10, ఏప్రిల్ 2022, ఆదివారం

పంచ కట్టు

పంచ కట్టు 

బ్రాహ్మడు అయిన ప్రతివారు ప్రతి నిత్యం నిత్య నైమిత్తిక కర్మలను ఆచరించాలి. అంటే సంధ్యావందనం, దేవతార్చన మొదలగునవి. బ్రాహ్మడు తానూ చేసే కర్మలను విధిగా పంచ కట్టుకొని ఆచరించాలి, అది సాంప్రదాయం. కానీ ఈ ఆధునిక ప్రపంచ ప్రభావం ఏమిటో కాని బ్రాహ్మడు పంచ కట్టుకోవటానికి కూడా నామోషీ పడుతున్నాడు అని చెప్పటానికి మనం బాధపడవలసి వస్తున్నది. 

ఇప్పుడు వున్న సమాజంలో మనం బ్రహమణులను రెండు తరగతులుగా విభజించ వచ్చని నేను అనుకుంటాను ఈ విషయాన్నీ సర్వులు సమర్ధిస్తారని భావిస్తాను. అదేమిటంటే 1) వృత్తిలో వున్న  బ్రాహ్మలు 2)వృత్తిలో లేని బ్రాహ్మలు 

1) వృత్తిలో వున్న బ్రాహ్మలు: వీరు పురోహితులుగా, అర్చకులుగా వుంటూ సమాజానికి సేవలందిస్తున్నవారు. నిజానికి వీరినే సమాజం బ్రహ్మలుగా గుర్తిస్తున్నది అని కొంతవరకు అనుకోవచ్చు. వీరిలో చాలామటుకు చక్కగా సాంప్రదాయ బద్దంగా వుంటూ వేదపండితులుగా చెలామణి అయ్యే బ్రాహ్మణోత్తములు వున్నారు. తరువాత స్మార్తం నేర్చుకొని షోడశ కర్మలు ( షోడశకర్మలు హిందూ సాంప్రదాయములో ఆగమ సంబంధమయిన క్రియలు.ఇవి ప్రతి మనిషి  యొక్క జీవిత పర్యంతమూ వివిధ దశలలో జరుపబడతాయి.స్త్రీ, పురుష సమాగమము మొదలుకొని, జననము, మరణము మరియు తదనంతరము ఆత్మ పరలోకశాంతి నొందుట వరకు సంస్కారములు జరపబడును. ఈ పదహారు సంస్కారములను తిరిగి రెండు విభాగముల క్రింద విభజించారు. జనన పూర్వ సంస్కారములు (పుట్టుకకు ముందు), 1 గర్భాదానం 2 పుంసవనం 3 సీమంతం జననానంతర సంస్కారములు (పుట్టిన తరువాత).4 జాతకర్మ 5 నామకరణం 6 నిష్క్రమణ 7 అన్నప్రాశన 8 చూడాకరణ 9 కర్ణవేధ 10 అక్షరాభ్యాసం 11 ఉపనయనం 12 వేదారంభం 13 కేశాంత 14 సమావర్తన 15 వివాహం 16 అంత్యేష్టి ఈ కర్మల వివరణ ఇంకొక పర్యాయం తెలుపుతాను. ) చేయించే సత్ బ్రాహ్మలు కూడా వున్నారు. ఈ పదహారు కర్మలను చేయించగల సమర్ధుడైన బ్రాహ్మణోత్తముడిని షోడశ కర్మాధికారి అని పిలుస్తారు.  కాగా ప్రస్తుత కాలమాన పరిస్థితులలో చాల కర్మలను చేయటంలేదు, చేయించటంలేదు అంటే అతిశయోక్తి కాదేమో. ఇక చివరి కోవకు చెందినవారు అటు మంత్రపాఠం సరిగా నేర్చుకొనక, ఇటు సాధారణ విద్యను అభ్యసించక అటు ఇటుకాని స్థితిలో వుండి జీవనాధారం కొరకు పరి పరి ప్రయత్నాలు చేసి విఫలులై చివరకు కులవిద్య శరణ్యం అనుకోని పురోహిత్య వృత్తిలోకి ప్రవేశించే వారు.  వీరికి బ్రాహ్మణ కట్టు బొట్టు నచ్చవు, కానీ అన్యదా గతి లేదు కాబట్టి ఉదారపోషణార్ధం పురోహిత్య వృత్తి చేపడతారు. వీరికి పంచ కట్టుకోవటం నామోషీ, కొందరకు పంచ ధరించటం కూడా తెలియదు. కేశవ నామాలు (ప్రతి పూజ చేసే ముందు కేశవ నామాలు జపించాలి ఇవి మొత్తము 21 నామాలు ఇందులో మొదటి మూడు నామాలు జపించి ముమ్మారులు ఆచమన్యం (ఉద్ధరిణితో నీరు తీసుకొని కుడి చేతిలో పోసుకొని తీసుకోవాలి) తరువాత నామాలను పురోహితుడు జపిస్తారు. అవి కేశవ నామాలు 24 ఓం కేశవాయ స్వాహా ఓంనారాయణాయ స్వాహా ఓం మాధవాయ స్వాహా ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం హృషీకేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః ఓం సంకర్షణాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్ధాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం అధోక్షజాయ నమః ఓం నారసింహాయ నమః) కూడా సరిగా రావు వీరు కొన్ని సందర్భాలలో బ్రాహ్మణ శ్రేష్టులుగా వ్యవహరిస్తున్నారు కూడా . 

వీరి కోవకు చెందినవారు కొందరు ఇటీవల ఒక కొత్త పద్దతి కనిపెట్టారు అదేమిటంటే ధవళ వస్త్రము, కాషాయ వస్త్రము, ఆకుపచ్చ వస్త్రము, పసుపుపచ్చ వస్త్రము ఇందులో ఏదో ఒకటి తీసుకొని మధ్యకు మడచి లుంగిలాగా కట్టుకొని పైన ఒక ఉత్తరీయాన్ని ధరించి కార్యక్రమాలు యదేశ్చగా  నిర్వహిస్తున్నారు. వీరిని చుస్తే బహుశా బ్రాహ్మలు ఇలానే వస్త్ర ధారణ చేయాలేమో అని అనిపించే రీతిలో వారి ప్రవర్తన వుంటున్నది. ఇటువంటి విషయాలు పెక్కు గమనించటం వలన ఈ వ్యాసం వ్రాయవలసి వస్తున్నది. (ఇది ఎవ్వరిని ఉద్దేశించి కానీ లేక ఎవరినో విమర్శించాలనో వ్రాసింది కాదు కేవలం బ్రాహ్మణ సమాజం సరైన మార్గంలో పయనించాలని దృక్పధం తప్ప మరొకటి కాదని గమనించగలరు) 

2)వృత్తిలో లేని బ్రాహ్మలు ఇక వీరి గూర్చి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు అవపోశన పట్టి భుజించని వారుకూడా అనేకులు మన సమాజంలో వుంటున్నారంటే అబద్దం కాదు. వీరిలో ఎంతమంది మన సంప్రదాయాలను గౌరవిస్తున్ నారనేది ప్రస్నార్ధకమే . ప్రతి బ్రాహ్మణుడు తన ధర్మాన్ని తెలుసుకొని విధిగా ఆచరించి ఇతరులకు వారి ధర్మాన్ని తెలుపుతూ అందరిని ధర్మాచరణకు పురికొల్పవలసిన సమయం ఆసన్నమైనదని నేను భావిస్తున్నాను.

కాబట్టి మిత్రులారా బ్రాహ్మడు తప్పనిసరిగా పంచ కట్టుకోవటం నేర్చుకోవాలి. బ్రాహ్మడు పంచ ధరించటం ఇతరులు ధరించటానికన్నా బిన్నంగా ఉంటుంది అదేమిటంటే కుచ్చిళ్ళు బైటకు కనపడకూడదు ఆలా కుచ్చిళ్ళు బైటకు కనపడే విధంగా పంచ కట్టడాన్ని రాజస  అంటారు. బ్రాహ్మడు సాత్వికుడు ఎప్పుడు మొఖంలో సత్వగుణం విరాజిల్లుతూ  కాబట్టి కుచ్చిళ్ళు దోపుకొని పంచ కట్టుకోవాలి. లుంగిలాగా ఎట్టి పరిస్థితిలో కట్టుకొని ఎలాంటి అర్చనలు చేయకూడదు చేయించకూడదు. ఆలా చేయటం దోషమని గమనించాలి 

సోదరులారా ఎన్నోవేల జన్మల తరువాత మనకు మానవ జన్మ లభించింది అందునా బ్రాహ్మణ జన్మ ఇంకా అందులో పురుష జన్మ (స్త్రీలు మోక్షానికి అర్హులు కారా అని మీరు అడుగవచ్చు మోక్ష సాధనకు స్త్రీ పురుష వత్యాసం లేదు ఇంకొక పర్యాయం ఈ విషయాన్నీ చేర్చిద్దాము) లభించింది కాబట్టి మనం మన లక్ష్యం బ్రహ్మ జ్ఞ్యాన సముపార్జన మీదనే ఉండాలి కేవలము జీవనం సాధించటం కొరకు మాత్రమే ధర్మ బద్దంగా సంపాదించి మన అమూల్య కాలాన్ని మోక్ష సాధనకు మాత్రమే  వినియోగించాలి. 

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః

 

కామెంట్‌లు లేవు: