20, జులై 2023, గురువారం

ప్రత్యేకత

 ప్ర .  ఈ మధ్య ఒక ఆటోలో వెళుతూ "లలితా సహస్ర పారాయణకి గుడికి వెళ్లాలి. తొందరగా పోనీయి నీకూ పుణ్యమొస్తుంది” - అన్నాను. కానీ అతడు మతం మార్చుకున్న డ్రైవర్ కావడంతో,  "మీ పారాయణల్లో చదివేవి మీకే అర్థం కావు. మా ప్రార్ధనలు మా భాషలోనే ఉంటాయి. అర్థంకాని పారాయణ వల్ల మీకే పుణ్య మొస్తుంది? దానికోసం తొందరగా పోనిస్తే నాకేం పుణ్యమొస్తుంది?" అన్నాడు.. నేను కాస్త ఆలోచనలో పడ్డాను. అర్థంకాని సంస్కృత శ్లోకాల పఠనం కంటే , అర్థమయ్యే భాషలో ప్రార్థనలే సమంజసమంటారా?


జ:  లలితా సహస్రనామాల వంటివి మంత్రాలు. అవి మనకి అర్థం కావడం కాదు. ఆ శబ్దంలో శక్తి ఉంది. దాని ఉచ్చారణవల్ల మంత్రవాచ్యులైన దేవతలు స్పందిస్తారు. అసలు దేవత అంటేనే 'మంత్ర చైతన్యం'. ఏ మంత్రంలో, ఏ నామంలో ఏ దివ్య చైతన్యం ఉంటుందో దానిని ఆ మంత్రాధిదేవతగా పేర్కొంటారు. ఆ చైతన్యం యొక్క ప్రకటన స్వరూపమే (Manifested Form) దేవతాకారం.

ఈ విజ్ఞానం మన ధర్మంలోనే ఉంది. మంత్రం మనకి అర్థం కానక్కర్లేదు. మన అర్థానికి అందేది కాదు దేవత. అయితే అర్థం తెలిసి పఠిస్తే మంచిదే. అది మరింత బలవత్తరమవుతుంది. కానీ అనువదించి పఠించితే అంతటి శక్తి రాదు. కానీ అను వదించి చదివే తేట తెలుగు పద్యాలు, వచనాలు, కీర్తనలు మనకు కోకొల్లలు. వాటికి కూడా ప్రభావం ఉంది. వాటిని అనుకరించే ప్రయత్నాలు చేస్తూ కృత్రిమత్వం పులుముకుంటున్నా రు. ఈ మార్పిడికుట్రదార్లు.

ఇక్కడ ఒక విషయం గమనించాలి - ఇతర మతాలలోకి మారడం వల్ల పూర్వమత దూషణ జరుగుతోందన్నది దీనిబట్టి తేలుతున్న అంశం. అసలు ఈ మతంలోనే 

పుట్టిపెరిగేవాడు అన్యమతాన్ని దూషించడం. మార్పిడితో పాటు మాతృదర్శ కూడా పుడుతోంది. ఇది క్రమంగా పరస్పర దూషణలకు, ఫలితంగా హింసకు, చీలికలకు, దేశభద్రతకు ప్రమాదకరం. ఇది దేశశాంతిని కోరుకునే ప్రతి సోదర  మతస్థుడు తెలుసుకొని, అన్ని మతాలవారు తమ మాతృమతాలతో పాటు అన్యమతాల వారిని గౌరవించడం అలవరుచుకోవాలి.

ఏ మత ప్రత్యేకత దానిదే. సంస్కృతభాషలోని పారాయణ ప్రార్ధనల వలననే అన్ని భాషల వారి సమైక్య సంస్కృతిగా భారతీయ ధార్మికత వృద్ధి చెందింది. మంత్రభాష అయిన సంస్కృత శబ్దాలలోని స్పందనశక్తి అమోఘమైనది. అయినప్పటికీ ప్రతి దేశభాషల్లోనూ ఎన్నో దివ్యగ్రంథాలు ఉన్నాయి.

పుణ్యం తేగలిగే మంత్రశక్తి కలిగిన పారాయణలు మన మతంలోనే ఉన్నాయని సగర్వంగా చెప్పి ఉండవలసింది.

కామెంట్‌లు లేవు: