మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి లీలలు..
*పిచ్చివాడు..పూజారి..*
2005 వ సంవత్సరం... 23ఏళ్ళ వయసు కల ఓ యువకుడిని, ఇద్దరు దంపతులు చేతుల మీద ఎత్తుకొని, మొగలిచెర్ల శ్రీ దత్తాత్రేయ స్వామి వారి సన్నిధికి తీసుకొని వచ్చారు..బలహీనంగా ఉన్న ఆ యువకుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నది.. వారం నుంచీ ఆహారం కాదుకదా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదా మనిషి..ఏ దిక్కూ తోచని ఆ దంపతులు, ఎవరి ద్వారానో స్వామి వారి మహిమల గురించి విని, చివరి ప్రయత్నంగా ఇక్కడకు తీసుకొచ్చారు..
పణిదెపు నరసింహాచారి, రమణమ్మ వాళ్ళ పేర్లు..పామూరు మండలం రేణిమడుగు గ్రామ వాస్తవ్యులు..వృత్తి, వ్యవసాయం, వడ్రంగి పని..ఇద్దరు సంతానం పెద్దది కూతురు..రెండవవాడు రామబ్రహ్మాచారి అని పిలవబడే ఈ యువకుడు.. లక్షణంగా ఉన్న సంసారం..అమ్మాయికి వివాహం చేశారు.. కుమారుడు రామబ్రహ్మాచారి స్వర్ణ కారుడిగా రాణిస్తున్నాడు..ఉన్నంతలో హాయిగా ఉన్నారు..
ఇంతలో ఏమైందో తెలీదు, రామబ్రహ్మాచారి మతిస్థిమితం లేకుండా పిచ్చి పిచ్చిగా ప్రవర్తించ సాగాడు.. పిల్లవాడి దుస్థితి చూసి తల్లిదండ్రులు కుమిలిపోయారు..రకరకాల పరీక్షలు అయ్యాయి..మొక్కని దైవం లేడు..ఫలితం లేదు..అంతుపట్టని వ్యాధి పెరుగుతోందే కాని తగ్గటం లేదు..అప్పుడప్పుడూ ఇతరుల మీదపడి కొట్టబోవటం లాంటి చర్యలకూ పాల్పడుతున్నాడు..క్రమంగా ఆహారం తీసుకోవటం తగ్గిపోయింది..ఆరోగ్యమూ క్షీణించసాగింది..యుక్తవయసులో ఉన్న కుమారుడు ఈ విధంగా మారటం, ఏ తల్లిదండ్రులకయినా మనోక్షోభే!
ఆఖరి అవకాశం గా శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరానికి తీసుకువచ్చి, ఆ స్వామి సమాధి వద్ద మొక్కుకున్నారు..చేతుల మీద ఎత్తుకొనే స్వామి మందిరం చుట్టూ ప్రదక్షిణాలు చేశారు.. వారం గడచిపోయేసరికి, పిల్లవాడిలో మార్పు వచ్చింది..మెల్లిగా తనంతట తానే నడవగలిగే స్థాయి కొచ్చాడు.. 41 రోజులపాటు (మండలం) స్వామి గుడివద్దే ఉండాలని నిశ్చయించుకున్నారు.. క్రమంగా స్వస్థత చేకూర సాగింది..ఒక్కొక్కరోజూ గడిచేకొద్దీ మార్పు స్పష్ఠంగా కనపడుతోంది.. రామబ్రహ్మం ఏ నిమిషంలో ఎలా ప్రవర్తిస్తాడో అని భయపడిన ఇతర భక్తులు కూడా ఆశ్చర్యపోయే విధంగా అతని ప్రవర్తనలో మార్పు వచ్చింది..
రామబ్రహ్మానికి కూడా ఆ దత్తాత్రేయుడి మీద సంపూర్ణ విశ్వాసం కలిగింది .. పూర్తి భక్తి పరుడిగా మారాడు..ఎంత మార్పు వచ్చిందంటే..నిశ్చలంగా గంటల తరబడి ధ్యానం లోనే గడిపే వాడు..మునుపటి మనోవికారపు చేష్టలు లేవు..సహనంగా వుండటమూ..శాంతంగా మాట్లాడటము అలవాటుగా మారిపోయాయి..రామబ్రహ్మం లో వచ్చిన మార్పు చూసి, అతనిని దగ్గరగా గమనిస్తున్న మేము సైతం ముక్కున వేలు వేసుకునేలా మారిపోయాడు..
అప్పుడే..మా తల్లిదండ్రులు నిర్మల ప్రభావతి, శ్రీధరరావు దంపతులు కూడా ఇతని గురించి విన్నారు..రామబ్రహ్మం లోని భక్తి మా అమ్మగారికి గారికి నచ్చింది..ఇతను కూడా సంపూర్ణ ఆరోగ్యవంతుడయినాడు.. దత్తాత్రేయ స్వామి మందిర ప్రాంగణం లొనే, ఓ పాముల పుట్టను భక్తులంతా నాగదత్తయ్య అనే పేరుతో కొలుస్తుంటారు.. అక్కడికి వచ్చే భక్తులకు తీర్ధం ఇచ్చే పని రామబ్రహ్మానికి అప్పచెప్పారు..అత్యంత భక్తి శ్రద్ధలతో చేయసాగాడు.. కొన్నాళ్ళు గడిచాక..రామబ్రహ్మం అందరిలాగే మసలుకోవడమూ..శ్రీ స్వామివారిని అత్యంత భక్తి శ్రద్ధలతో కొలవడమూ..నిత్యమూ దైవ చింతనలో గడపడమూ గమనించిన మా అమ్మగారు..రామబ్రహ్మానికి నచ్చచెప్పి.. ఒంగోలు లో దేవాదాయ శాఖ వారు నిర్వహించే వేద తరగతులకు ఇతనిని పంపారు.. ఆ శిక్షణ పొంది దేవాదాయ శాఖ వారు ఇచ్చిన సర్టిఫికేట్ తో తిరిగి మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామీ మందిరం చేరాడు రామబ్రహ్మం..
మా మొగలిచెర్ల గ్రామం లో పూర్వీకుల కాలం నుంచీ మా కుటుంబ వారసత్వంగా మా చేత నిర్వహింపబడుతున్న రామాలయం అర్చక బాధ్యతలు అప్పచెప్పారు..రామబ్రహ్మాన్ని దగ్గర కూర్చోబెట్టుకుని నిత్య పూజా విధానాన్ని మా అమ్మగారు నేర్పించారు..చక్కగా నేర్చుకున్నాడు..ఏలోటూ లేకుండా చక్కగా శ్రీరామాలయం బాధ్యతలను నిర్వహిస్తూ ఉన్నాడు..
రామబ్రహ్మాచారి సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడు, తల్లిదండ్రుల సంతోషానికి అవధులు లేవు, 2011 లో తగిన కన్యను చూసి వివాహం చేశారు..ఈ సమయంలోనే కావలి పట్టణం లోని శ్రీ కలుగోళమ్మ దేవస్థానం లో ఉప అర్చకుడి గా పనిచేసే అవకాశం వచ్చింది.. సంసారం పెరిగుతోంది, దానికి తగ్గ ఆదాయమూ కావాలి కదా!..కానీ అతని మనస్సంతా దత్తాత్రేయుడి పాదాలమీదే ఉన్నది..
ప్రతి శని ఆదివారాలు శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరానికి భక్తుల తాకిడి విశేషంగా ఉంటుంది.. ప్రస్తుతం ఉన్న అర్చక సిబ్బందితో ఉపాలయాలలో పూజలు సక్రమంగా జరపడం ఇబ్బంది గా ఉన్న కారణంగా ఇద్దరు పరిచారికలు (ఉప అర్చకులు) నియమించుకొనడానికి అనుమతి పత్రం దేవాదాయ శాఖ వారు ఇచ్చారు.."ఆ రెండురోజులూ శ్రీ స్వామివారి మందిరం లో అర్చక బాధ్యతలు నిర్వహిస్తావా" అని రామబ్రహ్మాన్ని అడిగాను నేను..సంతోషంగా అంగీకరించాడు...శ్రీ స్వామివారు తన భక్తుడిని వారం లో రెండురోజుల పాటు తన ప్రాంగణం లోనే ఉంచుకునే ఏర్పాటు చేసుకున్నారు..రామబ్రహ్మమూ భక్తిగా శ్రీ స్వామివారి సన్నిధిలో అర్చక బాధ్యతలు చేపట్టాడు..
అప్పటి నుండీ నేటివరకు, రామబ్రహ్మాచారి, శ్రీ దత్తాత్రేయ స్వామి మందిర ప్రాంగణం లోగల ఉప ఆలయాలలో..ప్రతి శని ఆదివారాలు అర్చక బాధ్యతలు నిర్వహిస్తున్నాడు..ఒక్కొక్కసారి ప్రధాన ఆలయం లోనూ పూజారిగా పనిచేస్తున్నాడు..
మతిస్థిమితం లేక, మొగలిచెర్ల అవధూత శ్రీదత్తాత్రేయుడి శరణు కోరిన రామబ్రహ్మం, నేడు, అదే శ్రీ దత్తాత్రేయ స్వామి వారి దేవస్థానం లో అర్చకుడు..
మీరూ ఎప్పుడైనా శని, ఆది వారాల్లో శ్రీ దత్తాత్రేయ స్వామి మందిర దర్శనానికి వచ్చినప్పుడు, రామబ్రహ్మాచారి ని కలిసి మాట్లాడవచ్చు..
శ్రీ స్వామివారి లీల కు ఇంతకంటే నిదర్శనం కావాలా?
సర్వం..
శ్రీ దత్త కృప..
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం.. లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా.. పిన్:523114..సెల్..94402 66380. & 99089 73699).
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి