెప్పేవారు..రోజులు గడిచేకొద్దీ..పనుల వత్తిడి వల్లనో..లేక మరే కారణమో తెలీదు కానీ..పరంధామయ్య గారు క్రమేపీ మొగలిచెర్ల రావడం తగ్గి పోయింది..సంవత్సరానికోకసారి వచ్చి వెళుతున్నారు..ఆ పరంధామయ్య గారు చాలా రోజుల తరువాత ఫోన్ చేశారు..
" బాబూ..మా అబ్బాయి మాట్లాడతాడట..ఒకసారి వాడితో మాట్లాడు.." అన్నారు..పరంధామయ్య గారి స్వరం లోని ఆందోళన నాకు అర్ధం అవుతూనే వున్నది..తీవ్రమైన వత్తిడి లో ఉన్నట్లు తోచింది.."సరే!" అన్నాను..
"ప్రసాద్ గారూ..మా ఆవిడకు నెలలు నిండాయి..రెండు రోజుల్లో డెలివరీ అవుతుందని డాక్టర్ గారు చెప్పారు..దాదాపుగా నాలుగు నెలల నుంచీ తాను బెడ్ రెస్ట్ లోనే ఉంది..ఆపరేషన్ చెయ్యాలి అని డాక్టర్ చెప్పారు..ఒకసారి స్వామి వారి వద్ద మా పేరుతో అర్చన చేయించండి..మాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది..మా గోత్రము, మా పూర్తి పేర్లు మీకు మెస్సేజ్ చేస్తాను..ఏమీ అనుకోకుండా..దయచేసి ఈ పని చేసి పెట్టండి..నేను కంగారు పడుతుంటే నాన్నగారు నన్ను స్వామివారికి మొక్కుకోమని చెప్పారు.." అన్నాడు..అలాగే అన్నాను..
ఆరోజే వాళ్ళపేరుతో అర్చన చేయించాను..ప్రక్కరోజు ఉదయం పరంధామయ్య గారే మొగలిచెర్ల వచ్చారు..శ్రీ స్వామివారి సమాధిని దర్శించుకున్నారు..నమస్కారం చేసుకొని ఇవతలికి వచ్చి.."ఒకసారి స్వామిని దర్శనం చేసుకోవాలని అనిపించింది బాబూ..అందుకోసం వచ్చాను..కోడలు కు ఆపరేషన్ చేయాలని చెప్పారు..సమస్య ఏమిటో చెప్పటం లేదు కానీ..ఈ ఒక్క సంతానం తోనే సరి పెట్టుకోవాలని..ఇక పిల్లలు పుట్టకుండా కూడా ఆపరేషన్ చేస్తామని కూడా డాక్టరమ్మ గారు చెప్పారు..చాలా కొద్దిమందిలో ఇటువంటి సమస్య వస్తుందట..ఈ మాయరోగం మా అమ్మాయికి వచ్చింది..ఏం చేస్తాము?..నాకు ఏ కష్టం వచ్చినా ఈ స్వామే తీర్చాడు..ఆయన్నే నమ్ముకున్నాను..ఇప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలని మొక్కుకున్నాను.."అన్నారు..శ్రీ స్వామివారి విభూతి, గంధం..తీసుకొని వెళ్లిపోయారు..
సరిగ్గా పదిహేను రోజుల తరువాత పరంధామయ్య గారు మళ్లీ మొగలిచెర్ల వచ్చారు..ఈసారి ఆయన ముఖం లో సంతోషం తాండవిస్తోంది..మందిరం లోపలికి రాగానే..కాళ్ళూ చేతులూ కడుక్కొని..నేరుగా శ్రీ స్వామివారి సమాధి వద్దకు వెళ్లారు..సమాధి వద్ద నమస్కారం చేసుకొని..ఉత్సవ విగ్రహం వద్దకు వచ్చి, తన కొడుకు, కోడలు పేరుతో అర్చన చేయించారు..
"స్వామివారు సాక్షాత్తుగా నా వెనుకే వున్నారు బాబూ..ఆరోజు విభూతి, గంధం ఇక్కడినుండి తీసుకెళ్లి..అబ్బాయి చేతికిచ్చి..అమ్మాయి నుదుటికి రాయమని చెప్పాను..వీడు అమ్మాయికి విభూతి రాసి..మిగిలింది అమ్మాయి తలగడ క్రింద పెట్టాడు..తెల్లవారుఝామున అమ్మాయికి నొప్పులు వచ్చాయి..హాస్పిటల్ కు తీసుకెళ్లాము..చిత్రంగా మామూలు గా కాన్పు అయింది..ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలి అని చెప్పిన ఆ డాక్టర్ గారి చేతుల మీదుగానే కాన్పు అయింది..ఆడపిల్ల పుట్టింది..ఇద్దరూ క్షేమంగా వున్నారు..ఏ ఇబ్బందీ జరుగలేదు..ఆ అంటు తీరిపోగానే..నేను ఇలా స్వామివారి దర్శనానికి వచ్చేసాను..అంతా స్వామి దయ.." అన్నారు..
"అదేదో అరుదైన లోపం వల్ల ఆపరేషన్ అన్నారు కదా.." అన్నాను.."అదేబాబూ నేను చెప్పేది..ఏ లోపం లేదు..అంతా సవ్యంగా ఉంది అని ఆ డాక్టరే చెప్పింది.." అన్నారు పరంధామయ్య గారు సంతోషంతో..
మరో రెండేళ్ల తరువాత పరంధామయ్య గారికి మనుమడు పుట్టాడు..ఒక శనివారం నాడు పిల్లలను తీసుకొని మాలకొండ వెళ్లి శ్రీ లక్ష్మీనృసింహుడి దర్శనం చేసుకొని..అక్కడినుండి మొగలిచెర్ల లోని శ్రీ స్వామివారి పల్లకీసేవ లో పాల్గొని..ఆరోజు రాత్రి, ఆ ప్రక్కరోజు ఆదివారం మధ్యాహ్నం అన్నదానం చేసి..సంతోషంతో తిరిగి వెళ్లారు..
సర్వం..
శ్రీ దత్తకృప!.
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం.. ప్రకాశం జిల్లా..పిన్: 523 114..సెల్..94402 66380 & 99089 73699).
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి