మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..
*పారాయణం తో పరివర్తన..*
"నువ్వు నీ చాదస్తం తో నన్ను కాల్చుకు తినొద్దు..నన్ను నీకు తోడుగా రమ్మన్నావు..నీతో పాటు వచ్చాను..నువ్వు పారాయణమే చేసుకుంటావో..పొర్లుదండాలు పెడతావో..నీ ఇష్టం..అవన్నీ చేయమని నన్ను బలవంతం చేయకు.." అని ఖరాఖండిగా తేల్చి చెప్పేసింది..అలా మాట్లాడుతున్న కూతురుని చూసి మౌనంగా తలూపింది ఆ పిల్ల తల్లి..ఆ అమ్మాయి వయసు పాతికేళ్ల లోపే..తల్లికి సుమారు నలభైఐదేళ్ల వయసు ఉన్నది..ఆమె పేరు రాజేశ్వరి గారు..ఆ అమ్మాయి పేరు కల్యాణి.
ఆ తల్లీకూతుళ్ళు ఆరోజు ఉదయమే శ్రీ స్వామివారి మందిరానికి బస్సులో వచ్చారు..బస్సు దిగగానే..రాజేశ్వరి గారు నేరుగా బావి వద్దకు వెళ్లి తన కాళ్ళూ చేతులూ కడుక్కొని..కొన్ని నీళ్లు నెత్తిన చల్లుకుని..కూతురి నెత్తిమీద కూడా చల్లింది.. అప్పుడే ఆ అమ్మాయి చిరాగ్గా ముఖం పెట్టుకున్నది..ఆ అమ్మాయికి దైవం మీద పెద్దగా విశ్వాసం లేదు..పైగా భక్తి, విశ్వాసాలు కలిగిన వారిని చూస్తే చిరాకు కూడా..శ్రీ స్వామివారి మందిరానికి కూడా కేవలం తన తల్లి తోడుగా రమ్మని బలవంతం చేస్తే వచ్చింది..వచ్చే ముందు కూడా తల్లితో తనను నమస్కారం పెట్టమని బలవంతం చేయొద్దని చెప్పింది....సరే అని చెప్పి బైలుదేరింది ఆవిడ..
శ్రీ స్వామివారి మందిరం లోపలికి వచ్చి..శ్రీ స్వామివారి ప్రధాన మంటపం చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేసి..అర్చన చేయించుకొని..ముందున్న మంటపం లో కూర్చున్నారు రాజేశ్వరి గారు.. ఆరోజు ఆదివారం..భక్తులు ఎక్కువగానే వచ్చారు..శ్రీ స్వామివారి మందిరం కోలాహలంగా ఉన్నది..కొందరు జుట్టు విరబోసుకొని..మందిరం చుట్టూ కేకలు పెడుతూ పరిగెడుతున్నారు..మరికొందరు మంటపం లో పడుకొని వున్నారు..ఇంకొందరు "దత్తాత్రేయా మమ్ములను చల్లంగా చూడు.." అని గట్టిగా ప్రార్ధిస్తున్నారు..మందిరానికి బైట వైపు..భజన జరుగుతున్నది..పరిసరాలు మరచిపోయి భజన చేస్తున్నారు కొందరు..ఇంత సేపూ ఆ అమ్మాయి మంటపం లో కూర్చుని అందరినీ గమనిస్తోంది..
ఏ మహత్తూ లేకపోతే.. ఇంతమంది..ఇంత విశ్వాసం తో ఇక్కడికి ఎందుకొస్తారు?..అని మొదటిసారిగా ఆ అమ్మాయి మనసులో సందేహం మొదలైంది..మెల్లిగా వాళ్ళమ్మ దగ్గరకు వెళ్లి.."అమ్మా..ఇందాకటి నుంచి గమనిస్తున్నాను..ఇక్కడ సిద్ధిపొందిన ఈ స్వామివారి మీద అందరికీ ఇంతటి భక్తి విశ్వాసాలున్నాయి..ఏమిటీ మహాత్యం?.."అని అడిగింది..అలా అడిగిన కూతురి వైపు ఆశ్చర్యంగా చూసిన ఆ తల్లి..తాను పారాయణం చేస్తున్న శ్రీ స్వామివారి జీవిత చరిత్రను చదవమని ఆ అమ్మాయికి ఇచ్చింది..
"పారాయణమే చేస్తావో..పొర్లుదండాలే పెడతావో..నీ ఇష్టం.." అని చెప్పిన ఆ పిల్ల..కేవలం రెండుగంటల సేపు శ్రీ స్వామివారి మందిరం లో గడిపి..మనసులో ఏర్పడిన కుతూహలం కారణంగా శ్రీ స్వామివారి జీవిత చరిత్రను పారాయణం చేయడం మొదలుపెట్టింది..సాయంత్రం నాలుగు గంటలకు ఆ పుస్తకాన్ని పూర్తిగా చదవడం పూర్తిచేసింది..తన తల్లి దగ్గరకు వచ్చి.."అమ్మా..స్వామివారి సమాధిని దర్శించుకుంటాను.." అన్నది..అనడమే కాదు..తల్లిని వెంటబెట్టుకొని..శ్రీ స్వామివారి సమాధి దర్శనం చేసుకొని..అర్చన కూడా చేయించుకున్నది..మంటపం లో ఉన్న శ్రీ స్వామివారి చిత్రపటానికి తల ఆనించి కొద్దిసేపు నిలబడింది..ఆ సమయంలో ఆ అమ్మాయి కళ్ల నుంచి అశ్రువులు ధారగా కారుతున్నాయి..స్వామివారి మీద భక్తి వల్లనా.. లేక పశ్చాత్తాపం వల్లనా అనేది ఆ దైవానికే తెలియాలి..
అంతవరకూ ఆ అమ్మాయిలో ఉన్న మొండితనం..దైవం పట్ల ఉన్న నిరసన భావం ఎటుపోయాయో తెలీదు..ఆ నిమిషం వరకూ..కల్యాణి అని పిలువబడే ఆ అమ్మాయి..మొగలిచెర్ల గ్రామం వద్ద సిద్ధిపొందిన శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి భక్తురాలు కల్యాణి గా మారిపోయింది..మరెప్పుడూ దైవం పట్ల చులకన భావాన్ని ప్రదర్శించలేదు..ప్రస్తుతం వివాహం చేసుకొని సాఫ్టువేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న కల్యాణి ..ప్రతి సంవత్సరం రెండుసార్లు భర్త తో సహా శ్రీ స్వామివారి మందిరాన్ని దర్శిస్తున్నది...ఒకప్పుడు "ఏమిటీ మహాత్యం?.." అని తన తల్లిని ప్రశ్నించిన కల్యాణి..తన లో వచ్చిన మార్పే ఆ మహాత్యం అని గ్రహించింది..శ్రీ స్వామివారిని దర్శించడానికి భర్తతో కలిసి మందిరానికి వచ్చిన ప్రతిసారీ..భక్తులకు అన్నదానం చేసి..తిరిగి వెళ్లడం కల్యాణి కి ఆనవాయితీగా మారిపోయింది..కల్యాణి ఈ విధంగా మారిపోవడానికి శ్రీ స్వామివారి చల్లని కరుణ కాక మరేమిటి?..
సర్వం..
దత్తకృప.
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్: 523114.. సెల్..94402 66380 & 99089 73699).
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి