🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర -45🌹*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
*తిరుమల_ఏడుకొండల_పరమార్థం:*
*1. వృషాద్రి 2. వృషభాద్రి 3. గరుడాద్రి 4. అంజనాద్రి 5. శేషాద్రి 6. వేంకటాద్రి 7. నారాయణాద్రి.*
ఏడు చక్రాలు దాటితే ఆనందానుభూతి కలుగుతుంది. ఆనంద నిలయం ఎక్కడఉంటుంది. బ్రహ్మ స్థానంలో ఉంటుంది. అందుకనే ఆయన 7 కొండలు పైనఉంటాడు. ఈ 7 కొండలు ఎక్కడం కూడా ఒక రహస్యం ఉంటుంది. ఆ 7 కొండలు సాలగ్రామాలే. ఆ 7 కొండలూ మహర్షులే. అక్కడి చెట్లు,పుట్టలు, పక్షులు ఏవైనా మహర్షుల అంశలే. తిరుమలలో పుట్టింది ఏదీ సామాన్యమైనది కాదు.
*అంజనాద్రి ర్వ్రుశాద్రిశ్చ శేషాద్రిర్గరుడాచలః |*
*తీర్థాద్రిః శ్రీనివాసాద్రి శ్చింతామణిగిరిస్తథా ||*
*వృషభాద్రి ర్వరాహాద్రిః జ్ణానాద్రిః కనకాచలః |*
*ఆనందాద్రిశ్చ నీలాద్రి స్సుమేరుశిఖరాచలః ||*
*వైకుంఠాద్రి: పుష్కరాద్రిః -- ఇతి నామాని వింశతిః*
ఈ 20 నామాలు పఠించటంవల్ల సర్వ పాప బంధాలు నుండీ విముక్తులు కాగలరు.
*ఏడు కొండలు :*
*శ్రీ శేషశైల గరుడాచల వేంకటాద్రి నారాయణాద్రి వ్రుషబాధ్రి* *వ్రుషాద్రి ముఖ్యాం ఆఖ్యం త్వదీయవసతే* *రనిశంవదంతి శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతం*
ఏడుకొండల తిరుమల క్షేత్రం।
లక్ష్మీ దేవికి ఆవసమైనందున శ్రీశైలం.
ఆదిశేషుడు పర్వతంగా రూపొందినందువలన శేషశైలం లేదా శేషాచలం .
గరుత్మంతుడు వైకుంఠం నుండి తెచ్చినందున గరుడాద్రి.
వేం= సమస్త పాపాలను, కట=దహించునది కావున కావున వేంకటాద్రి. వేం= అమృతత్వాన్ని, కట= ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తున్నందువల్ల వేంకటాద్రి.
నారాయణుడనే మహర్షి శ్రీ మహావిష్ణు వు కోసం తపస్సు చేసిన స్థలం, తన పేరుతో ప్రసిద్ధి పొందాలని వరం పొందినందున అది నారాయణాద్రి.
వృషభుడనే శెవభక్తుడు కోరి, శబర వేషం లోవున్న శ్రీనివాసునితో యుద్ధం చేసి మరణిస్తూ తనముక్తికి గుర్తుగా ఆపర్వ తానికి తన పేరు పెట్టాలని కోరుకున్నాడని పురాణగాధ, అదే వృషబాధ్రి .
వృషమనగా ధర్మము ధర్మ దేవత తన అభివృద్ధికై ఈ పర్వతం పై తపస్సు చేసినందున వృషాద్రి అని పేరు కలిగింది.
పై ఏడు పేర్లతో ఈ యుగంలో ప్రసిద్ధి పొందినా, గడచిన యుగాలలో చింతా మణి, జ్ఞానాద్రి, ఆనందాద్రి, అజనాద్రి, నీలాద్రి, వరాహాద్రి, వైకుంఠాద్రి .....ఇలా అనేక నామాలను కలిగివుంది.
*1. వృషభాద్రి -* అంటే ఎద్దు : వృశాభానికి ఋగ్వేదంలో ఒక సంకేతం ఉంది. ఎద్దు మీద పరమశివుడు కూర్చుంటాడు. దానికి 4 కొమ్ములుంటాయి. 3 పాదాలు (భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు)
వాక్కు అంటే - శబ్దం
శబ్దం అంటే - వేదం
వేదం అంటే - ప్రమాణము
వేదమే ప్రమాణము. వేదము యొక్క ప్రమాణాన్ని అంగీకరించిన వాడు మొదటి కొండ ఎక్కుతాడు.
కృతయుగంలో తిరుమలలోని తుంబురుతీర్థం వద్ద వృషభాసురుడు అనే రాక్షసుడు ప్రతిరోజూ తన తల నరికి శివుడికి నైవేద్యంగా పెట్టేవాడట. అలా నరికిన ప్రతిసారీ కొత్త శిరస్సు పుట్టుకొచ్చేది. అతని భక్తికి మెచ్చిన శివుడుఒకనాడు వృషభునికి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటే ఆ మూఢభక్తుడు తనకు శివునితో ద్వంద్వ యుద్ధం చేయాలని ఉన్నదని చెప్పాడట. చాలాకాలంపాటు జరిగిన ఆ యుద్ధంలో వృషభాసురుడు ఓడిపోయాడు. ప్రాణాలు విడిచే ముందు తనకు అక్కడ ముక్తి లభించినందుకు గుర్తుగా అక్కడి పర్వతానికి తన పేరు పెట్టాలని కోరుకున్నాడనీ అదే వృషభాద్రి అనీ పురాణగాథ.
*2. వృషాద్రి -* అంటే ధర్మం :
ధర్మం అంటే - నువ్వు వేదాన్ని అనుసరించి చేయవలసిన పనులు. నీకు భగవంతుడు ఇచ్చిన వాటితో మంచివి వినడం, చూడడం, మంచి వాక్కు మొదలైనవి. దాని వల్ల ఇహంలోను, పరలోకంలోను సుఖాన్ని పొందుతాడు. అవి చెయ్యడమే వృషాద్రిని ఎక్కడం.
*3. గరుడాద్రి -* అంటే పక్షి -ఉపనిషత్తుల జ్ఞానాన్ని పొందడం.షడ్ - అంటే జీర్ణం కానిది. ఒక్క పరమాత్మ మాత్రమే జీర్ణంకానిది. పరమాత్మ ఒక్కడే ఉంటాడు. మిగిలిన వాటికి 6 వికారాలు ఉంటాయి. పుట్టినది, ఉన్నది, పెరిగినది, మార్పు చెందినది, తరిగినది, నశించినది. ఇవ్వన్నీ పుట్టిన వాడికి జరుగుతూనే ఉంటాయి. ఆ ఆరు లేని వాడు భగవానుడు.
భ == ఐశ్వర్య బలము, వీర్య తేజస్సు మరియు అంతా తానే బ్రహ్మాండము అయినవాడు.
అన్ == ఉన్నవాడు, కళ్యాణగుణ సహితుడు, హేయగుణ రహితుడు. అటువంటి భగవానుణ్ణి జ్ఞానం చేత తెలుసుకోవడమే గరుడాద్రి.
దాయాదులైన కద్రువ పుత్రుల (నాగులు) ను సంహరించిన గరుత్మంతుడు పాపపరిహారార్థం విష్ణువును గూర్చి తపస్సు చేశాడు. స్వామి ప్రత్యక్షమవగానే తనకు తిరిగి వైకుంఠం చేరే వరమివ్వమని ప్రార్థించాడు. దానికి స్వామి... తానే ఏడుకొండల మీద వెలియనున్నానని తెలిపి ఆ వైనతేయుణ్ని కూడా శైలరూపంలో అక్కడే ఉండమని ఆదేశించారట. అదే గరుడాచలం.
*4. అంజనాద్రి -* అంజనం అంటే కంటికి కాటుక. ఈ కంటితో చూడవలసినవి మాత్రమే చూసినపుడు. ఈ కంటితో చూసిన దాంట్లో అంతటా బ్రహ్మమే ఉందని తెలుసుకోవడం కంటికి కాటుక. ఇదంతా
పరమాత్మ సృష్టియే. అప్పుడు అంజనాద్రి దాటతాడు.
వానరప్రముఖుడు కేసరిని వివాహం చేసుకున్న అంజనాదేవికి చాలాకాలం పాటు పిల్లలు పుట్టలేదట. దాంతో ఆమె ఆకాశగంగ అంచున ఉన్న కొండల మీద ఏళ్లతరబడి తపస్సు చేయగా వాయువు అంజనాదేవికి ఒక ఫలాన్నిప్రసాదించాడట. ఆ పండును భుజించిన ఫలితంగా హనుమంతుడు జన్మించాడనీ అంజనాదేవి తపస్సు చేసిన కారణంగా ఆ కొండకు అంజనాద్రి అని పేరు వచ్చిందనీ అంటారు.
*5. శేషాద్రి -* ప్రపంచం అంతా బ్రహ్మమే అని చూసాడనుకోండి వాడికి రాగద్వేషాలు ఉండవు. వాడికి క్రోధం ఉండదు. వాడికి శత్రుత్వం ఉండదు. భగవద్గీతలో గీతాచార్యుడు చెప్పాడు, తుల్య నిందా స్తుతిర్ మౌని (శ్లోకం చెప్పారు) తాను కాకుండా ఇంకోటి ఉంది అన్న వాడికి భయం. అంతా బ్రహ్మమే అనుకునేవాడికి భయం ఉండదు. ఎప్పుడూ ఒకేలా ఉండడమే బ్రహ్మం. ఆ స్థితికి ఎక్కితే శేషాద్రిని ఎక్కడం.
సప్తగిరుల్లో ప్రధానమైనది శేషాద్రి. విష్ణుమూర్తి వైకుంఠంలో కొలువై ఉన్న సమయంలో ఒకసారి వాయుదేవుడు స్వామిని దర్శించుకునేందుకు రాగా ఆదిశేషుడుఅడ్డగించాడట. కొంతసేపు వారిమధ్య వాదోపవాదాలు జరిగాయి. ఆ వాదన ఎటూ తెగకపోవడంతో స్వామివారే లేచి వచ్చి వారిద్దరిలో ఎవరు బలవంతులో తేల్చుకొనేందుకు ఓ మార్గం చెప్పారు. మేరు పర్వత భాగమైన ఆనందశిఖరాన్ని శేషువు చుట్టుకొని ఉండగా, ఆ పర్వతాన్ని వాయుదేవుడు కదిలించగలగాలి. పోటీప్రకారం ఆదిశేషుడు ఆనందశిఖరాన్ని చుట్టుకొని ఉండగా వాయుదేవుడు దాన్ని కదిలించేందుకు విశ్వప్రయత్నం చేశాడు. కొంతసేపటి తర్వాత వాయువు ఏంచేస్తున్నాడో చూడాలన్న కుతూహలంతో శేషువు పడగ ఎత్తి చూశాడు. ఇంకేం! పట్టుసడలింది. క్షణమాత్రకాలంలో వాయువు ఆనందశిఖరాన్ని కదిలించి స్వర్ణముఖీ నదీ తీరాన దించాడట. అదే శేషాచలమని భవిష్యోత్తర పురాణం చెబుతోంది.
*6. వేంకటాద్రి -* వేం : పాపం, కట : తీసేయడం. కాబట్టి పాపాలు పోతాయి. అంతా బ్రహ్మమే చేయిస్తున్నాడు, అందుకనే మనకి బ్రహ్మం తెలిసినవారు పిచ్చివాళ్ళలా కనవడుతారు. రామ కృష్ణ పరమహంస ఈ పిచ్చి నాకు ఎప్పుడు వస్తుందో అంటూ ఉండేవారు. అందుకే జ్ఞాని, పిచ్చివాడు ఒకలా ఉంటారు. ఆయనకే అర్పణం అనడం, అటువంటి స్థితిని పొందడం వెంకటాద్రి ఎక్కడం.
కలియుగదైవం వెలసిన తిరుమల గిరి... అలవైకుంఠం నుంచి గరుడుడు ఇలకు తెచ్చిన స్వామివారి క్రీడాస్థలం క్రీడాద్రేనని భవిష్యోత్తర పురాణం చెప్తోంది. 'వేం' అంటే పాపాలు అని, 'కట' అంటే హరించడం అనీ అర్థం. అంటే స్వామి సమక్షంలో సర్వపాపాలు నశిస్తాయట. అందుకే ఆ పవిత్రగిరిని 'వేంకటాద్రి' అంటారని ప్రతీతి. దీనికి సంబంధించి జనబాహుళ్యంలో ఓ కథ విస్తృత ప్రచారంలో ఉంది. శ్రీకాళహస్తిలో నివసించే పురందర సోమయాజి అనే బ్రాహ్మణుడికి ఓ కొడుకు పుడతాడు. అతగాడికి మాధవుడు అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకుంటారా దంపతులు. మాధవుడు మాత్రం చెడుసావాసాలు పట్టి అన్నీ పాపాలే చేస్తాడు. ఒకరోజు అనుకోకుండా కొంతమంది యాత్రికుల బృందంతో కలిసిపోయి వారితోపాటు స్వామిదర్శనానికి వెళతాడు. దర్శనం కోసం స్వామి ఎదుట నుంచున్న మాధవుడికి ఒళ్లంతా మంటలు పుట్టడం మొదలవుతుంది. ఉపశమనం కోసం కేకలు పెడతాడు. క్రమంగా మంటలు తగ్గుతాయి. ఆ బాధాకరమైన అనుభవంతో అతన్ని అంటిపెట్టుకుని ఉన్న అన్ని పాపాలూ నశించాయట. ఆ తర్వాత మాధవుడు శ్రీవారి సేవకు పూర్తిగా అంకితమయ్యాడు. అతడే మరుజన్మలో తొండమాన్చక్రవర్తిగా పుట్టాడని, స్వామికి ఆలయం నిర్మించి చరిత్రకెక్కాడని భక్తుల నమ్మకం.
*7. నారాయణాద్రి* - అంటే తుల్యావస్థని కూడా దాటిపోయి, తానే బ్రహ్మముగా నిలబడిపోతాడు. అటువంటి స్థితిని పొందడం నారాయణాద్రి. వేంకటాచలంలో ఏడుకొండలు ఎక్కడం వెనకాల ఇంత నిక్షేపాలను ఉంచారు. ఈకారణాలు తెలుకుకోవడం ఏడు కొండలు ఎక్కడం
విష్ణుదర్శనం కోసం తపస్సు చేయ సంకల్పించిన నారాయణ మహర్షి తన తపానికి భంగం కలిగించని స్థలం ఎక్కడుందో చూపాల్సిందిగా బ్రహ్మదేవుణ్ని కోరాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఒక ప్రదేశం చూపించాడట. అక్కడ స్వామి సాక్షాత్కారం పొందిన నారాయణమహర్షి తాను తపమాచరించిన పవిత్రస్థలాన్ని శాశ్వతంగా తన పేరుతో పిలిచేలా వరం ఇవ్వమన్నాడట. ఆ విధంగా నారాయణమహర్షి తపస్సు చేసిన కొండకు నారాయణాద్రి అనే పేరు స్థిరమైందని చెబుతారు.
*అంజనాద్రీశా గోవిందా, గరుడాద్రి వాస గోవిందా,*
*శేషాద్రి నిలయ గోవిందా, శ్రీ వెంకటేశ గోవిందా;**
*గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా* *హరి గోవిందా, వేంకట రమణా గోవిందా;*
*గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా,*
*శ్రీ వేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.🙏*
*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి