25, ఏప్రిల్ 2022, సోమవారం

నేను అనే భావన

*నేను అనే భావన మరీ పెరిగిపోతూ ఉంటే  అహంకారం అవుతుంది.*


తనను తాను గొప్పవాడు అని నిరూపించుకోవడానికి మూర్ఖుడు వేసుకొనే ముసుగే 'అహం'.  అంటే  'నేను' .... ఈ నేను అనే భావన మరీ పెరిగిపోతూ ఉంటే  అహంకారం అవుతుంది.

ఆంగ్లంలో అహాన్ని 'ఈగో' అంటారు. మనో విశ్లేషణ ప్రకారం “అహం” అనేది ఒక మనిషి అపస్మారకంలో దాగిన కోరికలను బాహ్య ప్రపంచపు అవశ్యకాలతో  జత చేయడానికి మధ్యవర్తిత్వం చేసే మేధో భాగం. ఇదీ ఆత్మగౌరవం లాంటిదే !


అహం’ వేరు… ‘అహంకారం’ వేరు. ‘అహం’ అనే సంస్కృత పదానికి తెలుగులో ‘నేను’ అని అర్థం. మరి ఆ ‘అహం’ వచ్చి ‘ఆకారం’తో చేరితే… అది “అహంకారం” అనబడుతుంది.  'అహం' అనేది పాపాల్లో ఒకటి. గర్వం వలె అహం కూడా మనిషి పతనానికి దారి తీస్తుంది.


 సంస్కృత వృత్తాంతం ప్రకారం  సంస్కృత కవుల్లో దండి గొప్పవాడా, లేక కాళిదాసు గొప్పవాడా అనే చర్చ వచ్చింది. వీరిద్దరిలో ఎవరు గొప్పవారో తేల్చిచెప్ప గల్గిన సామర్థ్యమున్న పండితుడెవడూ కనిపించక, ఇద్దరూ సరస్వతి దేవి దగ్గరికి వెళ్ళారు. ఇద్దరిలో యెవరు గొప్ప అని అడిగిన ప్రశ్నకు దండి గొప్పవాడని జవాబిస్తుంది సరస్వతి.


దానికి ఖిన్నుడైన కాళీదాసు “నేనేమీ కానా తల్లీ ?” అని అడిగిన ప్రశ్నకు జవాబుగా “త్వమేవాహం”, (నువ్వే నేను) అని జవాబిస్తుంది సరస్వతి.


నేను నా అనే పదాలు మనలోని దైవత్వం నుండి మనని వేరు చేస్తాయి అనడానికి ఇది ఒక మంచి ఉదాహరణ


“నేను”, “నా”, అని సూచించేంత వరకు “అహం” అనేది ఒక పదం మాత్రమే. అయితే “నేనే”, “నాదే” అనే అర్థాలు జోడించుకోవడంతో  అదొక భావంగా వాడుకలోకి వచ్చేసింది. సరిగ్గా చెప్పాలంటే అహంకారం అలాగే వుంచి దురహంకారం (చెడ్డ అహంకారం) పదాన్ని వాడటం మంచిది.


 ఆత్మ గౌరవానికి, అహంకారాకి చాలా పోలిక ఉంది. వాటిని విభజించేది చాలా సన్నటి రేఖ.     “ఈ సామర్థ్యం నాకుంది” అనడం ఆత్మ గౌరవం.“ఈ సామర్థ్యం నాకొక్కడికే వుంది” అనడం అహంకారం. ఇంట్లో చిన్న చిన్న గొడవల దగ్గరినుండి,      బాహ్య ప్రపంచంలో మహా యుధ్ధాల వరకూ అహంకారాల వల్లే  జరుగుతాయి. ఒకరి అహంకారం ఆ మనిషి పొందే నష్టానికే పరిమితమైతే పోనీ అనుకోవచ్చు. ఒక్కరి అహంకారం వల్ల, ఒక కుటుంబం, జాతి, దేశం ఇంకా మాట్లాడితే ప్రపంచమే నాశనమైన సందర్భాలున్నాయి కదా. ..

కామెంట్‌లు లేవు: