శుక్లాం బరధరం విష్ణు’ శ్లోకంలో పరమార్థం ఏంటి..?
శుక్ల+అంబర+ధరమ్ అంటే తెల్లని ఆకాశాన్ని ధరించినవాడు అని..... (అంబర శబ్దానికి వస్త్రం అని మాత్రమే కాదు అర్థం)
ఆ ఆకాశం నుండి కదా క్రమంగా ఒకదాని నుండి ఒకటి చొప్పున వాయువు, అగ్ని, నీరు, నేల, సస్యాలు (పంటలు) మనుష్యులనేవాళ్లు వచ్చారు....
[ఆకాశాద్వాయు:వాయోరగ్ని:అగ్నేరాప:అద్భ్య:పృథివీ పృథివ్యా ఓషధయ:ఓషధీభ్యోన్నం అన్నాత్ పురుష:]
ఆ కారణంగా ఆకాశాన్ని ధరించాడంటే ఇంత జీవరాశికీ ఆధారభూతుడని అర్థం.....ఇంతకీ ఈ వర్ణన.. విష్ణువు, వినాయకుడు.. ఈ ఇద్దరిలో ఎవరిదో చూద్దాం! ఇద్దరిదీ...
ఇప్పుడు ఈ నేపథ్యంలో అర్థాన్ని చూద్దాం! కాలస్వరూపుడైన శ్రీహరి వినాయకునిగా మారిన వేళ అంటే సరైన అర్థమేమంటే - అన్నింటికీ ఆధారం ఏ ఆకాశమో ఆ ఆకాశాన్ని నిరంతరం తన అదుపులో పెట్టుకుని ఉన్నవాడు, శుక్లపక్ష - కృష్ణ పక్షాలతో ఉంటూ ఎగుదల దిగుదల లక్షణాలు కలిగించేవాడు (జీవులకి ఆనందాన్నీ దుఃఖాలనీ కలిగిస్తూ ఉండేవాడు), ఒక చేయి రోజులకి ప్రతీకగా, మరో చేయి 15 రోజుల పక్షానికి (శుక్ల + కృష్ణ) సంకేతంగా, మరో చేయి 2 పక్షాలు కలిసిన నెలలకి (చైత్రం, వైశాఖం...) ప్రతీకగా, మరో చేయి ఈ 12 నెలలకీ (ప్రభవ, విభవ....) ప్రతీకగాను కలిగి, మనకి కాలంలో ఏర్పడే అన్నిటికీ తానే కర్తగా ధర్తగా హర్తగా ఉన్నవాడు ఆయన.....
ప్ర: 'శుక్లాంబరధరం.....' శ్లోకంలో 'శశివర్ణం చతుర్భుజం' అనే మాట ఉంది. గణపతి వెన్నెలవంటి తెల్లని కాంతితో ఉంటాడని ఎక్కడా చెప్పబడలేదు. 'రక్తాంబరం రక్తవర్ణం...... అంటూ ఎర్రని కాంతితో, సిందూర వర్ణంతో ఉన్నట్లుగానే పురాణాలు, అథర్వ శీర్షం చెప్తున్నాయి. కనుక శశివర్ణం కలవాడు గణపతి - అనడానికి లేదు.... అని ఒక పెద్దాయన వివరించారు. నిజమేనా? శశివర్ణుడు ఎవరు? విష్ణువును భావించవచ్చా?
జ: విష్ణువు కూడా 'శశివర్ణుడు' అని ఎక్కడా వర్ణించలేదు కదా! నీలవర్ణుడనే ప్రసిద్ధి. అయితే కొన్ని ప్రత్యేక మూర్తులుగా శశివర్ణుడు కావచ్చేమో!
కానీ గణపతి రక్తవర్ణుడే కాక, శశివర్ణుడుగా ఉన్న మూర్తి కూడా శాస్త్ర ప్రమాణంగా ఉన్నది. సృష్ట్యాది యందు బ్రహ్మదేవునికి కనబడిన గణేశుడు 'శశివర్ణుడు'గా ఉన్నట్లుగానే *'శ్రీ గణేశ పూర్వతోపిన్యుపనిషత్తు'* స్పష్టంగా చెబుతోంది. దాని ఆధారంగానే ఈ సంప్రదాయ శ్లోకం ఏర్పడింది. విష్ణు - అంటే సర్వవ్యాపకుడు. ఆ వ్యాపక లక్షణాన్ని తెలియజేసేదే విష్ణువు - అనే నామం. గణేశుని పరమాత్మగా ఉపాసించే తత్త్వంలో ఇది సమంజసమే.
*".... సోఽపశ్చాదాత్మనాఽఽత్మానం*
*గజరూపధరం దేవం శశివర్ణం చతుర్భుజం....." (శ్రీ గణేశ పూర్వతోపిన్యుపనిషత్)*
అనేక పురాణాల్లో గణేశునికీ, విష్ణువుకీ అభిన్నత చెప్పబడింది....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి