బృందావనం దగ్గరలో కాన్వెంట్ స్కూల్ లో చదువుతున్నట్టి రెహమాన్ అనే పిల్లవాడు రోజూ పిల్లలతో కలిసి స్కూల్ కి వెళ్ళి వచ్చేవాడు. ఒకరోజు అలాగే వస్తుంటే చిన్న గుడి కిటికీలు తెరిచి ఉన్నాయి. పిల్లలు దణ్ణం పెట్టి వెళ్తున్నారు. ఈ రహమాన్ ఒక్కసారి కిటికీలోంచి చూడగానే రాధాదేవి మూర్తి కనపడింది. ఎవరు వాళ్ళు అంటే ‘శ్యామా శ్యాం’ అన్నారు. శ్యామా అంటే రాధ, శ్యాం అంటే కృష్ణుడు. ఈ పిల్లవాడిలో ఏం మేల్కొందో కానీ ‘శ్యామా, శ్యామా’ అంటూనే ఉన్నాడు. ఆ నోరు ఆగలేదు. ‘శ్యామా’ మహామంత్రం. పైగా రూపం చూశాడు కదా అది హృదయంలో హత్తుకు పోయింది. హృదయం నిండా ద్వాదశ వర్షీయ అయిన ఆ తల్లి సుకుమార రూపం. ‘శ్యామా శ్యామా’ అంటూ ఉన్నాడు. కళ్ళ నీళ్ళు వస్తున్నాయి. రసయోగం లక్షణం ఇది. వాళ్ళ నాన్నగారు కరడుగట్టిన ఛాందసవాది. మీర్జాసాహెబ్ ఆయన పేరు. ఆయన ఏమిటిరా కాఫీర్ ల పేరు పలుకుతున్నావు, నోర్ముయ్యి అన్నారు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని ఎలా హిమ్సిన్చాడో తెలియదు కానీ కొద్దిరోజుల క్రితం జరిగిన ఈ ఘట్టంలో ఒక హిరణ్యకశిపుడు, ఒక ప్రహ్లాదుడు కనపడ్డారు. నెత్తురు కారేటట్లు కొట్టారు పిల్లవాడిని. కానీ పిల్లవాడు చలించకుండా ‘శ్యామా శ్యామా’ అదే ఏడుపు. ఆఖరికి అక్కడ ఉన్న ధ్యాన్యం కొట్టంలో పడేశాడు. తిండి పెట్టలేదు. తల్లి అడ్డుకోబోతుంటే ఆమెని కూడా కఠినంగా త్రోసివేశాడు. ఆ పిల్లవాడు ఆకలి, దప్పిక అన్నీ మర్చిపోయి ‘శ్యామా, శ్యామా’ పదం మాత్రం వదలలేదు. తండ్రిలేని సమయంలో తల్లి వెళ్ళి నాన్నా ఆమాట మానెయ్యి అంటే అమ్మా! అన్నం మానేయగలను కానీ ఇది మానలేను. ఆవిడ నా హృదయంలో కనపడుతోంది. శ్యామా శ్యామా అంటూ ఉంటే నాన్న కొట్టింది కూడా నాకు తెలియట్లేదు. ప్రహ్లాదులు వంటి వారిని పురాణాలలో చదువుకోవడమే కాదు. అచ్చమైన భక్తులు నేటికీ ఉంటారు. వాళ్ళని చూసే యోగం మనకి లేదు అంతే. అందుకే హిందూ పురాణములు సర్వకాలిక సత్యములు. ఆశ్చర్యకరం ఒక రాత్రివేళ ఎలా దొరికిందో అవకాశం కానీ ఎవరో పిలిచినట్లు కాలినడకతో బయలుదేరి వెళ్ళిపోయాడు. ఎలా నడిచాడో తెలియదు. లాక్కువచ్చేవాడిది శక్తి. నడిచేవాడిది కాదిక్కడ. అది చలికాలం వేళ, కార్తీకం. రాత్రిపూట యమునానది ఒడ్డున ఉన్న మెట్టుపై కూర్చుని ‘శ్యామా శ్యామా’ అంటూ ఉన్నాడు. నామానికి మించిన మంత్రం లేదు. అదే నోరారా అంటే తరించిపోతాం. ఈ పిల్లవాడు శ్యామా శ్యామా అని ఏడుస్తూ ఉంటే బెంగాల్ నుంచి ప్రమోద్ కుమార్ చటోపాధ్యాయ అనే ఒక ప్రొఫెసర్ గారు, రాధాకృష్ణ ఉపాసకుడు, తరచూ బృందావనానికి వచ్చి వెళ్తూ ఉండేవారు. ఆయన వచ్చి మంచు పడని చోటు చూసుకుని జపం చేసుకుంటున్నాడు. ఎందుకంటే యమున మెట్టు మీద కూర్చునే సాహసం ఎవరూ చేయడంలేదు. ఎందుకంటే అక్కడ తీవ్రమైన మంచు. అక్కడ ధ్వని వినపడుతుంటే కొంచెం దూరం నుంచి వెళ్లి చూసి యితడు సామాన్యుడు కాదు అనుకున్నాడు. ఇప్పుడు ఈయన గారికి కూడా తపస్సు పండే యోగం వచ్చింది. ఆకాశం నుంచి ఒక కాంతిపుంజం దిగడం కనపడింది. ప్రమోద్ కుమార్ చటోపాధ్యాయకి కనపడింది. ఆ కాంతిపుంజంలోంచి ఒక స్త్రీ చేతిలో పాత్ర పట్టుకుని వచ్చి రహమాన్ ని పిలిచింది. రహమాన్ ఎవరు నువ్వు అన్నట్లుగా చూశాడు. ‘శ్యామా’ పంపితే వచ్చాను అన్నదిట. శ్యామా పంపించిందా? నన్ను తీసుకు వెళ్ళమని చెప్పు. నేను వెళ్ళిపోవాలి శ్యామాను చూడాలి అని ఏడుస్తున్నాడు. అంతకంటే గొప్ప ఏడుపు ఏం ఉంది. ఏడవకు ముందు నీరసపడిపోయావు నువ్వు బాగా. ఇది త్రాగు శ్యామా ఇచ్చి పంపింది అనగానే ఒక్కసారి త్రాగాడు. ఆ త్రాగిన తర్వాత ఆ తల్లి చెక్కిళ్ళు నిమిరి నువ్వు రేపు ప్రొద్దున రాధాకుండ్ లో స్నానానికి వెళ్ళు అని చెప్పి ఆమె అంతర్థానం అయిపొయింది. ఆవిడ పేరు చంపకలత. అమ్మవారి అష్ట సఖులలో ఒకావిడ. ప్రమోద్ కుమార్ చటోపాధ్యాయ వెళ్ళి ఏమిటయ్యా నీ భాగ్యం అని ఆ పిల్లవాడిని గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు. ప్రొద్దున ఈయన నిద్రలేచే లోపలే ఆ పిల్లవాడు రాధాకుండ్ కు వెళ్ళిపోయాడు. మరి కనపడలేదు. రాధాకృష్ణ తత్త్వంలో రహమాన్ బాలుడు లీనం అయ్యాడు. ఇది ఆ తల్లియొక్క అనుగ్రహం. భక్తికి మతం అడ్డా? ఈ ప్రమోద్ కుమార్ చటోపాధ్యాయ ఇదంతా చూసి స్వయంగా వ్యాసంగా వ్రాసి అక్కడ ‘శ్రీ జీ మందిర్’ అని రాధాదేవి మందిరంలో ఒక మాసపత్రిక ముద్రితం అవుతూ ఉంటే దీనిని అందులో ముద్రించమని కోరుకున్నాడు. వాళ్ళు ప్రింట్ చేశారు. ఇది రికార్డు చేయబడిన ఒకానొక సత్యగాథ.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి