17, మే 2024, శుక్రవారం

మహాభాగవతం



*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*దశమస్కంధము - పూర్వార్ధము - నలుబది రెండవ అధ్యాయము*


*శ్రీకృష్ణుడు కుబ్జపై దయజూపుట - ధనుస్సును విరచి, రక్షకభటులను హతమార్చుట - కంసుడు ఆందోళనకు గురియగుట*


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*42.14 (పదమూడవ శ్లోకము)*


*తద్దర్శనస్మరక్షోభాదాత్మానం నావిదన్ స్త్రియః|*


*విస్రస్తవాసఃకబరవలయాలేఖ్యమూర్తయః॥9883॥*


శ్రీకృష్ణుని దర్శనమైనంతనే నగరభామినుల మనస్సులు ఆ స్వామిపట్ల ఆకర్షింపబడెను. అంతట వారు తమను తాము మఱచిపోయిరి. ఆ పారవశ్యములో వారి వస్త్రములు, కొప్పుముడులు, కంకణములు సడలిపోసాగెను. అప్పుడు వారు చిత్తరవులవలె ఎక్కడివారక్కడ నిశ్చేష్టలై ఉండిపోయిరి.


*42.15 (పదునైదవ శ్లోకము)*


*తతః పౌరాన్ పృచ్ఛమానో ధనుషః స్థానమచ్యుతః|*


*తస్మిన్ ప్రవిష్టో దదృశే ధనురైంద్రమివాద్భుతమ్॥9884॥*


*42.16 (పదహారవ శ్లోకము)*


*పురుషైర్బహుభిర్గుప్తమర్చితం పరమర్ద్ధిమత్|*


*వార్యమాణో నృభిః కృష్ణః ప్రసహ్య ధనురాదదే॥9885॥*


అనంతరము శ్రీకృష్ణుడు పౌరులద్వారా ధనుర్యాగ స్థానమును తెలిసికొని అందు ప్రవేశించెను. అచట ఆ స్వామి ఇంద్రధనుస్సువలె అద్భుతమైన ఒక వింటిని చూచెను. స్వర్ణాలంకార శోభితమైన ఆ ధనుస్సును కొందఱు పురుషులు పూజించుచుండిరి. పెక్కుమంది యోధులు కడు జాగరూకులై దానిని రక్షించుచుండిరి. రక్షకభటులు వారించుచున్నను వారిని లెక్కసేయక శ్రీకృష్ణుడు బలప్రయోగముతో దానిని తన చేతిలోనికి తీసికొనెను.


*42.17 (పదిహేడవ శ్లోకము)*


*కరేణ వామేన సలీలముద్ధృతం సజ్యం చ కృత్వా నిమిషేణ పశ్యతామ్|*


*నృణాం వికృష్య ప్రబభంజ మధ్యతో యథేక్షుదండం మదకర్యురుక్రమః॥9886॥*


పిమ్మట ఆ ప్రభువు తన వామహస్తముతో దానిని అవలీలగా పైకెత్తి, అచటి జనులందఱును చూచుచుండగనే వింటినారిని సంధించెను. ఒక్కనిమిషములో ఆ స్వామి ఆ అల్లెత్రాడును లాగి, బలమైన మదపుటేనుగు చెఱకుగడను వలె, ఆ ధనుస్సును రెండు ముక్కలు గావించెను.


*42.18 (పదునెనిమిదవ శ్లోకము)*


*ధనుషో భజ్యమానస్య శబ్దః ఖం రోదసీ దిశః|*


*పూరయామాస యం శ్రుత్వా కంసస్త్రాసముపాగమత్॥9887॥*


కృష్ణభగవానుడు ఆ ధనుస్సును విఱిచివేయునప్పుడు ఏర్పడిన శబ్దము ఆకాశమునందును, అంతరిక్షమునందును, సకల దిక్కులయందును నిండెను. ఆ ధ్వని చెవుల సోకినంతనే కంసుడు భయముతో వణకిపోయెను.


*42.19 (పందొమ్మిదవ శ్లోకము)*


*తద్రక్షిణః సానుచరాః కుపితా ఆతతాయినః|*


*గ్రహీతుకామా ఆవవ్రుర్గృహ్యతాం వధ్యతామితి॥9988॥*


ఆ ధనుస్సును రక్షించుచున్న యోధులును, వారి అనుచరులును మిగుల కుపితులైరి. పిమ్మట వారు బలరామకష్ణులను హింసింపదలచి సాయుధులై 'పట్టుకొనుడు, బంధింపుడు' అని కేకలు పెట్టుచు, వారిని చుట్టుముట్టిరి.


*42.20 (ఇరువదియవ శ్లోకము)*


*అథ తాన్ దురభిప్రాయాన్ విలోక్య బలకేశవౌ|*


*క్రుద్ధౌ ధన్వన ఆదాయ శకలే తాంశ్చ జఘ్నతుః॥9889॥*


అంతట బలరామకృష్ణులు తమను చంపుటకై ఉద్యుక్తులైన ఆ రాజభటులయొక్క దుడుకుచేష్టలను గమనించి క్రుద్ధులైరి. వెంటనే వారు అచట విఱిగిపడియున్న ధనుస్సుయొక్క ముక్కలను చేబూని, వాటితో ఆ యోధులను చావమోదిరి.


*42.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*


*బలం చ కంసప్రహితం హత్వా శాలాముఖాత్తతః*


*నిష్క్రమ్య చేరతుర్హృష్టౌ నిరీక్ష్య పురసంపదః॥9890॥*


ఆ సమయమున రక్షకభటులకు తోడుగా నిలుచుటకై కంసప్రేరణతో వచ్చిన యోధులను గూడ ఆ యదువీరులు హతమార్చిరి. పిదప వారు యజ్ఞశాల ప్రధాన ద్వారమునుండి బయటికి వచ్చి, మిగుల సంతోషముతో మథురాపుర శోభలను గాంచుచు సంచరించిరి.


 *42.22 (ఇరువది రెండవ శ్లోకము)*


*తయోస్తదద్భుతం వీర్యం నిశామ్య పురవాసినః|*


*తేజః ప్రాగల్భ్యం రూపం చ మేనిరే విబుధోత్తమౌ॥9891॥*


అప్పుడు పురవాసులు అందఱును ఆ మహాపురుషుల యొక్క అద్భుత శౌర్య పరాక్రమములను గూర్చి విని ఎంతయు ఆశ్చర్యపడిరి. పిమ్మట వారు ఆ యదువీరుల యొక్క పటిమను, ధైర్యసాహసములను, నిరుపమాన రూప వైభవములను చూచి, 'వీరు మానవమాత్రులుగారు, దైవాంశ సంభూతులే' అని తలపోసిరి.


 *42.23 (ఇరువది మూడవ శ్లోకము)*


*తయోర్విచరతోః స్వైరమాదిత్యోఽస్తముపేయివాన్|*


*కృష్ణరామౌ వృతౌ గోపైః పురాచ్ఛకటమీయతుః॥9892॥*


ఆ సోదరులు ఇరువురు నగర వీథులలో స్వేచ్ఛగా సంచరించుచుండిరి. ఇంతలో సూర్యుడు అస్తమించెను. అంతట బలరామకృష్ణులు తోడిగోపాలురతో గూడి నగరమునకు వెలుపల నందాదులు విశ్రమించుచున్న తమ బండ్లకడకు చేరిరి.


 *42.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*


*గోప్యో ముకుందవిగమే విరహాతురా యాః ఆశాసతాశిష ఋతా మధుపుర్యభూవన్|*


*సంపశ్యతాం పురుషభూషణగాత్రలక్ష్మీం హిత్వేతరాన్ ను భజతశ్చకమేఽయనం శ్రీః॥9883॥*


పొంకమైన శరీరాంగముల వైభవమును బట్టి లక్ష్మీదేవి జగదేకసుందరి. ఆమె సౌందర్యాతిశయమునకు ముగ్ధులైన బ్రహ్మాదిదేవతలు 'ఆమె తమకు దక్కిన బాగుండును' అని ఎంతగానో కోరికపడిరి. కాని ఆ లక్ష్మీదేవి మాత్రము ఆ శ్రీహరియొక్క సర్వాంగరూప వైభవమునకు ఆకర్షితురాలై ఆ పురుషోత్తముని వరించినది. అనగా శ్రీహరియొక్క లోకాతీతమైన అవయవ సౌభాగ్యము అతిలోక లావణ్యవతియైన లక్ష్మీదేవిని గూడ ముగ్ధురాలిని చేసినదన్నమాట. అట్టి పరమపురుషుని యొక్క అపురూప సౌభాగ్యములను గాంచుచు ఆనందించెడి భాగ్యము అబ్బుట పెక్కుజన్మల తపఃఫలముగాక మఱేమగును. ఈ విషయమును గూర్చియే శ్రీకృష్ణుడు గోకులమును వీడి మథురకు వచ్చుచున్నప్పుడు విరహాతురలైన గోపికలు ఇట్లు అనుకొనిరి. "రేపటి సుప్రభాతము మథురానగరవాసులకు సుఖావహము కాగలదు". గోపికలు నాడు పలికిన మాటలు నేడు సత్యములైనవి. ఏలయన మథురవాసులు శ్రీకృష్ణుని సౌందర్యమాధుర్యములను తనివిదీర ఆస్వాదించుచు పరమానందభరితులైరి.


 *42.25 (ఇరువది ఐదవ శ్లోకము)*


*అవనిక్తాంఘ్రియుగలౌ భుక్త్వా క్షీరోపసేచనమ్|*


*ఊషతుస్తాం సుఖం రాత్రిం జ్ఞాత్వా కంసచికీర్షితమ్॥9894॥*


విడుదులకు చేరిన పిమ్మట బలరామకృష్ణులు పాదములను,హస్తములను ప్రక్షాళనమొనర్చుకొని, పాయసాన్నములవంటి ఆహారమును ఆరగించిరి. మఱునాడు కంసుడు చేయదలచిన పన్నుగడలను గూర్చి ఎఱింగి, వారు ఆ రాత్రి సుఖముగా గడపిరి.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి నలుబది రెండవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319

కామెంట్‌లు లేవు: