10, ఏప్రిల్ 2022, ఆదివారం

శ్రీరామో లలితాంబికా

 శ్రీరామో లలితాంబికా...🙏


ముందుగా వసంత నవరాత్రులు.., దసరా నవరాత్రులు రెండూ వేరు వేరు అని తెలుసుకోండి.


తెలుగువారి తొలి పండుగ అయిన ఉగాది నుండి శ్రీరామనవమి వరకూ వసంత నవరాత్రులు... నవ అంటే తొమ్మిది.., కొత్త అని అర్థాలు.


తొమ్మిది రాత్రులు ఎందుకంటే భక్తి తొమ్మిది రకాలు ...

(1) శ్రవణం, (2) కీర్తనం, (3) విష్ణో:స్మరణం

 (4) పాదసేవనం (5) అర్చనం (6) వందనం

 (7) దాస్యం (8) సఖ్యం (9) ఆత్మ నివేదనం


నవరాత్రులు తొమ్మిది రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క భక్తి మార్గాన్ని ఎంచుకుని..  తొమ్మిది రోజులు తొమ్మది భక్తి మార్గాలతో భగవంతుని సేవించి తరించడానికి ఈ నవరాత్రులు..


వసంత నవరాత్రులు : సంవత్సర చక్రంలో వసంత శరదృతువులు రెండూ ప్రాణులకు రోగ కారకమైనవి. కోరలతో భయంకరంగా ఉన్న తన నోరు తెరుచుకొని వికటాట్టాహాసం చేస్తూ , ప్రాణులను మృత్యుదేవత కబళించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. మృత్యుముఖంలో పడకుండా తప్పించుకో దలచిన వారు పరమేశ్వరిని సేవించి ఆమె అనుగ్రహాన్ని పొందాలి. అపమృత్యు వినాశినియై , సర్వాపద నివారిణియై విరాజిల్లే ఆ జగన్మాతను ప్రార్థించిన వారు ఆయా ఋతువుల్లో రోగభాధలను, మృత్యుభయాన్ని జయించ గలుగుతారని , ఇందుకై నవరాత్రులలో పరమేశ్వరిని పూజించాలని వ్యాసుడు జనమేజయునకు నవరాత్రి పూజా విధానాన్ని వివరించాడు.


సంవత్సరారంభంలో చైత్ర శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు గల తొమ్మిది రోజులూ వసంత నవరాత్రాలు అని , అర్థ సంవత్సరం గడచిన తర్వాత శరదృతువు ఆరంభంలో ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు గల తొమ్మిది రోజులూ శరన్నవరాత్రులు అని వ్యవహరింప బడతాయి.


వసంత నవరాత్రులలో శ్రీరామచంద్రుని మనం ఆరాధిస్తాం. రామచంద్రుడు పురుష రూపంలో ఉన్న లలితాదేవి అని సాధకుల విశ్వాసం. "శ్రీరామో లలితాంబికా" అని పురాణాలు వివరిస్తున్నాయి. నేటికీ ఉత్తర భారతదేశంలో రామలీలా మహోత్సవాలు అనే పేరుతో వసంత నవరాత్రులలో దేవీ పూజలు నిర్వహించే సంప్రదాయం ఆచరణలో ఉన్నది. శరన్నవరాత్రులలో దేవిని ఆరాధించడం అనూచారంగా వస్తున్న ఆచారం.


వసంత నవరాత్రులలో కుమారీ పూజ విశిష్టమైనది. ఈ పూజలో పాడ్యమి నుండి నవమి వరకు వరుసగా రెండు సంవత్సరాల వయస్సు గల కన్య మొదలుకొని పది సంవత్సరాల వయస్సు గల కన్య వరకు ఆయా దేవతా నామాలతో అర్చన చేసి సుగంధ ద్రవ్యాలు, మంగళ ద్రవ్యాలు సమర్పించాలి.


వసంత నవరాత్రి అవతారాలు :


 (1) పాడ్యమి నాడు రెండు సంవత్సరాల కన్య "కుమారిక !",

 (2) విదియనాడు మూడు సంవత్సరాల కన్య "త్రిమూర్తి ", 

(3) తదియ నాడు నాలుగు సంవత్సరాల కన్య "కల్యాణి",

 (4) చవితి నాడు ఐదు సంవత్సరాల కన్య "రోహిణి", 

(5) పంచమి నాడు ఆరు సంవత్సరాల కన్య"కాళిక ", 

(6) షష్ఠి నాడు ఏడు సంవత్సరాల కన్య "చండిక", 

(7) సప్తమి నాడు ఎనిమిది సంవత్సరాల కన్య "శాంభవి", 

(8) అష్టమి నాడు తొమ్మిది సంవత్సరాల కన్య "దుర్గ", 

(9) నవమి నాడు పది సంవత్సరాల కన్య "సుభద్ర". వసంత నవరాత్రి వ్రతం పాటించాలి..


దేవీ నవరాత్రుల అవతారాలు : 

(1) శైలపుత్రి, (2) బ్రహ్మచారిణి దేవి,

 (3) చంద్రఘంటాదేవి, (4) కూష్మాండ దేవి,

 (5) స్కందమాతాదేవి, (6) కాత్యాయని దేవి,

 (7) కాళరాత్రి దేవి, (8) మహాగౌరీ దేవి,

 (9)సిద్ధిదాత్రి దేవి


🙏శ్రీ మాత్రే నమః🙏

కామెంట్‌లు లేవు: