ॐ సీతా జయంతి - మనకందే సందేశం
సీతానవమి శుభాకాంక్షలు
ప్రతి వైశాఖ మాసంలో వచ్చే శుక్ల నవమిని సీతా జయంతిగా జరుపుకుంటాం. దీనినే సీతానవమి - జానకీ నవమి - జానకీ జయంతి అని కూడా అంటారు.
సీతాదేవి జననం గూర్చి పౌరాణిక గ్రంథాలు ఏవిధంగా వివరించినా ,
జనక మహారాజు యజ్ఞభూమి దున్నుతుండగా, ఆమె ఒక పెట్టెలో ఆయనకు లభించిందనేది ప్రధానమైన విషయం.
ఆమె,
- భూమి నుంచీ ఆవిర్భవించి, భూపుత్రికగా,
- నాగటిచాలుకి తగిలి బయటకు రావడం వలన సీతగా,
- జనకుని పుత్రికయై జానకిగా,
- ఆ జనకుడే విదేహరాజుగాన వైదేహిగానూ పిలవబడుతోంది.
ఆమె జయంతి సందర్భంగా,
వివాహిత స్త్రీలు సీతమ్మవారిని పూజిస్తారు.
ఆమె అన్ని సందర్భాలలోనూ, తన జీవితాన్ని శ్రీరాముని కొరకే సంపూర్ణంగా అర్పించిందని, రామాయణం ద్వారా తెలుస్తుంది.
సీతమ్మ తాను తన భర్త సౌఖ్యంకోసం, తనకోసం,
తన జీవితాన్ని ఆయనతో ఎలా పెనవేసుకొని గడిపిందో,
సీతాదేవి అనుగ్రహంతో తమతమ భర్తలకు మంచి సౌఖ్యం కొరకు, వివాహిత స్త్రీలు,
ఈ రోజు వ్రత ఉపవాసాదుల ద్వారా వేడుకొంటారు.
దేశంలో ఏ విషయానికైనా ప్రామాణికత రామాయణం ద్వారా స్పష్టపడుతుంది.
భారతీయ దాంపత్య విషయాలు, ప్రస్తుతం పాశ్చాత్య ప్రభావానికి లోనై,
జీవనంలో మౌలిక విషయాలకి దూరమైపోయాయి.
వాటికి సంబంధించి, రామాయణంలో, సీతమ్మవారి విషయాలుగా అడుగడుగునా, అసంఖ్యాకంగా మనకి కనబడతాయి.
1. ఆదర్శ దాంపత్యం
2. భర్త గొప్పదనం
3. భర్తని అనుసరించే పతివ్రత
4. పతి ప్రాముఖ్యత
5. భర్తతో కూడినదే అత్యంత సౌఖ్యం
6.భర్తతోపాటు భార్య బాధ్యత
7. స్త్రీకి సహజంగా ఉండే జాలీ - మాట నిలబెట్టుకోవడం వంటివి వాటిలో కొన్ని ఉదాహరణలు.
సీతా జయంతి సందర్భంగా వాటిని ఇక్కడ ప్రస్తావించుకొందాం.
1. ఆదర్శ దాంపత్యం
బాలకాండ చివరి సర్గలో సీతారాముల అన్యోన్యత గురించి వాల్మీకి మహర్షి చక్కగా తెలియజేస్తారు.
"తండ్రి అంగీకరించి జరిగిన వివాహము కాబట్టి భార్యగా శ్రీరామునికి సీతమ్మ ప్రీతిపాత్రురాలు."
పతిసేవా పరాయణత్వము అనే గుణముచేతనూ, రూపసౌందర్యముల వైభవము వలనా శ్రీరామునకు ఆమెపై ప్రేమ ప్రవర్ధమానమవుతుండేదిట.
"కానీ సీతమ్మకు మాత్రం శ్రీరాముడు తనకు భర్త అనే కారణంచేతనే ఆయనపై ప్రేమ రెండింతలుంటుందట."
సీతారాములు ఒకరి హృదయము మరొకరు ఎరిగినవారగుటచే తదనుగుణముగ పరస్పరం ప్రేమానురాగాలతో మెలగుతున్నారట.
ఇక్కడ
(i) రాముడికి సీతపై ప్రేమ అనేదానికి ప్రాథమికమైన కారణం - తండ్రి అంగీకరించి జరిగిన వివాహం.
సీత రూపగుణాలవల్ల ఆ ప్రేమ పెరిగింది.
(ii) కానీ సీతకు రామునిపై ప్రేమకు ప్రాథమిక కారణం భర్త అనేది ఒక్కటే!
2. భర్త గొప్పదనం
అరణ్యాలలో రావణుడు వచ్చినపుడు, అతనిని పరివ్రాజకుడుగా భావించి మాట్లాడినా,
రావణుడు బయట పడేసరికి,
సీతాదేవి, తన భర్త అయిన శ్రీరామునికీ - రావణునికీ మధ్య అంతరాన్ని తొమ్మది ఉదాహరణలతో తెలుపుతుంది.
వనమున సింహానికీ - నక్కకీ,
సముద్రానికీ - పిల్లకాలువకీ,
అమృతానికీ - బియ్యపు కడుగు నీళ్ళకీ,
బంగారానికీ - సీసానికీ,
మంచిగంధానికీ - బురదకీ,
ఏనుగుకీ - అడివి పిల్లికీ,
గరుత్మంతునికీ - కాకికీ,
నెమలికీ - నీటికాకికీ,
హంసకీ - గ్రద్దకీ గల అంతరమే శ్రీరామునికీ - రావణునకీ మధ్య అంటుంది.
ఒక్కొక్క ఉదాహరణ గురించీ విశ్లేషించుకుంటే, తన భర్త గురించి సీతమ్మ ఎంత గొప్పగా అర్థంచేసుకొందో తెలుస్తుంది.
3. భర్తని అనుసరించే పతివ్రత
రాక్షసస్త్రీలు రావణుని పొందమని అనేక విధాల ప్రోత్సహిస్తారు, బెదిరిస్తారు.
అప్పుడు సీతమ్మ
సూర్యుని తేజస్సు సూర్యునితో ఏవిధంగా వేరుకాదో, ఆ విధంగానే తాను రామునినుంచి వేరుకాదని స్పష్టంగా ప్రకటిస్తుంది.
ఆ సందర్భంలోనే, పదకొండుమంది పతివ్రతలపేర్లను వారివారి భర్తలపేర్లతో కలిపి ప్రస్తావిస్తుంది.
"నా భర్త దీనుడైనా, రాజ్యహీనుడైనా అతడే నాకు గురువు.
సువర్చలాదేవి సూర్యునియందు లాగా సర్వదా నేను నా పతియందే అనురక్తురాలును.
మహా సాధ్వియైన శచీదేవి - ఇంద్రుని,
అరుంధతి - వశిష్ఠుని,
రోహిణి - చంద్రుని,
లోపాముద్ర - అగస్త్యుని,
సుకన్య - చ్యవనుని,
సావిత్రి - సత్యవంతుని,
శ్రీమతి - కపిలుని,
మదయంతి - సౌదాసుని,
కేశిని - సగరుని,
దమయంతి - నలుని అనుసరించినట్లు,
ఇక్ష్వాకువంశశ్రేష్ఠుడూ, నా పతీ అయిన శ్రీరాముని అనుసరించు పతివ్రతను" అంటుంది.
సాధారణంగా ఒక విషయాన్ని చెప్పేటప్పుడు, ఒకటిరెండు ఉదాహరణలు చూపుతారు,
సీతాదేవి పదకొండు ఉదాహరణలు చూపిందంటే, ఆ విషయం ఎంత ప్రాధాన్యమైందో తెలుపుతుంది. ఆ పదకొండు విషయాలూ పదకొండు రకాల సందేశాలనిస్తాయి.
4. పతి ప్రాముఖ్యత
వనవాసానికి వెళ్ళేటప్పుడు, కౌసల్య సీతకు ధర్మాలు తెలుపుతుంది.
అప్పుడు సీతమ్మ,
భార్యకి భర్త ఎంత ప్రామూఖ్యమో చెబుతుంది.
తంత్రులు లేనిదే వీణమ్రోగదు.
చక్రాలు లేనిదే రథం కదలదు. అలాగే,
వందకుమారులకు తల్లయినా ఆ పడతి పతికి దూరంగా ఉంటే, నిజమైన సుఖాలకి నోచుకోదు.
ఏ సతికైనాతండ్రిగానీ, తల్లిగానీ, కడుపునపుట్టిన పుత్త్రులుగానీ పరిమతంగా మాత్రమే తోడ్పడగల్గుతారు.
కానీ భర్తమాత్రం ఆమెకి అపరిమితమైన ఐహిక సుఖాలని కూర్చడమేకాక, పారమార్థిక లాభాలనూ పంచి ఇస్తాడు.
కనుక ఏ సతి తన పతిని గౌరవించదు?" అంటుంది.
ఈ విషయం ద్వారా భార్యకు కావల్సినవన్నీ భర్త సమకూరుస్తాడని "భారతీయతలో భర్తల బాధ్యతను" కూడా ప్రస్తావిస్తుంది.
నాతంత్రీ వాద్యతే వీణా
నా చక్రో వర్తతే రథః I
నాపతిస్సుఖమేధేత
యా స్యాదపి శతాత్మజా ॥
మితం దదాతి హి పితా
మితం మాతా మితం సుతః I
అమితస్య హి దాతారం
భర్తారం కా న పూజయేత్ ॥
5. భర్తతో కూడినదే అత్యంత సౌఖ్యం
వనవాసానికి రాముడు సీతని అనుమతించక,
వనాలలోని విషయాలను చెప్పి భయపెడతాడు. అయోధ్యలోనే ఉండమంటాడు.
అప్పుడు, సీత,
"నేను నీ నీడను. తపశ్చర్యకైనా, వనవాసానికైనా, స్వర్గానికైనా నేను నీ వెంటే ఉంటాను." అన్నది.
భర్తతో కలసి ఉన్నప్పుడు, కష్టాలు కూడా తనకు సుఖాలుగానే అనిపిస్తాయని తెలుపుతుంది.
దానికి ఉదాహరణగా,
"వనాలలో సంచరించేటప్పుడు,
(i) మార్గమునందుగల దర్భలు, ఱెల్లుగడ్డి, ముళ్ళదుబ్బలు, ముళ్ళపొదలు, ముళ్ళచెట్లు సైతము
నీ సాహచర్య ప్రభావమున దూది, జింకచర్మము మొదలైన వానివలే సుఖస్పర్శనే గూర్చుతాయి.
(ii) సుడిగాలులకు ఉవ్వెత్తుగా లేచివచ్చి పైబడే దుమ్ములకు బాధపడను.
వాటిని మేలైన చందనంలాగా భావిస్తాను.
(iii) నీతోగూడి పచ్చికబయళ్ళపై పరుండినా,
అవి నాకు చిత్రకంబళాలతో కూడిన తల్పాలకంటే మిక్కిలి సుఖాలని గూర్చుతాయి.
(iv) నీవు తెచ్చియుచ్చే ఆకులు, కందమూలాలు, పళ్ళూ మొదలైనవి కొంచెంగా అయినా సమృద్ధిగా అయినా,
నాకు అవి అమృతతుల్యములే!
వనవాస సమయాన తల్లిదండ్రులగూర్చిగానీ, భవన సుఖములగురించీగానీ స్మరింపనే స్మరింపను.
నీతోగూడి అరణ్యాన ఉన్నా అది నాకు స్వర్గమే!
నీకు దూరంగా రాజభవనమున ఉన్నా అది నాకు నరకమే!" అంటుంది.
6. భర్తతోపాటు భార్య బాధ్యత
లక్ష్మణుడు సీతమ్మను వాల్మీకి ఆశ్రమ పరిసరాల్లో దింపుతాడు.
అప్పుడు, ఆమె పరిత్యజింపబడినదని తెలిసీ, తన భర్తకి పంపిన సందేశం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.
"రామా! సీత పరిశుద్ధురాలనీ, గొప్ప భక్తి కలిగినదనీ, నిత్యమూ నీ హితమును కోరేదనే విషయం నీకు తెలుసు.
ప్రజలలో వచ్చిన అపకీర్తి నుండి భయపడి, నీవు నన్ను త్యజించినావు.
లోకాపవాదము వలన కలిగిన ఈ నిందను నేను తొలగించాలి.
నీవే నా ఉత్తమగతివి కదా!" అంటుంది.
ఇక్కడ సీతా - రాముల మధ్య వ్యక్తగత సంబంధమే కాక, రాణి - రాజు సంబంధం కూడా ఉందని గుర్తించి, రెంటినీ కలిపి ఆలోచించవలసి ఉందని సీతమ్మ మాటలద్వారా తెలుస్తుంది.
7. స్త్రీకి సహజంగా ఉండే జాలీ - మాట నిలబెట్టుకోవడం
త్రిజట తన కల చెప్పి, రాక్షస స్త్రీలతో,
"ఓ రాక్షసస్త్రీలారా!
'ఇంతవరకు ఈమెను ఎంతగానో భయపెడుతూ బాధించాము. ఇప్పుడు ఈమె మనలను క్షమిస్తుందా?' అనే శంకని మానండి.
జనకసుతయైన ఈ సీతాదేవికి నమస్కరించినంత మాత్రముననే ఆమె ప్రసన్నురాలవుతుంది.
ఈ గొప్ప ఆపద నుండి మనలని రక్షించడానికి దయామయురాలైన ఈమెయే సమర్థురాలు." అంటుంది.
ప్రణిపాత ప్రసన్నాహి
మైథిలి జనకాత్మజా I
అలమేషా పరిత్రాతుం
రాక్షస్యో మహతో భయాత్ ॥
అది చూసిన సీతాదేవి,
తనభర్తకు విజయము సిద్ధిస్తుందని ఎరిగి, సంతసించి,
స్త్రీకి సహజ అలంకార బిడియముతో,
"త్రిజట చెప్పిన తన కల విశేషాలు నిజమైతే, మీ అందరికీ నేను శరణు ఇస్తాను." అని అంది.
తతస్సా హ్రీమతీ బాలా భర్తుర్విజయహర్షితా I
అవోచద్యది తత్తధ్యం భవేయం శరణం హి వః ॥
దానినే, రావణవధానంతరం హనుమ వచ్చినపుడు ఆచరించి చూపి, తన మాట నిలబెట్టుకుంది.
ఆంజనేయుడు
"దేవీ! ఈ రాక్షస స్త్రీలు ఇంతకుముందు ఎంతో భయపెట్టారు. బాధించారు.
నీవు అనుమతిస్తే, వీరందఱినీ చంపదలచుకొన్నాను.
ఎందుకంటే, అశోకవనంలో పతిదేవుని స్మరించుచు, శోకంతో కుమిలిపోతున్న నిన్ను, ఈ రాక్షస స్త్రీలు దారుణ కథలు వినిపిస్తూ మిగుల హింసించారు.
వీరందరిన హతమార్చుటకు నాకు వరము అనుగ్రహించు."
అంటాడు.
రాక్షస స్త్రీలు సీతాదేవిని బాధపెట్టడం ప్రత్యక్షంగా చూసినవాడు హనుమ.
హనుమంతుని మాటవిన్న సీతమ్మ,
"ఈ రాక్షస స్త్రీలు రాజునాశ్రయించుకొని అతని అధీనములో ఉన్నవారు.
రాజాజ్ఞలను పాటించుచున్నవారు. ఆయనకు విధేయులు. దాసీలు. ఇట్టివారిపై కోపపడి లాభమేమి?
వీరందరూ రాజాజ్ఞమేరకు నన్ను భయపెట్టారు. బాధించారు.
అతడు మరణించినందున ఇప్పుడు వీరు నన్ను బాధింపరు." అని రాజధర్మాన్ని తెలుపుతుంది.
మరొకపక్క,
"ఒకానొకప్పుడు ఒక ఎలుగుబంటి ఒక పెద్దపులికి ధర్మ సమ్మతమైన ఈ విషయాన్ని తెలిపింది." అని సహజమైన కరుణ - జాలి విషయమైన ధర్మాన్ని ఉటంకిస్తుంది. అది
"ప్రాజ్ఞులు తమకు అపకారము చేసినవారికి కూడ ఎన్నడును కీడు తలపెట్టరు. పైగా వారికి ఉపకారమొనర్చి, ఆదుకొంటారు. ఇది సజ్జనుల ఉదాత్త లక్షణము. సత్పురుషులు పుణ్యాత్ములయెడ ఆదరాభిమానములనూ చూపునట్లే, పాపాత్ములయెడలను, వధార్హుల విషయమునను కనికరమునే చూపుతారు.- అని
న నరః పాపమాదత్తే
పరేషాం పాపకర్మణామ్ I
సమయో రక్షితవ్యస్తు
సంతశ్చారిత్రభూషణాః ॥
"ఈ లోకములో తప్పు చేయనివాడే ఉండడు. కామ రూపులైన రాక్షసులు లోకమును హింసించు ప్రవృత్తి గలవారై ఎట్టి పాపకృత్యములను ఒడిగట్టినా, వారికి దండనము తలపెట్టరాదు." అని కూడా అంటుంది.
"పాపానా వా శుభానాం వా
వధాఽర్హాణాం ప్లవంగమ! I
కార్యం కరుణమార్యేణ
న కశ్చిన్నాఽపరాధ్యతి ॥"
ఆ విధంగా జాలితోనూ, త్రిజటాదులకిచ్చినమాట నిలబెట్టుకొన్నదీ అయిన ఆదర్శ ధర్మమూర్తి సీతాదేవి.
అన్నీ స్త్రీమూర్తికేనా? - మరి పురుషులో!
పురుషుని బాధ్యత - విధి కూడా రామాయణమే తెలుపుతుంది.
సీతమ్మ కనిపించక వేదనతో ఉన్న శ్రీరాముని మనోభావాలు హనుమ ద్వారా తెలుస్తాయి.
శ్రీరాముడి విరహవేదన నాలుగు రకాలుగా ఉందిట.
శ్రీరాముని బాధ చూసినవాడు హనుమ.
ఆ హనుమంతుడు సీతాదేవిని చూడగానే, తర్కించుకొని, తాను చూసినది సీతమ్మయే అని నిర్ధారించుకొని, శ్రీరాముడు సీతాదేవిని గూర్చి పడేబాధని, ఈ విధంగా గుర్తుచేసుకొంటాడు.
(i) కనబడకుండపోయినది స్త్రీ కదా అని జాలి,
(ii)తనను ఆశ్రయించి వచ్చినదీ, ఆమెకు తను తప్ప ఎవరూ రక్షకులు లేరుకదా! అనీ దయ,
(iii) తప్పిపోయినది తనలో సగభాగం - అర్ధాంగిగా పత్ని అయినది కావున శోకము,
(iv) ఇహలోక సౌఖ్యంతోపాటు, పరలోక సౌఖ్యాన్ని కూడా ధర్మాచరణతో అందించే ప్రియురాలు కదా! అని మదనతాపముతోనూ శ్రీరాముడు బాధపడుచున్నాడు.
ఇయం సా యత్కృతే రామః
చతుర్భిః పరితప్యతే I
కారుణ్యేనానృశంస్యేన
శోకేన మదనేన చ ৷৷
స్త్రీ ప్రణష్టేతి కారుణ్యాత్
ఆశ్రితేత్యానృశంస్యతః I
పత్నీ నష్టేతి శోకేన
ప్రియేతి మదనేన చ ৷৷
కాబట్టి, శ్రీరామునిలాగా, ప్రతి పురుషుడూ, "జాలి - దయ - శోకము - తాపము" అనేవి ఎఱిగి శోకతాపములు లేకుండా జాగర్తపడి దాంపత్య సుఖాన్ని అనుభవించాలి.
ప్రస్తుత సమస్య - పరిష్కారం
భార్య - భర్తల మధ్య అవగాహన వంటి విషయాలని,
ఎవరికివారు నిర్వచించుకొంటున్నారు.
చట్టం భారతీయతని ప్రతిబింబించడంలేదు.
జీవితకాలమంతా కలిసి ఉంచవలసిన బంధానికి చట్టం మార్గం చూపడంలేదు.
అదే చట్టం, రాజ్యాంగపరంగా సమాన హక్కులు స్వేచ్ఛ అంటూ,
భార్యా - భర్తలైన స్త్రీ - పురుషులను ఇద్దరినీ వేర్వేరు పౌరులుగా చూపి, హక్కులపేరుతో,
వివాహ బంధాన్ని కలిపి ఉంచే మార్గాన్ని భంగపరుస్తోంది.
జీవన విధానం మారి పాశ్చాత్య అనుకరణకి దారితీసింది.
చలన చిత్రాల వలనా, బుల్లితెర ధారావాహికల, ఇతర కార్యక్రమాల వలనా - విచ్చలవిడితనం పెరుగుతూ,
ముఖ్యంగా యువత ప్రక్కత్రోవ పట్టడం జరుగుతోంది.
వాటి పర్యవసానాలని, విశ్లేషాత్మకంగా తెలిపి,
సమస్య రాకుండానూ, వస్తే తొలగించడానికీ,
శ్రీమద్రామాయణంలో ఇటువంటి విషయాలు మార్గదర్శకాలవుతాయి.
సీతా జయంతి సందర్భంగా మనం రెండు విషయాలు గుర్తించాలి.
(i) సీతాదేవి సాక్షాత్తూ లక్ష్మీదేవియే!
(రాఘవత్వేఽభవత్సీతా)
ఆమెను ప్రార్థిస్తే చాలు, మనలని అనుగ్రహిస్తుంది.
(ii) ఆవిడ దైవమే అయినా, తన కష్టాలని, ఒక మానవమాత్రురాలుగా బాధపడుతున్నట్లు చూపి,
మానవులమైన మనమంతా, వాటి ద్వారా ధర్మాన్ని ఆచరించమని సందేశమిస్తూ,
దైవశక్తిగా తాను అనుగ్రహిస్తుంది.
స్త్రీ పురుషులందరూ, ఈ విషయాలని తెలుసుకొని, ఆచరణలో పెడదాం.
దంపతులందరూ సీతా - రాములుగా ఆదర్శవంతులవుదాం.
సీతా నవమి పేరుతో, సీతా జయంతి అందించే సందేశం ఇదే కదా!
— రామాయణం శర్మ
భద్రాచలం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి