రామాయణమ్ 323
...
జాంబవంతునకు ,అంగదునకు నమస్కరించి "చూశాను సీతమ్మను" అని పలికెను.
.
అప్పుడు అంగదుడు తనచేతిలో చేయి వేసుకొని తీసుకొని వెళ్ళి హనుమను ఒక రమణీయమైన ప్రదేశమున కూర్చుండబెట్టెను.
.
చూశాను సీతమ్మను , స్నాన సంధ్యాదులు లేక మలిన వస్త్రముతో తైలసంస్కారములు లేని కేశపాశములతో ఏకవేణియై రామదర్శనముకొరకు తహతహలాడు సీతమ్మను చూశాను .
.
ఘోర రక్కసుల కావలిలో
చిక్కిశల్యమైన సీతమ్మను చూశాను.
.
చూశాను అని చెప్పగానే కొందరు వానరులు సింహనాదములు చేశారు ,మరికొందరు కిచకిచలాడారు ,
మరికొందరుచకచక ప్రతిగర్జనలు చేశారు.
.
మరికొందరు దగ్గరగా వచ్చిపర్వతాకారుడైన పావని శరీరాన్ని స్పృశించారు.
.
అప్పుడు జాంబవంతుడు వివరముగా చెప్పమని కోరగా జరిగిన విషయములన్నీ పూసగుచ్చినట్లు వివరించాడు మారుతి ...ఒక్క విషయము తప్ప ...అది రామునకు సీతమ్మ పంపిన సందేశము...
.
తాతా !
ఇటనుండి పయనమై వెళ్ళు నాకు మైనాకుడు కనపడి కాసేపు సేదతీరి వెళ్ళమన్నాడు ! ఆతని కోరిక మన్నింపక ముందుకు సాగుతున్న నన్ను ...
నాగమాత సురస
నాగమనాన్ని అడ్డుకొని విధాత ఇచ్చిన విందుభోజనము నీవు! నిన్ను మింగుతాను! అని ముందుకు రాగా ఉపాయముతో తప్పించుకొని ఆమెను మెప్పించి ముందుకు వెళుతుండగా !...
.
పట్టి లాగింది సింహిక, దానిని చంపి వేసి లంక కోట మీద అడుగుపెట్టిన నాకు లంకిణి అడ్డు వచ్చినది....దాని పీచమణచి లంకలో ప్రవేశించి లంక మొత్తము జల్లెడ పట్టినా ఫలితము లేకపోయె!
.
అప్పుడు ఇక మిగిలిన అశోకమునందు గాలించవలెనని అనుకొని అటు వెడలి చూడగా అట కనుగొంటినయ్యా తల్లి సీతను !
.
ఇంతలో రాక్షశేశ్వరుడు వచ్చి ఆమెతో పరుషముగా మాటలాడి రెండుమాసములు గడువొసంగినాడు....అని హనుమ జాంబవదాదులకు చెప్పసాగెను
.
వూటుకూరు జానకిరామారావు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి