🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
. *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*
. *ఓం నమో భగవతే రామకృష్ణాయ*
. *🚩శ్రీ వివేకానందస్వామి🚩*
. *🚩జీవిత గాథ🚩*
*భాగం 37*
*అద్భుత గురువూ, అద్భుత శిష్యుడ:*
శిష్యునికి మానసిక విస్పష్టత గురువు ద్వారా కలిగితే, గురువు పరిపూర్ణత శిష్యుని మూలంగా అభివ్యక్తమవుతుంది. గురువు జీవితాన్ని వెల్లడి చేసి, ఆయన సందేశాన్ని వ్యాప్తిచేసే వ్యక్తే నిజమైన శిష్యుడు.
గురువు వాక్కులను అర్థం చేసుకొని వాటిని తు.చ. తప్పక పాటించే వాడు ఉత్తమ విద్యార్థి. కాని గురువు చెప్పబోయేది ముందుగానే గ్రహించి దానిని అట్లే ఆచరణలో చూపేవాడు శిష్యుడు. నిజంగా అలాంటి శిష్యుని కోసమే గురువు నిరీక్షిస్తుంటాడు. నిరీక్షించడమే కాదు, ప్రార్థిస్తాడు కూడా.
శ్రీరామకృష్ణులు అలా ప్రార్ధన చేశారు. తాము సముపార్జించిన ఆధ్యాత్మిక సంపత్తిని లోకమంతటా పంచిపెట్టే శిష్యులు రావాలని ఆయన విలపించారు.
భగవంతుణ్ణి సాక్షాత్కరించుకోవాలి. భగవదనుభూతి పొందాలి అని ఎందరో
మహాత్ములు విలపించారు. కాని భగవద్దర్శనంతో వారి విలాపం ఆగిపోయింది. ఇక్కడో శ్రీరామకృష్ణులు ఒక్క మార్గంలో కాదు, అనేక మార్గాల ద్వారా భగవధానందాన్ని చవిచూశారు, భగవదానందంలో లయించిపోయారు. ఆయన ఆక్రందన అంతటితో ఆగిపోవాల్సిందే కాని ఆగలేదు - భగవంతుని కోసం విలపించడం మొదలుపెట్టారు!
తాము సముపార్జించిన దివ్యానుభవాలనూ, చవిచూసిన దివ్యానందాన్నీ ఇతరులతో పాలుపంచుకోవాలనీ ఆ దివ్యానందమయ జీవితం వారు కూడా పొందాలనీ ఆయన విలపించారు. " మరణం ఆసన్న మయే ముందు ఆ దివ్యానందాన్ని చవిచూడడానికి లోకులారా రండి!" అని ఒక ముని' లోకాన్నే ఆహ్వానించారే, అదే విధంగా శ్రీరామకృష్ణులు ఎలుగెత్తి పిలిచారు. వెంటనే ఎవరూ రానందున ఆయన ఉత్సుకత వ్యాకులతగా పరిణమించి, ఆక్రందనగా రూపుదాల్చింది. "ఆలయాలలో సంధ్యాహారతుల గంటలు మ్రోగుతాయి. ‘ఆహా, మరో రోజు కూడా నిరర్థకంగా గడిచిపోయింది!
నా బిడ్డలు ఎవరూ రాలేదే! అంటూ నా మనస్సు తల్లడిల్లింది; తడిబట్టను మెలిపెట్టి పిండినట్లు భరించరాని బాధ కలిగేది. అతిథి గృహం మేడ మీద నిలబడి, 'నా బిడ్డలారా, ఎక్కడున్నారు? వెంటనే రండి' అంటూ అరిచేవాణ్ణి" అని కాలాంతరంలో శ్రీరామకృష్ణులు చెప్పడం కద్దు. ఇలాంటి అద్భుతమైన గురువును లోకం కనీవినీ ఎరుగదు.🙏
*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి