5, జులై 2021, సోమవారం

*విష్ణు సహస్ర నామం*.. . *(రెండవ భాగం).*

 *విష్ణు సహస్ర నామం*.. . 


*(రెండవ భాగం).*


విష్ణు సహస్రనామాన్ని ఉపదేశించే ముందు ధర్మరాజు భీష్ముడిని ఆరు ప్రశ్నలు అడుగుతాడు. 1. ఈ ప్రపంచానికంతటికీ ఏకైక దేవత ఎవరు. 2. ఏది పరమ లక్ష్యము. 3. ఎవరిని స్తుతించాలి. 4. మానవులకు సుఖశాంతులు లభించాలంటే ఎవరిని అర్చించాలి.    5. ధర్మాలన్నిటిలోకి విశిష్టమైన ధర్మము ఏది. 6. దేనిని జపించుట చేత ప్రాణికోటికి సంసార బంధముల నుంచి విముక్తి కలుగుతుంది. ఈ ప్రశ్నలన్నిటికీ భీష్ముని వారు మహావిష్ణువే పరమేశ్వరుడు, పరమ లక్ష్యము, స్తుతింప వలసినది ఆర్చింపవలసినది ఆయననే, ఆయన నామాలను జపించిన వారికి సకల శుభాలు జన్మ బంధం నుంచి మోక్షము లభిస్తాయి. ఆయనను ధ్యానించడం మే మానవులకు పరమ ధర్మము అని జవాబు చెప్తాడు.


ఈ ప్రశ్నలు ధర్మరాజు తన స్వార్థం కోసం అడగలేదు. అందరి జీవులకు జ్ఞానం కలిగించడానికి మోక్ష మార్గం తెలియజేయడానికి లోక శ్రేయస్సు కోసం అడిగాడు. కామక్రోధాలు స్వార్ధము మొదలైన దుర్గుణాలు కు లోనై వృధాగా కురుక్షేత్రంలో మరణించిన రాజులను సైనికులను గమనించి ఆ బాధతో ధర్మరాజు ఈ ప్రశ్న లను అడిగాడు. మరే విధమైనటువంటి లౌకిక వాంఛలు కానీ స్వార్థం కానీ లేని స్థితిలో ఉన్న భీష్ములవారు అదే ఉద్దేశ్యంతో లోకానికి మంచి చేయడం కోసం ఈ సహస్ర నామాలు ఉపదేశించారు. 


తాను ఉపదేశిస్తున్న నామాల యొక్క లక్షణాలు ఫలము కూడా భీష్మలవారు సూక్ష్మముగా చెప్పారు.


*యాని నామాని గౌణాని*

*విఖ్యాతాని మహాత్మనః*

*రుషిభిః పరి గీతాని*

*తాని వక్ష్యామి భూతయే*


మహావిష్ణువు గుణాలకు సంబంధించిన వాటిలో ముఖ్యమైనవి మహాత్ములైన ఋషుల చేత కీర్తింప బడినవీ అయిన నామాలను చతుర్విధ పురుషార్ధాలు సాధించుకోవడం కోసం చెబుతున్నాను అంటారాయన. ఈ శ్లోకం లో మనం ముఖ్యం గా మూడు పదాలు  జాగ్రత్తగా గమనించు కోవాలి. మొదటిది *గౌణం.*. రెండవది *పరికీర్తనం*.. మూడవది *భూతయే.*


గౌణము అంటే గుణ సంబంధ మైనది అని అర్థము.  ఉదాహరణగా మూడు నామాలు చూపిస్తాను. వాసుదేవ గదాగ్రజ శ్రీపతి.


 వాసుదేవ పదానికి  వసుదేవుడి కుమారుడు. గదాగ్రజ అన్న మాటకు గదుడు అనే ఒక యాదవునికి వరసకు అన్న అవుతాడు.  శ్రీపతి అంటే లక్ష్మీ దేవి భర్త. ఈ అర్థాలు లౌకికమైనవి. ఈ నామాలకు పరమేశ్వరుడి గుణాలకు ఉన్న సంబంధాన్ని వివరించు కోవాలి.


ప్రపంచమంతా ఎవ్వని యందు వసిస్తుందో ఎవడు ప్రపంచమంతా ఆవరించుకొని ఉంటాడో అతను వాసుదేవుడు.


అవ్యక్త రూపంలో ఉన్న భగవంతుడు మొదటగా ఓంకార రూపంలో వ్యక్తం అయినాడు. అది శబ్దము. గద అంటే  ఏదైనా చెప్పు లేదా ఉచ్చరించు అని  ఎవరినైనా అడగడం. గదతి అంటే చెబుతున్నాడు చెబుతున్నది అని అర్థం. కాబట్టి గద అంటే ఇక్కడ పలుకు అంటే వాచ్యమైన ఓంకార శబ్దం అని అర్థము. దాని కంటే ముందు అంటే ఓంకారాని కంటే ముందుఉన్న వాడు అని అర్థం.


శ్రీ అంటే భగవంతుని యొక్క జ్ఞాన ఇచ్చా క్రియా శక్తులు. వాటికి అధిపతి శ్రీపతి.


 అలాగే విష్ణు సహస్రనామాలలో కొన్ని శివుడికి సంబంధించినవి కొన్ని కుమారస్వామికి సంబంధించినవి, కొన్ని సూర్యునికి సంబంధించినవి కొన్ని అగ్నికి సంబంధించినవి అలా వేరే వేరే దేవతలకు సంబంధించినవి అనిపిస్తాయి. నిజానికి అవన్నీ కూడా భగవంతుడి గుణాల కు సంబంధించినవి. ఇది అర్థం చేసుకోవాలి. ఇదే గౌణాని  అనే మాట కు అర్ధము.


*పరికీర్తన*  ::  పరి అనే ఉపసర్గ చాలా గాఢమైన తత్పరతతో చేసే పనికి వాడతారు. బ్రహ్మాన్ని వివరించమని  శిష్యుడు గురువుని అడిగేది  పరి ప్రశ్న. పరిజ్ఞానము సంపూర్ణ జ్ఞానము. పరి కీర్తన అలాంటిదే.  మామూలుగా ఉబుసు పోకో కాలక్షేపానికో కాకుండా ఏకాగ్రతతో భక్తితో చేసే కీర్తన, లేదా ఏదైనా విషయాన్ని శక్తి కొద్దీ చాటి చెప్పడము. స్తోత్రాల విషయంలోనూ నామజపం విషయంలోనూ ఉచ్చ జపము ( పైకి వినబడేటట్లు చేసేది), ఉపాంసు జపము ( పెదవులు కదులుతూ మాట పైకి వినపడకుండా చేసేది),  మానసిక జపము ( మనసులో చేసుకునేది),  అని మూడు రకాల జపాలు ఉన్నాయి. పరి కీర్తనము అనే మాట ద్వారా ఉచ్చ జపం సూచింప బడుతున్నది. 


*భూతయే* ::  సంస్కృత భాషతో కొంచెం  పరిచయం లేకపోతే ఈ మాట అర్థం కాదు. ఆ శ్లోకం తాత్పర్యం చదివినా, తాత్పర్యం అట్లా ఎందుకు రాశారో తెలుసుకోలేము. భూతయే అంటే భూతికోసం. భూతి అంటే మహదైశ్వర్యము. ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది భౌతిక సంబంధమైన ఐశ్వర్యాన్ని అంటే సాధారణమైన కోరికలు నుంచి కైవల్యం దాకా అన్ని కోరికలు తీర్చ గలగడం. ఇది భీష్ముల వారు చెప్పినసహస్ర నామము యొక్క ఫలితము. విష్ణు సహస్రనామం తర్వాత ఫలశ్రుతి శ్లోకాలు చాలానే ఉన్నాయి. అవి చెప్పే విషయం అంతా భూతయే అనే ఈ ఒక్క పదం పూర్తిగా తెలియ జేస్తుంది. 


ఈ శ్లోకంలో విష్ణు సహస్రనామం లోని నామాలను ఎలా అర్థం చేసుకోవాలి వీటిని ఇంతకుముందు ఎవరు ఎలా చదివేవారు దీనిని చదివితే ఏ ఫలితం వస్తుంది ఈ మూడు విషయాలను భీష్ముల వారు చాలా స్పష్టంగా చెప్పారు.


విష్ణు సహస్రనామం లోని చాలా మాటలకు భారతంలోనే వివిధ సందర్భాలలో వేదవ్యాసులు అర్థాన్ని ఇచ్చారు.   వేదాల ల్లోనూ ఇతర పురాణాలలోనూ మరి కొన్ని మాటలకు అర్ధాలు ఉన్నాయి.  ఈ అర్ధాల నన్నింటిని  శంకర భాష్యం లో ఆదిశంకరులు సంకలనం చేసి పెట్టారు. ఆ అర్ధాలు ప్రధానమైనవి. మామూలు అర్థాలు చెప్పకూడదు అని కాదు. ఆ అర్థాలు కూడా పురాణాల ప్రకారం ఉన్నాయి. ఆది శంకరుల వారు గౌణార్ధాలతో పాటు  పక్కపక్కనే మామూలు అర్ధాలను కూడా  చెప్పారు.  గౌణాని అనే మాట భీష్ముల వారు ప్రత్యేకంగా చెప్పకపోతే అందరమూ మామూలు అర్థాలనే చూసుకోవలసి వచ్చేది...  


ఇంకా వుంది....


*పవని నాగ ప్రదీప్*

కామెంట్‌లు లేవు: