5, జులై 2021, సోమవారం

త్రివక్రం

 💐త్రివక్రం అంటే... మనసులో అనుకున్నది ఒకటి, నోటితో చెప్పేది ఒకటి, శరీరంతో చేసేది మరొకటి. ఈ మూడు వంకరలు తీసివేయడమే కుబ్జతనాన్ని తొలగించడం. అవి పోయి ఏకత్వం వచ్చేసి, ఈశ్వర స్పర్శ కలిగినవాడు అప్పటి నుంచి ఇక ఎప్పుడూ ఈశ్వర సేవే కావాలని కోరుకుంటాడు.💐


అంతరంగం, ఆలోచన, ప్రవర్తనల్లో ఏదో ఒకదానిలో మనుషులు ఎప్పుడూ పొట్టివారే. ఏదో ఒక లోపం లేకుండా సాధారణంగా ఏ మనిషీ ఉండడు. అలాంటి మరుగుజ్జుతనాన్ని కుబ్జత్వం అంటారు. ఆధ్యాత్మికత, జ్ఞానవృద్ధి, గురుకృప, భగవదనుగ్రహం తదితరాల ఆలంబనతో మనిషి వాటిని దాటి త్రివిక్రముడవుతాడు. వాటిలో ఏది కావాలన్నా తపన, తాదాత్మ్యత, నిర్మల భక్తి, నిబద్ధత కలిగిఉండాలి. ఈ విషయాన్ని వివరించేదే భాగవతంలోని ‘కుబ్జ’ కథ.


కపటబుద్ధితో ధనుర్యాగానికి బలరామ కృష్ణులను ఆహ్వానించాడు కంసుడు. మధురకు బయలుదేరారు అన్నదమ్ములు. దారిలో వారికి ఒక దివ్యాంగురాలు ఎదురైంది. ఆమెకు కృష్ణుణ్ని నఖశిఖ పర్యంతం చూడాలని కోరిక. ఆయన మనోహరమైన చిరునవ్వులొలికే మోమును చూడాలని, వీలైతే తాను సిద్ధం చేసిన శ్రీగంధాన్ని ఆయన మేనుకు అద్ది, ఆ మోహనరూపాన్ని చూడాలని కోరిక. కానీ శరీరం సహకరించని పరిస్థితి ఆమెది. అదీకాక ఆమె కంసుడికి దాసి. ఆశ నిరాశల మధ్య ఊగిసలాడుతూ కృష్ణుడు వచ్చే దారిలో కనీ కనిపించకుండా తచ్చాడుతోంది. గమనించిన కృష్ణుడు ఆమెమీద జాలిపడ్డాడు. కరుణాసముద్రుడయ్యాడు. ‘సుందరీ’ అని సంబోధించాడు. ఆ పిలుపు విన్న ఆమె ఆశ్చర్యపోయింది. కళ్ల వెంట అశ్రుధారలు కారుతుండగా- గద్గద స్వరంతో ‘స్వామీ! నువ్వు కూడా నన్ను హేళన చేస్తున్నావా?’ అని అడిగింది.


‘నేను గంధపు చెక్కలమీద గంధం తీసి, పరిమళ ద్రవ్యాలు అద్ది కంసమహారాజుకు ఇస్తూ ఉంటాను. అసలు అందం అంటే ఏమిటో ఇవాళ నీలో చూశాను. నీవు ఈ గంధాన్ని రాసుకుంటే ఈ గంధానికే అందం వస్తుంది. ఈశ్వరా, కొద్దిగా ఈ గంధం రాసుకుంటావా? నువ్వు నన్ను పిలిచిన పిలుపుతో వచ్చిన ధైర్యంతో ఇలా అడుగుతున్నాను’ అంది.


ఆమె కోరికను మన్నించాడు కృష్ణుడు. ప్రతిగా ఆమె పాదాలను తన కుడిపాదంతో తొక్కి, తనచేతి రెండు వేళ్లను కుబ్జ గడ్డం కింద పెట్టి పైకి ఎత్తాడు. ఆ చర్యతో ఆమె వంకరలు తొలగిపోయి సౌందర్యరాశిగా మారిపోయింది. అప్పుడు ఆమె కృష్ణుడితో ‘నాకు ఇంత సౌందర్యాన్నిచ్చావు. నేను నీకు ఇచ్చే ఆనంద సౌఖ్యాలను అనుభవించి నన్ను తరింపజెయ్యి. అందుకోసం నీవు ఒకసారి మా ఇంటికి రా’ అని అడుగుతూ ఆయన ఉత్తరీయం పట్టుకొని లాగింది. అప్పుడు కృష్ణపరమాత్మ ‘నేను పాంథుడిని. ఎప్పుడైనా, ఎక్కడికైనా వెళ్ళగలను. కాబట్టి తప్పకుండా నేను మీ ఇంటికి వస్తాను. కాని ఇప్పుడు కాదు. కంస సంహారం అయిన తరవాత’ అన్నాడు.


త్రివక్రం అంటే... మనసులో అనుకున్నది ఒకటి, నోటితో చెప్పేది ఒకటి, శరీరంతో చేసేది మరొకటి. ఈ మూడు వంకరలు తీసివేయడమే కుబ్జతనాన్ని తొలగించడం. అవి పోయి ఏకత్వం వచ్చేసి, ఈశ్వర స్పర్శ కలిగినవాడు అప్పటి నుంచి ఇక ఎప్పుడూ ఈశ్వర సేవే కావాలని కోరుకుంటాడు. త్రివక్రకు తన వంకరలు పోగానే ఆవిడ ఈశ్వరుడి కైంకర్యం (సేవ) చేయాలని కలిగిన కోరికతోనే అలా అడిగింది. అందుకోసం తన ఇంటికి రమ్మంటోంది. పరమాత్మ కంసవధ అయిన తరవాత వస్తానంటున్నాడు. అంటే అజ్ఞాన సంహారం పూర్తయిపోవాలి. ఇంకా నీలో అజ్ఞానం ఏమైనా మిగిలిఉంటే అది సమసిపోవాలి’ అని ఆ మాటకు అర్థం. ఆయన ‘నేను పాంథుడిని’ అనడంలోనూ అంతరార్థముంది. పాంథుడు (బాటసారి) అంటే ఇల్లులేని వాడని అర్థం. దాని భావం ‘ఆత్మ స్వరూపుణ్ని’ అని. ఆత్మకు ఇల్లేమిటి? అది అంతటా పరివ్యాప్తమై ఉంటుంది. అది అప్పుడప్పుడు ఏదో ఒక ఇంట్లోకి (శరీరంలోకి) వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది అని భావం. ఆ ఆత్మ స్వరూపుడితో తాదాత్మ్యం చెందాలంటే మానసిక వికృతి పోవాలి. ఇక్కడ జరిగింది అదే. కుబ్జ సౌందర్యవతిగా మారడం అంటే, పరమాత్మ సంపర్కంతో మానవాళి స్వరూపాన్ని పొందడమేనని ఇందులోని అంతరార్థం.


🙏

కామెంట్‌లు లేవు: