*నిజమైన జ్ఞాని*
➖➖➖✍️
*వంగ రాజ్యాన్ని పరిపాలించే చంద్రసేనుడు తనమంత్రి సుబుద్దునితో ‘మంత్రివర్యా! సర్వసంగ పరిత్యాగి అయిన జ్ఞానిని మేము దర్శించదలచాము, రేపు అటువంటి వ్యక్తిని చూసే ఏర్పాట్లు చేయండి' అన్నాడు.*
*’అలాగే ప్రభూ తప్పకుండా రేపు ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేస్తాను' అన్నాడు.*
*ఒక్క రాత్రిలో అటువంటి జ్ఞానిని ఎలా చూపించాలో తెలియని మంత్రి ఓ చిన్న తంత్రంతో ఆ ఆపదనుండి బైటపడే మార్గంగా, తనకు తెలిసిన ఓ పగటివేషగాడిని కలసి 'రేపుఉదయం అడవి మొదట్లొ మర్రి చెట్టుకింద ముని వేషంలో కూర్చో! రాజుగారు వచ్చి నిన్ను దర్శించుకుని బహుమతులు ఇవ్వబోతాడు. సర్వసంగ ‘పరిత్యాగులం మాకు ధనమెందుకు?’ అని తిరస్కరించు, అలాచేస్తే నీకు వందవరహాలు ఇస్తాను' అన్నాడు.*
*పగటి వేషగాడు అంగీకరించి మరుదినం ఉదయాన్నే ముని వేషం ధరించి మంత్రి సూచించిన ప్రదేశంలో పద్మాసనం వేసుకుని దండం, కమండలంతో కూర్చొని జపం చేయసాగాడు.*
*రాజుగారు రాణిగారితో కలసి మంత్రి చూపించిన జ్ఞాని పాదాలపై తమ తలలు ఆనించి నమస్కరించి, బంగారు పళ్ళెంలో వజ్రాలు, రత్నాలు బంగారునాణాలు అతని ముందు పెట్టి స్వీకరించమని వేడుకున్నారు.*
*'సర్వసంగపరిత్యాగిని నాకు ధనం ఎందుకు? వద్దు' అన్నాడు జ్ఞాని వేషంలోని పగటివేషగాడు.*
*అతని మాటలకు సంతోషించిన రాజు తనపరివారంతో వెళ్ళిపోయాడు.*
*’వేషం బాగా కుదిందోయ్!’ ఇంద నీకు ఇస్తాను అన్న వంద వరహాలు' అన్నాడు మంత్రి వంద వరహాలమూట ఇస్తూ.*
*'సర్వసంగపరిత్యాగులం మాకుధనం ఎందుకు'అన్నాడు ఆ జ్ఞాని వేషధారి.*
*'అబ్బా రాజుగారు వెళ్ళిపొయారు. ఇంక నీవు నటించనవసరంలేదు' అన్నాడు మంత్రి.*
*'అయ్యా! కొద్దిసేపు జ్ఞానిలా నటిస్తే దేశపాలకుడు తన తలను నాపాదాలకు తాకేలా నమస్కరించి కోట్లధనం నాకు సమర్పించబోయాడు. నిజమైన జ్ఞాన సంపద ఇంత గొప్పదని తెలుసుకున్నాను. జ్ఞానసంపద తెలుకునేందుకు గురువును ఆశ్రయించబోతున్నాను సెలవు' అని మంత్రికి నమస్కరించి అడవిలోనికి వెళ్ళి పోయాడు జ్ఞాని వేషంలోని పగటివేషగాడు.*✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి