*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*
*తృతీయస్కంధము-ముప్పది మూడవ అధ్యాయము*
*దేవహూతికి తత్త్వజ్ఞానము, మోక్షము ప్రాప్తించుట*
*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*మైత్రేయ ఉవాచ*
*33.1 (ప్రథమ శ్లోకము)*
*ఏవం నిశమ్య కపిలస్య వచో జనిత్రీ సా కర్దమస్య దయితా కిల దేవహూతిః|*
*విప్రస్త మోహపటలా తమభిప్రణమ్య తుష్టావ తత్త్వవిషయాంకితసిద్ధిభూమిన్॥2576॥*
*మైత్రేయుడు పలికెను*-విదురా! కర్దమమహర్షియొక్క ధర్మపత్నియు, కపిలభగవానునకు తల్లియు ఐన దేవహూతి కపిలుని మాటలను విన్నంతనే ఆమెలోని మోహము పూర్తిగా తొలగిపోయెను. ప్రకృతి, పురుష, పరమేశ్వరులకు సంబంధించిన సాంఖ్యశాస్త్రమునకు ప్రవర్తకుడైన కపిలునకు ప్రణమిల్లి, ఆ మహాత్ముని ఇట్లు స్తుతింపసాగెను.
*దేవహూతిరువాచ*
*33.2 (రెండవ శ్లోకము)*
*అథాప్యజోఽంతస్సలిలే శయానం భూతేంద్రియార్థాత్మమయం వపుస్తే|*
*గుణప్రవాహం సదశేషబీజం దధ్యౌ స్వయం యజ్ఞఠరాబ్జజాతః॥2577॥*
*దేవహూతి ఇట్లు పలికెను*- భగవన్ ప్రళయజలమధ్యముస శేషతల్పశాయియై విలసిల్లునట్టి శ్రీమన్నారాయణుడవు నీవే. పంచమహాభూతములకును, శబ్ధాది తన్మాత్రలకును, దశేంద్రియములకును, మనస్సునకును నీ శ్రీవిగ్రహమే ఆధారము.త్రిగుణములు అన్నియు నీ నుండియే వెలువడినవి. వాటికి కార్యరూపమైన ఈ జగత్తునకు కారణభూతుడవును నీవే. నీ నాభికమలమునుండి ఉత్పన్నమైన బ్రహ్మదేవుడు సృష్టినిర్మాణజ్ఞానమును పొందుటకు నిన్నే ధ్యానించెను.
*33.3 (మూడవ శ్లోకము)*
*స ఏవ విశ్వస్య భవాన్ విధత్తే గుణప్రవాహేణ విభక్త వీర్యః|*
*సర్గాద్యనీహోఽవితథాభిసంధిః ఆత్మేశ్వరోఽతర్క్య సహస్రశక్తిః॥2578॥*
పూజ్యుడా! నీవు నిష్క్రియుడవు, సత్యసంకల్ఫుడవు. అకర్తవైనను గుణప్రవాహములకు కారణము నీవే. ఏకైక పరమాత్మవైన నీవు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల రూపములలో ఈ విశ్వముయొక్క సృష్టి, స్థితి, సంహార లీలలను నెరపుదువు. నీవు సర్వేశ్వరుడవు, సకలప్రాణులకు ఆత్మవు. నీ శక్తులు అనంతములు, అచింత్యములు.
*33.4 (నాలుగవ శ్లోకము)*
*స త్వం భృతో మే జఠరేణ నాథ కథం ను యస్యోదర ఏతదాసీత్|*
*విశ్వం యుగాంతే వటపత్ర ఏకః శేతే స్మ మాయాశిశురంఘ్రిపానః॥2579॥*
జగన్నాథా! ప్రళయకాలమునందు ఈ విశ్వమంతయును నీలో లీనమై ఉండును. అప్పుడు నీవు లీలా శిశువుగా, వటపత్రశాయివై నీ వదనారవిందమున పాదారవిందముయొక్క అంగుష్టమును చేర్చుకొని, దానిని త్రాగుచు (చప్పరించుచు) శైశవలీలలను నెరపుచుందువు. అట్తి అద్భుతమూర్తివైన నీవు నా గర్భమున చేరుట మిగుల ఆశ్చర్యకరముగదా!
*కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం|*
*వటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి॥*
*33.5 (ఐదవ శ్లోకము)*
*త్వం దేహతంత్రః ప్రశమాయ పాప్మనాం నిదేశభాజాం చ విభో విభూతయే|*
*యథావతారాస్తవ సూకరాదయః తథాయమప్యాత్మపథోపలబ్ధయే॥2580॥*
ప్రభూ! నీవు పాపాత్ములను శిక్షించుటకును, నీ ఆజ్ఞానువర్తులగు భక్తులకుఅభ్యుదయములను ప్రసాదించుటకును స్వేచ్ఛగా దేహధారణ గావించుచుందువు. లోకకళ్యాణార్థము వరహాది అవతారములను దాల్చినరీతిగనే ఈ కపిలావతారమును గూడ ముముక్షువులకు ఆత్మజ్ఞానమార్గమును చూపుటకై స్వీకరించితివి.
*33.6 (ఆరవ శ్లోకము)*
*యన్నామధేయశ్రవణానుకీర్తనాత్ యత్ప్రహ్వణాద్యత్స్మరణాదపి క్వచిత్|*
*శ్వాదోఽపి సద్యః సవనార కల్పతే కుతః పునస్తే భగవన్ను దర్శనాత్॥2581॥*
మహాత్మా! నీ దివ్యగుణనామములను వినుటవలనను, కీర్తించుటచేతను ఎప్పుడైనను నీ పాదపద్మములకు ప్రణమిల్లుటవలనను, నిన్ను స్మరించుట వలనను, చండాలుడు సైతము సోమయాజియైన బ్రాహ్మణునివలె వెంటనే పూజ్యుడగును. ఇంక నిన్ను దర్శించు మానవుడు కృతార్థుడు అగుననుటలో ఆశ్చర్యము ఏమున్నది?
*33.7 (ఏడవ శ్లోకము)*
*అహో ఐత శ్వపచోఽతో గరీయాన్ యజ్జిహ్వాగ్రే వర్తతే నామ తుభ్యమ్|*
*తేపుస్తపస్తే జుహువుః సస్నురాద్యాః బ్రహ్మానూచర్నామ గృణంతి యే తే॥2582॥*
మహానుభావా! నీ నామమును తన జిహ్వాగ్రమున భక్తితో నిలుపుకొనినచో, చండాలుడు సైతము సర్వశ్రేష్ఠుడగును. కేవలము నీ నామమును కీర్తించినవారలు, తపస్సులను, యజ్ఞములును, తీర్థస్నానములును, వేదాధ్యయనమును, సదాచారమును - ఇంతేగాక, సర్వమునూ చేసినవారలు అగుదురు.
*మైత్రేయ ఉవాచ*
*33.8 (ఎనిమిదవ శ్లోకము)*
*తం త్వామహం బ్రహ్మ పరం పుమాంసం ప్రత్యక్ స్రోతస్యాత్మని సంవిభావ్యమ్|*
*స్వతేజసా ధ్వస్తగుణప్రవాహం వందే విష్ణుం కపిలం వేదగర్భమ్॥2583॥*
కపిలదేవా! నీవు పరమపురుషుడవు, మనోవృత్తులను అంతర్ముఖమొనర్చి, అంతఃకరణమునందు (మనోనిగ్రహముతో) ధ్యానింపదగినవాడవు. నీవు నీ దివ్యతేజస్సుద్వారా మాయాకార్యమైన త్రిగుణాత్మక ప్రవాహమును (సంసార బంధములను) ఉపశమింప జేయుదువు. నీ యుదరమునందే వేదతత్త్వములు అన్నియును నిహితములైయున్నవి. వేయేల, సాక్షాత్తు నీవు పరబ్రహ్మవు. కపిలమహర్షిగా అవతరించిన శ్రీమహావిష్ణుడవైన నీకు నమస్కారము.
*మైత్రేయ ఉవాచ*
*33.9 (తొమ్మిదవ శ్లోకము)*
*ఈడితో భగవానేవం కపిలాఖ్యః పరః పుమాన్|*
*వాచాఽవిక్లబయేత్యాహ మాతరం మాతృవత్సలః॥2584॥*
*మైత్రేయుడు వచించెను*- విదురా! పరమపురుషుడు, పరాత్పరుడు ఐన పూజ్యకపిలభగవానుని దేవహూతి ఇట్లు ప్రస్తుతించెను. పిదప, మాతృభక్తితత్పరుడైన కపిలభగవానుడు ప్రేమపూరితగద్గదమైన వాక్కుతో తల్లితో ఇట్లనెను.
*కపిల ఉవాచ*
*33.10 (పదియవ శ్లోకము)*
*మార్గేణానేన మాతస్తే సుసేవ్యేనోదితేన మే|*
*అస్థితేన పరాం కాష్ఠామచిరాదవరోత్స్యసి॥2585॥*
*కపిలుడిట్లనెను* - తల్లీ! నేను చెప్పిన జ్ఞానమార్గము సులభమైనది. ఆచరణయోగ్యమైనది. దీనిని అవలంబించుటవలన నీవు పరమపదమునకు శీఘ్రముగ పొందగలవు.
*33.11 (పదకొండవ శ్లోకము)*
*శ్రద్ధత్స్వైతన్మతం మహ్యం జుష్ఠం యద్భ్రహ్మవాదిభిః|*
*యేన మానుభవం యాయా మృత్యుమృచ్ఛంత్యతద్విదః॥2586॥*
నా ఈ ఉపదేశమును మనస్ఫూర్తిగా ఆచరింపుము. బ్రహ్మవాదులు ఈ మార్గమును అవలంబించి, తరించిరి. నీవును నా ద్వారా జన్మరహితుడనైన నన్ను పొందగలవు. ఈ మార్గము పై విశ్వాసమును ఉంచనివారు జననమరణచక్రములో పరిభ్రమించుచుందురు.
*మైత్రేయ ఉపాచ*
*33.12 (పండ్రెండవ శ్లోకము)*
*ఇతి ప్రదర్శ్య భగవాన్ సతీం తామాత్మనో గతిమ్|*
*స్వమాత్రా బ్రహ్మవాదిన్యా కపిలోఽనీమతో యయౌ॥2587॥*
*మైత్రేయుడు వచించెను*- విదురా! కపిలభగవానుడు ఈ విధముగా తన తల్లియగు దేవహూతికి ఆత్మజ్ఞానమును బోధించెను. పిమ్మట ఆత్మతత్త్వజ్ఞానమును బాగుగా అవగతము చేసికొనిన తన తల్లికడ అనుమతిని తీసికొని అతడు అచటినుండి వెళ్ళిపోయెను.
*33.13 (పదమూడవ శ్లోకము)*
*సా చాపి తనయోక్తేన యోగాదేశేన యోగయుక్|*
*తస్మిన్నాశ్రమ ఆపీడే సరస్వత్యాః సమాహితా॥2588॥*
పిదప, దేవహూతియు తన తనయుడైన కపిలమహర్షి చేసిన ఉపదేశమును అనుసరించి, సరస్వతీ నదీ తీరమునగల తన ఆశ్రమమున యోగసాధస చేసెను. ఆ ఆశ్రమము సరస్వతీ నదీ తీరమునందు మకుటాయమానముగా వెలుగొందు చుండెను. యోగాభ్యాసముద్వారా ఆమె సమాధిస్థితికి చేరెను.
*33.14 (పదునాలుగవ శ్లోకము)*
*అభీక్ష్ణావగాహకపిశాన్ జటిలాన్ కుటిలాలకాన్|*
*ఆత్మానం చోగ్రతపసా భిబ్రతీ చీరిణం కృశమ్॥2589॥*
త్రికాలములయందు స్నానమాచరించుటవలన ఆమెయొక్క ఉంగరాల ముంగురులు జడలుగట్టి, బూడిదరంగునకు మారెను. నారచీరలను ధరించిన ఆమె శరీరము ఉగ్రమైన తపస్సాధనవలన కృశించెను.
*33.15 (పదునైదవ శ్లోకము)*
*ప్రజాపతేః కర్దమస్య తపోయోగవిజృంభితమ్|*
*స్వగార్హస్థ్యమనౌపమ్యం ప్రార్థ్యం వైమానికైరపి*2590॥*
కర్దమప్రజాపతి యొక్క తపస్సుచే, యోగబలముచే ప్రాప్తించిన నిరుపమానమైన గార్హస్థ్య సుఖమును (భోగానుభవములను) త్యజించెను. అట్టి అలౌకిక సుఖములకై దేవతలుగూడ తహతహలాడుచుందురు.
*33.16 (పదునారవ శ్లోకము)*
*పయః ఫేననిభాశ్శయ్యాః దాంతారుక్మపరిచ్ఛదాః|*
*ఆసనాని చ హైమాని సుస్పర్శాస్తరణాని చ॥2591॥*
కర్దమమహర్షియొక్క తపఃప్రభావమున? లభించిన ఆ భవనమునందలి శయ్యలు పాలనురుగువలె స్వచ్ఛములై విలసిల్లుచుండెను. అందలి మంచములు దంతములతో నిర్మితములు. అచటి సువర్ణపాత్రలు, బంగారు ఆసనములు మిగుల మనోహరములు. కంబళ్ళు, పరుపులు సుఖస్పర్శను ఇచ్చుచు హాయిని గొలుపుచుండెను.
*33.17 (పదునేడవ శ్లోకము)*
*స్వచ్ఛస్ఫటికకుడ్యేషు మహామారకతేషు చ|*
*రత్నప్రదీపా ఆభాంతి లలనారత్నసంయుతాః॥2592॥*
ఆ భవనమునందలి గోడలు స్వచ్ఛమైన స్ఫటికమణులతో నిర్మింపబడి, మరకతములతో చెక్కబడియుండెను. ఆ గోడలపై లలనా రత్న శిల్పములతో గూడిన రత్న దీపకాంతులు ప్రతిఫలించు చుండెను.
*33.18 (పదునెనిమిదవ శ్లోకము)*
*గృహోద్యానం కునుమితైః రమ్యం బహ్వమరద్రుమైః|*
*కూజద్విహంగమిథునం గాయన్మత్తమధువ్రతమ్॥2593॥*
ఆ భవనమునకు సంబంధించిన ఉద్యానవనమునందు పెక్కు దివ్యవృక్షములు గలవు. అవి అన్నియును బాగుగా వికసించి పూవులతో చూడముచ్చట గొల్పుచుండెను. ఆ వృక్షములపైగల పక్షుల జంట కిలకిలారావములు వినసొంపుగా నుండెను. పుష్పములపై వ్రాలియున్న గండుతుమ్మెదల ఝంకారములు అత్యంత మనోజ్ఞములు.
(తృతీయ స్కంధము లోని ముప్పది మూడవ అధ్యాయము ఇంకను కొనసాగుతుంది)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319, 9505813235
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి